
హరియాణాలోని పానిపట్ నగరానికి సమీపంలోని ఖాంద్రా అనే పల్లెటూరికి చెందిన రైతు కుటుంబానికి చెందిన కుర్రాడు నీరజ్ చోప్రా. చిన్నతనంలో అతడికి నచ్చిన ఆట క్రికెట్. పెరిగే వయసులో కూడా ఆ ఆటే ఆడాడు. కానీ తర్వాత అతడి అడుగులు జావెలిన్ త్రో వైపు పడ్డాయి. అందుక్కారణం హద్దులు దాటిన అతడి బరువే. టీనేజీలోనే 80 కిలోలకు దగ్గరగా వచ్చేసిన నీరజ్‌ను ఒక బంధువు హెచ్చరించాడు. ఇలా ఉంటే కష్టమని.. బరువు తగ్గడానికి ఏదైనా ఒక ఆటను ఎంచుకుని, అందులో కష్టపడమని చెప్పాడు. తమ గ్రామంలో కొందరు కుర్రాళ్లు జావెలిన్ త్రో సాధన చేస్తుండటం అతడిని ఆకర్షించింది. దాన్నే ఎంచుకున్నాడతను. కొన్నాళ్ల పాటు తానూ జావెలిన్‌తో సాధన చేశాడు. ప్రతిభ చూపించాడు. తర్వాత అతడికి పానిపట్‌లోని సాయ్ హాస్టల్లో స్థానం దక్కింది. అక్కడి శిక్షణతోనే వేగంగా ఎదిగాడు నీరజ్.
|
68.4 మీటర్లు
దేశంలో నీరజ్ అనే ప్రతిభావంతుడైన జావెలిన్ త్రోయర్ ఉన్నాడన్న సంగతి తెలిసింది 2015లో. నీరజ్ ఈ క్రీడలోకి వచ్చి అప్పటికి నాలుగేళ్లే అయింది. ఒక జాతీయ స్థాయి పోటీలో 68.4 మీటర్ల దూరం బల్లెం విసిరి జూనియర్ స్థాయిలో జాతీయ రికార్డు బద్దలు కొట్టాడు నీరజ్. దీంతో అతడిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. జావెలిన్ త్రోను నీరజ్ సీరియస్‌గా తీసుకున్నది ఇక్కడి నుంచే. ఆ సమయంలో ప్రపంచ స్థాయి, శాస్త్రీయమైన శిక్షణ కొరవడినప్పటికీ.. యూట్యూబ్‌లో జావెలిన్ త్రో వీడియోలు చూడటం ద్వారా నీరజ్ తన నైపుణ్యాల్ని పెంచుకోవడం విశేషం. ముఖ్యంగా చెక్ రిపబ్లిక్ మేటి జావెలిన్ త్రోయర్ జాన్ జెలెజ్నీ వీడియోల్ని వందల కొద్దీ చూసి ఎంతో స్ఫూర్తి పొందాడతను. కేవలం ఆ వీడియోలు చూసి సాధన చేయడంతోనే అతడి ప్రదర్శన మెరుగు పడింది. ఇప్పుడు జెలెజ్నీ స్థాయికి చేరువగా ఉన్నాడు నీరజ్.
|
82.23 మీటర్లు
నీరజ్ కెరీర్ మరో స్థాయికి చేరింది 2016లో. అంతకుముందు ఏడాదే అతను భారత జావెలిన్ త్రో కోచ్‌గా నియమితుడైన గ్యారీ కాల్వర్ట్ దృష్టిని ఆకర్షించాడు. గువాహాటిలో జాతీయ స్థాయి పోటీల్ని చూసేందుకు వెళ్లిన గ్యారీ.. నీరజ్ శైలి, నైపుణ్యం చూసి ఫిదా అయిపోయాడు. ఒలింపిక్ పతక విజేతల్ని తయారు చేసిన ఘనత గ్యారీది. జావెలిన్ విసరడంలో మోచేతిని ఉపయోగించడంలో నీరజ్‌ది ప్రపంచ స్థాయి నైపుణ్యమని గ్యారీ చెప్పడం విశేషం. అతడి ఆధ్వర్యంలో శిక్షణ నీరజ్ ఆటను మరో స్థాయికి తీసుకెళ్లింది. శారీరక ధారుడ్యం కూడా పెంచుకుని ప్రపంచ స్థాయి క్రీడాకారుడిగా ఎదిగాడతను. ఈ క్రమంలోనే 2016 దక్షిణాసియా క్రీడల్లో 82.23 మీటర్ల ప్రదర్శనతో స్వర్ణం గెలిచాడు. సీనియర్ స్థాయిలో కొత్త జాతీయ రికార్డు కూడా నెలకొల్పాడు.
|
86.48 మీటర్లు
నీరజ్ పేరు ప్రపంచ స్థాయిలో మార్మోగింది.. అతడి ప్రదర్శన ప్రకంపనలు రేపింది 2016 జులై 27న. ప్రపంచ అండర్-20 అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో అసాధారణ ప్రదర్శనే చేశాడు నీరజ్. 86.48 మీటర్ల దూరం జావెలిన్ విసిరి ఏకంగా జూనియర్ స్థాయిలో ప్రపంచ రికార్డునే బద్దలు కొట్టేశాడు. స్వర్ణం కూడా అతడికే సొంతమైంది. నీరజ్ ప్రపంచ స్థాయి క్రీడాకారుడని అందరికీ అర్థమైంది. భారత క్రీడా వర్గాల్లో అతడిపై గురి కుదిరింది. 2020 ఒలింపిక్స్ లక్ష్యంగా అతడిని తీర్చిదిద్దడానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం పెరిగింది.
|
87.43 మీటర్లు
అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ తర్వాత అంచనాల్ని అందుకోవడంలో నీరజ్ విఫలమయ్యాడు. ఆ స్థాయి ప్రదర్శనను తర్వాతి టోర్నీల్లో పునరావృతం చేయలేకపోయాడు. గ్యారీ కోచ్ పదవికి రాజీనామా చేసి స్వదేశానికి వెళ్లిపోవడం, నీరజ్ స్వీయ తప్పిదాలు కూడా అతడి ప్రదర్శనపై ప్రభావం చూపాయి. కానీ తన వైఫల్యం నుంచి అతను త్వరగానే పాఠాలు నేర్చుకున్నాడు. జావెలిన్ త్రోలో అత్యున్నత ప్రమాణాలతో శిక్షణ సాగే జర్మనీకి వెళ్లి శిక్షణ పొందాడు. ఈ ఏప్రిల్‌లో కామన్వెల్త్ క్రీడల్లో 86.47 మీటర్ల ప్రదర్శనతో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాడు. తర్వాత డైౖమండ్ లీగ్‌లో మరింత గొప్ప ప్రదర్శన చేశాడు. ఏకంగా 87.43 మీటర్ల దూరం బల్లెం విసిరాడు.
|
88.06 మీటర్లు
డైమండ్ లీగ్ ప్రదర్శనతో తాను సంతృప్తి చెందలేదని తాజా ఆసియా క్రీడలతో చాటిచెప్పాడు నీరజ్. ఈసారి బల్లెం మరింత ముందుకు దూసుకెళ్లింది. ఆసియా క్రీడల్లో 88.06 మీటర్ల ప్రదర్శనతో స్వర్ణం ఎగరేసుకుపోయాడు. ఇక్కడ నీరజ్‌కు, రెండో స్థానంలో నిలిచిన చైనా క్రీడాకారుడికి మధ్య అంతరం దాదాపు 6 మీటర్లు. దీన్ని బట్టే నీరజ్ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
|
90? మీటర్లు
చేరుకుంటే ఒలంపిక్స్ పతకం దాదాపుగా సొంతమైనట్లే...!

డైమండ్ లీగ్, ఆసియా క్రీడల్లో నీరజ్ ప్రదర్శన ప్రపంచ స్థాయిలో పతకాలు నెగ్గే క్రీడాకారులకు మనోడు చేరువగానే ఉన్నాడని, ఒలింపిక్ పతకం సాధించే సత్తా అతడికి ఉందని చాటిచెప్పింది. నీరజ్ 90 మీటర్ల స్థాయిని అందుకోగలిగితే కచ్చితంగా అతడి నుంచి ఒలింపిక్ పతకం ఆశించవచ్చు. 2016 ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన క్రీడాకారుడి ప్రదర్శన 90.30 మీటర్లు. అందుకే ఇప్పుడు ‘మిషన్ 90’ లక్ష్యంతో అడుగులేస్తున్నాడు. వచ్చే రెండేళ్లూ జర్మనీలోనే ఉండి శిక్షణ తీసుకోవాలనుకుంటున్నాడు. ఫిట్నెస్ మెరుగుపరుచుకుని, నైపుణ్యం పెంచుకుంటే నీరజ్ తన లక్ష్యాన్ని అందుకోవడం కష్టం కాకపోవచ్చు.
|

90 మీటర్ల దూరాన్ని అందుకోగల సత్తా నీరజ్‌కు ఉంది. అతడి ప్రతిభ అమోఘం. నీరజ్‌కు గొప్ప భవిష్యత్తు ఉంది. ప్రపంచ అత్యుత్తమ త్రోయర్లలో ఒకడయ్యే లక్షణాలు అతడిలో ఉన్నాయి. ఇప్పటికే జూనియర్ ప్రపంచ రికార్డు సాధించిన నీరజ్ నాకంటే ముందున్నాడు’’
- జూలియన్ యెగో మాజీ ప్రపంచ ఛాంపియన్
|
రియోకు వెళ్లి ఉంటేనా?

2016 ఒలింపిక్స్‌లో నీరజ్ పోటీ పడాల్సింది. కానీ అర్హత పోటీల్లో విఫలమయ్యాడు. ఐతే సరిగ్గా రియోలో ఒలింపిక్స్ జరుగుతున్న సమయంలోనే పోలెండ్‌లో అండర్-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 86.48 మీటర్లతో సంచలన ప్రదర్శన చేశాడు. రియోలో కాంస్యం గెలిచిన అథ్లెట్ ప్రదర్శన 85.38 మీటర్లు కావడం విశేషం. నీరజ్ రియోకు వెళ్లి పోలెండ్ ప్రదర్శనే చేసి ఉంటే అతడికి ఒలింపిక్స్ కాంస్యం దక్కేది. తాజాగా ఆసియా క్రీడల్లో నీరజ్ ప్రదర్శన.. రియో రజత విజేత ప్రదర్శనకు చాలా దగ్గరగా ఉంది.
|