తూటాలా మాట్లాడండి..
close
Published : 10/03/2020 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తూటాలా మాట్లాడండి..

ఉద్యోగం- ఉల్లాసం

సలసల నూనె మసులుతోంది. పూరీలు వేస్తుందామె. ఇంతలో గ్యాస్‌ అయిపోయింది. అయినా.. నూనె వేడి తగ్గేలోపు ఇంకో అయిదారు పూరీలు చేసేసింది. ఈ సూత్రాన్నే మంగళ్‌యాన్‌కు ప్రతిపాదించిందా శాస్త్రవేత్త. అక్కడున్న మగ శాస్త్రవేత్తలు హేళనగా నవ్వారు. ‘హోమ్‌సైన్స్‌కు.. స్పేస్‌సైన్స్‌కు.. లింకెడతావేంటీ?’ అని చిన్నబుచ్చారు. నవ్విన ఆ ఆలోచన సూపర్‌ సక్సెస్‌ అయింది. ఈ సన్నివేశం ‘మిషన్‌ మంగళ్‌’ చిత్రంలోనిది. అందరూ నవ్వుకుంటారని ఆమె నోరువిప్పి మాట్లాడకపోయి ఉంటే?

సాధన ప్రతినెలా జరిగే మేనేజ్‌మెంట్‌ మీటింగులకు ఎంతో కష్టపడి ప్రిపేర్‌ అవుతుంది. సమావేశానికి కొన్ని వారాల ముందే అవసరమైన వివరాలన్నింటినీ సేకరించి ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. కానీ సమావేశం ముగిసేసరికి ఎక్కడలేని నిరుత్సాహం ఆమెను ఆవరిస్తుంది. అక్కడికొచ్చే ఉద్యోగుల్లో పద్నాలుగు మంది పురుషులుంటే సాధనతో కలిపి ముగ్గురే ఉద్యోగినులు ఉన్నారు. ఆమె తన మేనేజర్‌, సహోద్యోగులతో పంచుకున్న ఆలోచనలు.. సమావేశాల్లో మరొకరు ఎంతో ఆసక్తికరంగా వివరిస్తుంటారు. మేనేజర్‌ కూడా బల్ల చరుస్తుంటారు. ఈ వివక్షే ఆమె నమ్మకాన్ని దెబ్బతీస్తుంటుంది. ఇది సాధన మాత్రమే ఎదుర్కొంటోన్న సమస్య కాదు. చాలామంది ఉద్యోగినులు అనుభవించేదే!


సమావేశాల్లో ఉద్యోగినులు ఒక విషయాన్ని గురించి మాట్లాడుతుంటే... వాళ్లకు దాన్ని విడమర్చి, అర్థమయ్యేలా చెప్పే సామర్థ్యం లేనట్టుగా భావిస్తారు పురుష ఉద్యోగులు. వెంటనే ఆ అంశాన్ని పెద్ద గొంతుకతో బల్లగుద్దినట్టుగా చెబుతుంటారు. అదే విషయాన్ని ఎంతో ఆకర్షణీయంగా వర్ణించి చెబుతుంటారు. ఇలా చాలా సందర్భాల్లో జరుగుతూనే ఉంటుంది. దీంతో కాస్త నిరుత్సాహానికి గురైన ఉద్యోగినులు ఆ విషయం గురించి ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు.


గతంలో మీరు చెప్పిన విషయాన్నే సమావేశంలో మీ సహోద్యోగి మరింత గట్టిగా నమ్మకంతో చెబుతున్నారనుకోండి.... మధ్యలో మీరు తెలివిగా కొన్ని ప్రశ్నలు వేయవచ్చు. మీ ఆలోచన కంటే ఇది ఏ విధంగా భిన్నమైందో చెప్పమనవచ్చు. లేదా ‘నేను చెప్పిన విషయాన్నే మీరు మళ్లీ చెబుతున్నారంటే... నన్ను సమర్థిస్తున్నారనే అర్థం. అందుకు కృతజ్ఞతలు’ అని మర్యాదగా చెప్పండి. అప్పుడు అసలు విషయం అతడితోపాటుగా అక్కడున్న వాళ్లందరికీ అర్థమవుతుంది.


ఇలా ఏదో ఒకసారి జరిగితే పొరపాటు జరిగిందని సరిపుచ్చుకోవచ్చు. కానీ మళ్లీమళ్లీ అదే జరిగితే... మీరు గతంలోనే ఆ అంశాన్ని గురించి చెప్పినట్టు స్పష్టం చేయాలి. మీరు చెబుతుండగా ఇతరులు అంతరాయం కలిగించిన విషయాన్నీ గుర్తుచేయాలి. ఎదుటివాళ్లు మాట్లాడుతుండగా మధ్యలోనే మీరీ విషయాన్ని చెప్పినా ఫర్వాలేదు. గతంలోనే మీరు చెప్పిన విషయాన్ని ఉదాహరణలతో సహా వివరించవచ్చు.


సరైన వ్యక్తికే ఘనత దక్కేలా చూడాలి. చాలామంది మహిళలు సమావేశాల్లో మౌనంగా ఉంటారుగానీ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించరు. పురుషులే ఎక్కువగా మాట్లాడుతుంటారు. పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలంటే మాట్లాడాల్సిన అవసరమెంతో ఉంది. ఉదాహరణకు ఫేస్‌బుక్‌, ట్విటర్లలోనూ మహిళలకంటే పురుషులే తమ అభిప్రాయాలను ఎక్కువగా స్వేచ్ఛగా వెల్లడిస్తుంటారు. మహిళలు చాలావరకూ సంకోచిస్తుంటారు. అలాకాకుండా తమ భావాలను స్వేచ్ఛగా పంచుకోగలిగేవాళ్లు త్వరగా లక్ష్యాలను సాధించగలుగుతారు.


మీరీ ఆలోచనను గతంలోనే చెప్పారని తెలియజేసినా అర్థం చేసుకోలేని వారిపై సానుభూతిని తెలియజేయండి. అభ్యంతరం చెప్పడానికీ ఒక పద్ధతి ఉంటుంది. మర్యాదగా, సున్నితంగా మీ అభ్యంతరం ఉండాలి. ఎందుకంటే ఆ స్థానంలో మీరున్నా... ఎదుటివాళ్లు దురుసుగా మాట్లాడితే నొచ్చుకుంటారు కదా! ఈ విషయాన్ని గుర్తుంచుకుని వ్యవహరించాలి.


ఇలా ఒక్క మీ విషయంలోనే కాదు.. ఇతర ఉద్యోగినుల విషయంలో జరిగినా వెంటనే స్పందించండి. మీ విషయంలో జరిగినప్పుడు అన్యాయంగా, ఎదుటివాళ్ల విషయానికి వచ్చినప్పుడు మీకేమీ పట్టనట్టుగా వ్యవహరించవద్దు.


సాధారణంగా మహిళలకు నిత్యజీవితంలో చేసే అనేక పనుల మీద చక్కని అవగాహన ఉంటుంది. దాన్ని ఆఫీసులోని బాధ్యతలను నిర్వర్తించడానికి  అనువర్తించి చక్కని ఫలితాలను రాబట్టగలుగుతారు. ఇలా చేయడాన్ని పురుష ఉద్యోగులు అంతగా జీర్ణించుకోలేరు. ఎక్కడి విషయాలు అక్కడ వదిలిపెట్టేయకుండా ఇంటినీ ఆఫీసునూ కలిపేస్తున్నారని విమర్శిస్తుంటారు.

నిజానికి ఎన్నో పనులను ఒకేసారి సమర్థంగా నిర్వహించగలిగే సామర్థ్యం మహిళలకు పుష్కలంగా ఉంటుంది. కానీ గట్టిగా మాట్లాడే స్వభావం తక్కువగా ఉంటుంది. తమ ఆలోచనలను నలుగురి ముందూ ధైర్యంగా వెల్లడించలేరు. ఈ విషయంలో పురుషులకంటే వెనకబడే ఉంటారు. ఉదాహరణకు ఇంట్లో విషయాలనే తీసుకోండి... పిల్లలు మాట వినకపోయినా.. వాళ్లకు గట్టిగా ఏదైనా చెప్పాల్సి వచ్చినా... కఠినంగా చెప్పడం రాక.. నాన్నకు చెబుతానని వాళ్లను భయపెడుతుంటారు. అదే ఆఫీసు విషయాల్లోనూ జరుగుతూ ఉంటుంది. తెలిసిన విషయాన్ని సమర్థంగా చెప్పలేక మాటలకోసం తడబడుతుంటే.... ఈలోగా పురుష ఉద్యోగులు అదే విషయాన్ని అందుకుని చక్కగా బల్లగుద్దినట్టుగా చెబుతారు. అంటే... ఉద్యోగినులు తమ ఆలోచనలను, అభిప్రాయాలను నలుగురి ముందూ చెప్పగలిగే నైపుణ్యాన్ని పెంచుకోవాలి. ఆ సామర్థ్యం లేకపోవడం వల్ల అన్నీ తమకు తెలిసిన విషయాలే అయినా ఏమీ తెలియనట్టుగా అందరిముందూ మౌనంగా ఉండిపోవాల్సి వస్తుంది.

vasucareer@eenadu.net


 


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని