భూములు తీసుకొని వినతుల్ని విస్మరిస్తారా?
close

ప్రధానాంశాలు

భూములు తీసుకొని వినతుల్ని విస్మరిస్తారా?

ఏడాదిన్నరైనా ఎందుకు కౌంటరు దాఖలు చేయలేదు?

మల్లన్నసాగర్‌ పరిహారంపై ప్రభుత్వ తీరు పట్ల హైకోర్టు అసహనం

విజ్ఞాపనలపై నిర్ణయం చెప్పాలని ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: కొడుకులు, కుమార్తెలతో సంబంధంలేకుండా ఒంటరిగా ఉన్న వృద్ధులను కుటుంబంగా పరిగణించి పరిహారం చెల్లించాలన్న వినతులను ఎందుకు పరిష్కరించలేదని హైకోర్టు మంగళవారం ప్రభుత్వాన్ని నిలదీసింది. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిమిత్తం ఆస్తులను తీసుకుని వారి వినతి పత్రాలను మాత్రం పట్టించుకోరా అని ప్రశ్నించింది. వినతి పత్రాలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని, ప్రతి ఒక్కరూ కోర్టులను ఆశ్రయించలేరని పేర్కొంది. ఏడాదిన్నర దాటినా... చివరి అవకాశమని చెప్పినా కౌంటరు దాఖలు చేయకపోవడంపై అసహనం వ్యక్తంచేసింది. పిటిషనర్లు ఇచ్చిన వినతి పత్రాలపై ఏం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలంటూ విచారణను ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు కఠిన చర్యలు తీసుకోవద్దని సూచించింది.

ప్రభుత్వానికి కష్టం కాదు

మల్లన్నసాగర్‌ భూసేకరణలో నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ వేర్వేరుగా పిటిషన్‌లు దాఖలయ్యాయి. వీటిపై మంగళవారం జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ పి.నవీన్‌రావులతో కూడిన ప్రత్యేక గ్రీన్‌బెంచ్‌ విచారణ చేపట్టింది. ఏజీ కార్యాలయం తరఫు న్యాయవాది పి.రాధీవ్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘ఇలాంటి పిటిషన్‌లు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉన్నాయి. అవి పరిష్కారమయ్యాక వీటిపై విచారణ చేపట్టాలి’’ అని కోరారు. దీనిపై పిటిషనర్‌ తరఫు న్యాయవాది విభేదించారు. ‘‘అక్కడ ఉన్నది పెళ్లికాని యువతకు సంబంధించిన అంశం. ఇక్కడ కొడుకులతో సంబంధంలేకుండా భర్త, లేదా భార్య మృతి చెందిన ఒంటరి వృద్ధులది. కనీసం కౌంటరు కూడా దాఖలు చేయలేదు. పిటిషన్‌లలో స్టే ఉన్నప్పటికీ బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. 75 ఇళ్లను కూల్చివేస్తున్నారు’’అని తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ...‘‘అర్హులైనవారికీ ఎందుకు పరిహారం చెల్లించలేదు? పేదలకు, భూములు లేనివారికి ప్రభుత్వం భూములిస్తోంది. ఉన్నవాళ్ల నుంచి తీసుకున్నవారికి మాత్రం పరిహారం ఇవ్వరా? పరిహారం చెల్లించాలనుకుంటే ఇంత ప్రభుత్వానికేమీ కష్టంకాదు. పిటిషనర్లు సమర్పించిన వినతి పత్రాలను పరిశీలించి వారి అర్హతలకు సంబంధించి నిర్ణయం తీసుకుని చెప్పండి. ఒకవేళ అధికారులు సానుకూల నిర్ణయం తీసుకుంటే ఈ పిటిషన్‌లపై విచారించాల్సిన అవసరమే లేదు. లేదంటే ఎందుకు నిరాకరిస్తున్నారో చెబితే ఆ అంశాన్ని మేం తేలుస్తాం’’ అని స్పష్టం చేసింది.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని