తితిదే పాలకమండలి సభ్యులు 18 మందికి హైకోర్టు నోటీసులు

ప్రధానాంశాలు

తితిదే పాలకమండలి సభ్యులు 18 మందికి హైకోర్టు నోటీసులు

ఏపీ ప్రభుత్వంతో పాటు ఈవోకూ జారీ

ఈనాడు, అమరావతి: నేరచరిత్ర, రాజకీయపార్టీలతో సంబంధం ఉన్న వారిని తితిదే పాలకమండలి సభ్యులుగా నియమించారంటూ భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి, తితిదే మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడు జి.భానుప్రకాశ్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. 18 మంది తితిదే బోర్డు సభ్యులతో పాటు దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి, తితిదే కార్యనిర్వహణ అధికారి(ఈవో)కి నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. హైకోర్టు నోటీసులు జారీ చేసిన వారిలో పాకల అశోక్‌, మల్లాది కృష్ణారావు, ఎమ్మెల్యే కె.విద్యాసాగర్‌, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, అల్లూరి మల్లేశ్వరి, ఎమ్మెల్యే ఆర్‌.విశ్వనాథరెడ్డి, బి.మధుసూదనయాదవ్‌, ఎమ్మెల్యే కె.సంజీవయ్య, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బండి పార్థసారథిరెడ్డి, ఎన్‌.శ్రీనివాసన్‌, రాజేశ్‌ శర్మ, ఎమ్మెల్యే ఏపీ నందకుమార్‌, డాక్టర్‌ కేతన్‌ దేశాయ్‌, పి.సనత్‌కుమార్‌, జూపల్లి రామేశ్వరరావు, ఎం.కేశవ్‌ నర్వేకర్‌, ఎంఎన్‌.శశిధర్‌ ఉన్నారు.  బుధవారం ఈ వ్యాజ్యంపై జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. ‘దేవాదాయ చట్ట సెక్షన్‌ 18,19కి విరుద్ధంగా క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న వారిని, రాజకీయపార్టీలతో సన్నిహిత సంబంధం ఉన్న వారిని తితిదే బోర్డు సభ్యులుగా నియమించారు. అలాంటి వారిని బోర్డు సభ్యులుగా నియమించడానికి వీల్లేదు. మొత్తం 18మంది బోర్డు సభ్యులను ప్రతివాదులుగా చేరుస్తూ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశాం...’ అని పేర్కొన్నారు. భారత వైద్య మండలి మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ కేతన్‌దేశాయ్‌కి సంబంధించిన చరిత్ర వివరాల్ని పరిశీలించాలని కోరారు. పరిశీలించిన ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడానికి ఆ వివరాలు చాలని అభిప్రాయం వ్యక్తం చేసింది.


శ్రీవారికి రూ.1.83 కోట్ల విలువైన బంగారు బిస్కెట్ల విరాళం

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారికి కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్‌ సీ ప్రాపర్టీస్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ప్రతినిధులు రూ.1.83 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లను విరాళంగా అందించారు. బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న సంస్థ ప్రతినిధులు ఆలయంలోని రంగనాయకుల మండపంలో 3.604 కిలోల బంగారు బిస్కెట్లను తితిదే అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని