Mary Milliben: నేను భారత మహిళను అయ్యుంటే..?: నీతీశ్‌ వ్యాఖ్యలపై అమెరికన్‌ సింగర్‌ ఫైర్‌

ప్రముఖ అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్‌(Mary Milliben).. బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్( Nitish Kumar) చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. అలాగే ప్రధాని మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. 

Published : 09 Nov 2023 12:30 IST

వాషింగ్టన్‌: బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌(Nitish Kumar) ‘జనాభా నియంత్రణ’వ్యాఖ్యలపై ప్రముఖ అమెరికన్‌ గాయని మేరీ మిల్బెన్‌ (Mary Milliben) స్పందించారు. ఆయన మాటలను ఖండించారు. అలాగే ప్రధాని మోదీ(Modi) పాలనను ప్రశంసించారు.

ఇటీవల బిహార్‌(Bihar)లో నిర్వహించిన కులగణనకు సంబంధించిన నివేదికను రెండురోజుల క్రితం అసెంబ్లీలో ప్రవేశపెట్టే సందర్భంగా నీతీశ్‌( Nitish Kumar) మాట్లాడుతూ.. ‘చదువుకున్న మహిళకు భర్తను ఎలా నియంత్రించాలో తెలుసు’ అని కొంత అభ్యంతరకర భాషలో మాట్లాడారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఏకంగా ప్రధాని మోదీ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. తాజాగా వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ.. మిల్బెన్‌ సుదీర్ఘ పోస్టు పెట్టారు.

‘భారత సోదరసోదరీమణులకు నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా మరీ ముఖ్యంగా అమెరికా, భారత్‌లో 2024 ఎన్నికల సీజన్‌ మొదలైంది. కాలం చెల్లిన ఆలోచనలకు ముగింపు పలికి ప్రగతిశీల ఆలోచనలను భర్తీ చేసే అవకాశాన్ని ఈ ఎన్నికలు కల్పిస్తాయి. భారత ప్రధాని నరేంద్రమోదీకి ఎందుకు మద్దతు ఇస్తావని, భారత వ్యవహారాలపై ఎందుకంత ఆసక్తి చూపుతావని చాలా మంది నన్ను ప్రశ్నిస్తుంటారు. ఎందుకంటే.. నాకు భారత్ అంటే ప్రేమ. అమెరికా- భారత్ బంధానికి, అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వానికి మోదీ నాయకత్వం సరైనది’ అని మోదీ(Modi) నాయకత్వాన్ని కొనియాడారు.

బ్రిటన్‌ ప్రధాని ఇంట దీపావళి సంబరాలు

‘ప్రస్తుతం ఇండియా ఒక కీలకమైన సమయాన్ని ఎదుర్కొంటోంది. బిహార్‌లో మహిళలకు విలువనివ్వడమనేది సవాలుగా మారింది. దీనికి ఒకటే సమాధానం ఉందని నా నమ్మకం. నీతీశ్‌జీ వ్యాఖ్యల తర్వాత.. బిహార్‌ ముఖ్యమంత్రి పదవి కోసం ఒక ధైర్యవంతురాలైన మహిళ ముందుకు రావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను.  నేను భారతీయ మహిళను అయ్యుంటే..  బిహార్‌కి వెళ్లి ముఖ్యమంత్రి పదవికి పోటీ చేసుండేదాన్ని. నీతీశ్‌ కుమార్‌ రాజీనామా చేయాల్సిన సమయం వచ్చిందనుకుంటున్నాను. ‘జవాన్‌’ సినిమాలో ఎస్‌ఆర్‌కే(షారుక్‌ ఖాన్‌) ‘ఓటు వేయండి, మార్పు తీసుకురండి’ అని సూచించారు. బిహార్‌ ప్రజలకు నేను కూడా ఇదే సూచిస్తున్నాను’ అని మిల్బెన్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.  

ప్రఖ్యాత అమెరికన్‌ గాయని మేరీ మిల్బెన్‌ (Mary Milliben)కు కొత్తగా పరిచయం అవసరం లేదు. కొద్దినెలల క్రితం అమెరికాలో ప్రధాని మోదీ (PM Modi) అధికారిక పర్యటన ముగింపు కార్యక్రమంలో మేరీ మిల్బెన్‌  భారత జాతీయ గీతం ‘జనగణమన’ ఆలపించారు. అనంతరం ప్రధాని పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని