హవ్వ... ఆక్సిజన్‌ మరణాలు లేవా?
close

ప్రధానాంశాలు

హవ్వ... ఆక్సిజన్‌ మరణాలు లేవా?

విదేశాలకు ఎగుమతులతోనే ప్రాణాలు పోయాయి: ప్రియాంక
మృతుల కుటుంబీకులు కేంద్రాన్ని కోర్టుకీడ్చాలి: శివసేన
విపక్షాలది రాజకీయం: భాజపా

దిల్లీ, ముంబయి: కరోనా రెండో ఉద్ధృతి సమయంలో దేశంలో ఎవరూ ఆక్సిజన్‌ కొరత కారణంగా ప్రాణాలు కోల్పోలేదని కేంద్రం పార్లమెంటులో ప్రకటించడంపై కాంగ్రెస్‌, శివసేన, ఆమ్‌ ఆద్మీ పార్టీలు తప్పు పట్టాయి. ఒకపక్క వైరస్‌ ఉద్ధృతి ఉన్నా కేంద్రం మాత్రం ఆక్సిజన్‌ ఎగుమతుల్ని 700% మేర పెంచడం, దేశీయ రవాణాకు ట్యాంకర్లు సమకూర్చకపోవడం వల్ల మరణాలు సంభవించాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బుధవారం ఆరోపించారు. ఆక్సిజన్‌ విషయంలో సాధికార బృందం, పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సుల్ని సయితం ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు చొరవ చూపలేదని తప్పుపట్టారు. శివసేన ముఖ్య అధికార ప్రతినిధి, ఎంపీసంజయ్‌రౌత్‌ ముంబయిలో స్పందిస్తూ.. ఆక్సిజన్‌ కొరత వల్ల ప్రాణాలు కోల్పోయిన బాధితుల తరఫున వారి కుటుంబీకులు కేంద్రాన్ని కోర్టుకు ఈడ్చి నిలదీయాలని పిలుపునిచ్చారు. 

కరోనా మరణాలే లేవంటారేమో: ఆప్‌
ఆక్సిజన్‌పై కేంద్రం చేసిన ప్రకటన పూర్తిగా అవాస్తవమని దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ (ఆప్‌) చెప్పారు. ఆక్సిజన్‌ కొరత వల్ల మరణాలు సంభవించకపోతే ఆసుపత్రులు ప్రతిరోజూ ఎందుకు హైకోర్టుల్ని ఆశ్రయించాయని ప్రశ్నించారు. దిల్లీ సహా దేశంలో అనేకచోట్ల మరణాలు సంభవించాయని స్పష్టం చేశారు. ఆక్సిజన్‌ కొరతతో చనిపోయినవారి సమాచారాన్నే కేంద్రం అడగలేదని, ఆప్‌ సర్కారు సొంత ప్రయత్నాలతో దానిని సేకరించిందని చెప్పారు. కేంద్రం మాటలు చూస్తుంటే రేప్పొద్దున్న అసలు కరోనా మరణాలే లేవని కూడా చెప్పేలా ఉందని ఎద్దేవా చేశారు.  రాష్ట్రాలు సమకూర్చిన సమాచారం ఆధారంగానే కేంద్రం ప్రకటన చేసిందని భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ సహా విపక్షాలన్నీ ఈ అంశం మీద రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. కరోనా సమయంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ఆరోపించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని