రంగన్న ఏం చెప్పారు?

ప్రధానాంశాలు

రంగన్న ఏం చెప్పారు?

వివేకా మృతదేహాన్ని మొదట చూసింది ఈయనే
హత్య కేసులో న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం
అందులో సంచలన విషయాలున్నాయని ప్రచారం

ఈనాడు-అమరావతి, ఈనాడు డిజిటల్‌-కడప, న్యూస్‌టుడే-జమ్మలమడుగు, పులివెందుల: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్‌, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన ఇంటి వద్ద కాపలాదారుగా పనిచేసిన భడవాండ్ల రంగన్న అలియాస్‌ రంగయ్య (65) శుక్రవారం న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. సీఆర్‌పీసీ 164 సెక్షన్‌ ప్రకారం జమ్మలమడుగు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు న్యాయమూర్తి బాబా ఫకృద్దీన్‌ దాన్ని నమోదు చేసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ రంగన్నను పలుమార్లు ప్రశ్నించింది. ఆయన తెలిపిన వివరాలపై వాంగ్మూలం తీసుకునేందుకు వీలుగా సీబీఐ అధికారులు రంగన్నను న్యాయమూర్తి ఎదుట శుక్రవారం హాజరుపరిచారు. ఉదయం 10 గంటలకు న్యాయమూర్తి ఎదుట ఆయన్ను హాజరుపరిచారు. 11.30 గంటలకు మొదలైన వాంగ్మూలం నమోదు 12.45 వరకూ కొనసాగింది. ఆ సమయంలో న్యాయమూర్తి, రంగన్న మాత్రమే లోపల ఉన్నారు. ఇతరులను అనుమతించలేదు. ఈ వాంగ్మూలాన్ని ఆయన సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తికి పంపించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు రంగన్న సీబీఐ అధికారులతో కలిసి వెళ్లిపోయారు. రాత్రి 8.30 సమయంలో ఆయన్ను పులివెందుల బస్టాండు వద్ద విడిచిపెట్టారు. అక్కడి నుంచి తన ఇంటికి రంగన్న నడుచుకుంటూ వెళ్లారు. ఆయన న్యాయమూర్తి ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు ఉన్నాయని, హత్యకు సంబంధించిన కీలకమైన విషయాల్ని ఆయన వెల్లడించారని టీవీ ఛానెళ్లు, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం సాగింది.


ఎవరీ రంగన్న

కర్నూలు జిల్లా అవుకు మండలం కాశీపురానికి చెందిన రంగన్న బతుకుతెరువు కోసం 16 ఏళ్ల కిందట పులివెందులకు వచ్చారు. తొలుత పులివెందుల పురపాలిక పరిధిలో స్వీపరుగా పనిచేశారు. 2017 నుంచి వివేకానందరెడ్డి ఇంటికి కాపలాదారుగా ఉన్నారు. వివేకా హత్య జరిగిన 2019 మార్చి 15 నాటికి ఆయనే ఆ ఇంటి కాపలాదారు. వివేకా బతికి ఉండగా చివరిసారి, చనిపోయాక మొదటిసారి చూసింది ఈయనే. మార్చి 15 ఉదయం వివేకా నిద్రలేచి బయటకు రాకపోయేసరికి పక్క డోరులో నుంచి లోపలికి వెళ్లి ఆయన స్నానపు గదిలో రక్తపుమడుగులో ఉన్నట్లు చూసి ఆ విషయాన్ని బయటకు వచ్చి చెప్పింది రంగన్నే. ఈ కేసులో సీబీఐ విచారణ కోరుతూ వివేకా కుమార్తె సునీత హైకోర్టులో దాఖలుచేసిన రిట్‌ పిటిషన్‌లో పేర్కొన్న అనుమానితుల జాబితాలో రంగన్న పేరూ ఉంది. హత్యకు సంబంధించిన విషయాలు రంగన్నకు తెలిసే అవకాశం ఉందని, అవి బయటపెడితే జరిగే పరిణామాలకు భయపడి ఆయన చెప్పకపోవచ్చని సునీత ఆ పిటిషన్‌లో ప్రస్తావించారు.


తన పేరు చెబితే నరుకుతానని ఎర్ర గంగిరెడ్డి బెదిరించాడు

- నాపై ఈగ వాలనివ్వబోమని సీబీఐ అధికారులు హామీ ఇచ్చారు: రంగన్న

‘ఎవరికైనా నా పేరు చెబితే నిన్ను నరుకుతా’ అంటూ ఎర్ర గంగిరెడ్డి తనను బెదిరించారని రంగన్న అలియాస్‌ రంగయ్య తెలిపారు. అందుకే తాను భయపడి ఏమీ చెప్పలేదన్నారు. తనపై ఈగ వాలనివ్వబోమని సీబీఐ అధికారులు చెప్పారన్నారు. జమ్మలమడుగు న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చిన తర్వాత శుక్రవారం రాత్రి పులివెందులకు చేరుకున్న ఆయన కొంతమంది స్థానికులు, విలేకర్లతో మాట్లాడారు. ఆ వీడియోలు వైరల్‌ అయ్యాయి. న్యాయమూర్తి ఎదుట ఏం చెప్పారని అడగ్గా, తనకు భయం వేస్తోందని రంగన్న సమాధానమిచ్చారు. భయపడాల్సిన పనిలేదని పదే పదే ప్రశ్నించగా అక్కడున్నవారి చెవిలో ఎర్ర గంగిరెడ్డి, వివేకా పాత డ్రైవర్‌ దస్తగిరి, సునీల్‌కుమార్‌ పేర్లను చెప్పారు. ఎవరితోనూ ఏమీ చెప్పొద్దని, ఏం అడిగినా ఏమీ తెలియదని సమాధానం చెప్పాలంటూ తనకు సీబీఐ అధికారులు సూచించారని వివరించారు. అయితే, అంతకుముందు మాత్రం అసలు న్యాయమూర్తితో ఏం చెప్పానో తనకు గుర్తులేదన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని