పథకాలతో ప్రభుత్వం.. లోపాలపై విపక్షం

ప్రధానాంశాలు

పథకాలతో ప్రభుత్వం.. లోపాలపై విపక్షం

నేటి నుంచి శాసనసభ ప్రారంభం

ఎనిమిది బిల్లులు సిద్ధం

అస్త్రశస్త్రాలతో అధికార, విపక్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: బడ్జెట్‌ సమావేశాల తర్వాత ఆరు నెలలకు అసెంబ్లీ కొలువుదీరుతోంది. శుక్రవారం నుంచి సభ ప్రారంభం కానుంది. దళితబంధు వంటి సరికొత్త పథకాలను సభ ముందుంచడానికి ప్రభుత్వం సిద్ధమవుతుండగా.. గతంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి తదితర హామీల అమలు గురించి నిలదీయడానికి ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. మరోపక్క ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రాజకీయం వేడెక్కింది. సభలు, సమావేశాలు, పాదయాత్రలు జోరందుకున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లతో పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ప్రభుత్వం దళితబంధుపై చర్చను ప్రధానాంశంగా తీసుకోనుంది.  యాదాద్రి జిల్లా వాసాలమర్రి, హజూరాబాద్‌ నియోజకవర్గాలతో పాటు మరో 4 నియోజకవర్గాల్లో ఒక్కో మండలం చొప్పున ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని ప్రకటించింది. దళితబంధుకు చట్టబద్ధత కల్పించే బిల్లు సందర్భంగా ఈ అంశాలపై చర్చకు అవకాశం ఉంది. ఇతర వర్గాలకూ ఇలాంటి పథకం తేవాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యం కొనుగోలుకు నిరాకరించడం, ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కేంద్ర వైఖరి, కృష్ణా, గోదావరి బోర్డులపై నోటిఫికేషన్‌ జారీ వంటి వాటిపైనా చర్చ జరగనుంది. ధాన్యం కొనుగోళ్లు, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఉద్యోగాల భర్తీ అంశాలు ప్రస్తావనకొచ్చే అవకాశం ఉంది. శాంతి భద్రతలు, మహిళలు-చిన్నారులపై దాడులు, డ్రగ్స్‌ వంటి అంశాల పైనా చర్చించే వీలుంది. ఛార్జీలు పెంచాలని ఆర్టీసీ, విద్యుత్‌ సంస్థలు కోరిన తరుణంలో వాటిపైనా చర్చించనున్నారు. మొత్తం 8 బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. దళితబంధుకు చట్టబద్ధత, పర్యాటకులు, ప్రయాణికులకు దళారుల ఆగడాలను నిలువరించేలా తీసుకొస్తున్న ప్రత్యేక చట్టం కోసం ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, కొండా లక్ష్మణ్‌ ఉద్యానవన విశ్వవిద్యాలయాల చట్టాలను సవరిస్తూ గతంలో జారీచేసిన ఆర్డినెన్స్‌ స్థానంలో బిల్లులు పెట్టనుంది. రిజిస్ట్రేషన్లు, జీఎస్టీ, పురపాలక, పంచాయతీరాజ్‌ చట్టాల సవరణ బిల్లులు ఉభయసభల ముందుకు రానున్నాయి. కాంగ్రెస్‌ కనీసం 20 రోజులైనా సభ నిర్వహించాలని ఒత్తిడి తేవాలని చూస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలే తమ ఎజెండాగా భాజపా ప్రకటించింది. నిరుద్యోగం, పంటలసాగు, కొనుగోళ్లు, ధరణి పోర్టల్‌ సమస్య, రెండు పడకగదుల ఇళ్లు, శాంతిభద్రతలు తదితరాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టనున్నాయి. ఈటల రాజేందర్‌ను మంత్రిపదవి నుంచి తొలగింపు, ఆయన రాజీనామా నేపథ్యంలో జరగనున్న ఉప ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. గత ఏడాదిన్నరగా అనుసరిస్తున్నట్లే ఈసారీ కరోనా నిబంధనలను పాటిస్తూ సమావేశాలు జరుగుతాయి.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని