టీకా సంస్థల పాత్ర అద్భుతం

ప్రధానాంశాలు

టీకా సంస్థల పాత్ర అద్భుతం

వ్యాక్సినేషన్‌ విజయంతో ప్రపంచం చూపు భారత్‌ వైపు 

టీకా తయారీదారులతో మోదీ సమావేశం

ఈనాడు, దిల్లీ: కరోనా మహమ్మారిపై పోరులో ప్రధాన ఆయుధమైన వ్యాక్సినేషన్‌లో 100 కోట్ల డోసుల మైలురాయి చేరుకోవడానికి చేయూతనందించిన సంస్థలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ ఘన విజయంలో టీకా తయారీ సంస్థలు గొప్ప పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు. కష్టకాలంలో మహమ్మారిని ఎదుర్కోవడానికి వారు కల్పించిన విశ్వాసం, వ్యాక్సిన్‌ అభివృద్ధిలో వారు చేసిన కఠోర శ్రమను అభినందించారు. శనివారం ఆయన టీకా తయారీదారులతో తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. ‘‘ఏడాదిన్నరగా పలు అంశాల్లో అనుసరిస్తూ వచ్చిన ఉత్తమ విధానాలను వ్యవస్థీకృతం చేయాలి. వాటిని ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా సవరించుకోవడానికి ఇదో అవకాశం. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో మనం సాధించిన ఘనవిజయం నేపథ్యంలో ప్రపంచం మొత్తం భారత్‌వైపు చూస్తోంది. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి టీకా తయారీదారులంతా నిరంతరం కలిసికట్టుగా పనిచేయాలి’’ అని పిలుపునిచ్చారు.

మోదీ అద్భుత నాయకత్వ పటిమ: టీకా తయారీదారులు

వ్యాక్సిన్‌ అభివృద్ధి సమయంలో ప్రధాన మంత్రి నిరంతరం మార్గదర్శనం చేస్తూ అద్భుతమైన నాయకత్వ పటిమను ప్రదర్శించారని దేశీయ వ్యాక్సిన్‌ తయారీదారులంతా ప్రశంసించారు. ప్రభుత్వం, పరిశ్రమ మధ్య ఇంతటి సమన్వయాన్ని  ప్రధానమంత్రి కొవాగ్జిన్‌ టీకా తీసుకోవడంతోపాటు, వ్యాక్సిన్‌ అభివృద్ధి సమయంలో నిరంతరం స్ఫూర్తినిస్తూ అండగా నిలిచారని భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల ధన్యవాదాలు తెలిపారు. ప్రధానమంత్రి దార్శనికత వల్లే వ్యాక్సినేషన్‌లో భారత్‌ ఇంతటి మైలురాయికి చేరుకోగలిగిందని బయలాజికల్‌-ఈ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహిమా దాట్ల పేర్కొన్నారు. నియంత్రణలపరంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను సీరం ఇన్‌స్టిట్యూట్‌ అధిపతులు సైరస్‌ పూనావాలా, అదర్‌ పూనావాలా కొనియాడారు. తొలినుంచి ఇప్పటివరకూ ప్రభుత్వం, పరిశ్రమ మధ్య మంచి సమన్వయం నెలకొందని రెడ్డీస్‌ ల్యాబ్‌ ప్రతినిధి సతీశ్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత్‌ బయోటెక్‌ జేఎండీ సుచిత్ర ఎల్ల, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ, సహాయ మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌, నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ పాల్గొన్నారు.


ప్రతికూలతలను అవకాశాలుగా మార్చుకున్నారు

‘‘దేశాన్ని చూసి గర్విస్తున్నాం. 100 కోట్ల డోసుల మైలురాయిని చేరుకోవడం అంత సులభంకాదు. ఈ విషయంలో సంపూర్ణ లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రధానమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారు. తొలినాళ్లలో ఉన్న ప్రతికూల పరిస్థితులన్నింటినీ అవకాశాలుగా మలుచుకొని అనుకున్నది సాధించారు. భారత్‌ బయోటెక్‌ దేశీయంగా అభివృద్ధిచేసిన కొవాగ్జిన్‌ టీకాను ప్రధానమంత్రి తీసుకున్నారు. అది భారత నవకల్పనకు నిదర్శనం. ఇది భారతీయ అంకుర సంస్కృతికి, ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’కు మేలుచేస్తుంది.’’ 

- కృష్ణ ఎల్ల, భారత్‌ బయోటెక్‌


భవిష్యత్తు సవాళ్లపై చర్చించాం

‘‘పరిశ్రమ ప్రభుత్వంతో కలిసికట్టుగా పనిచేసింది. అందువల్లే 100 కోట్ల డోసుల మైలురాయిని చేరుకున్నాం. భవిష్యత్తులో ఎదురయ్యే మహమ్మారులకు ఎలా సమాయత్తం కావాలన్నదానిపై ఈ సమావేశంలో చర్చించాం. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు వ్యాక్సిన్‌ ఉత్పత్తిపై పెట్టుబడి పెడుతున్నాయి. ఈ విషయంలో భారత్‌ ఒక అడుగు ముందుకేయాల్సి ఉంది. దానిపై చర్చించాం.’’

-అదర్‌ పూనావాలా, సీరం ఇన్‌స్టిట్యూట్‌


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని