close

ప్రధానాంశాలు

కదిలొచ్చిన కర్ణాటక రైతులు

విజయవాడ ధర్నాచౌక్‌లో  సంఘీభావ దీక్షలో పాల్గొని మద్దతు
కొందరిని అదుపులోకి  తీసుకున్న పోలీసులు
చంద్రబాబు జోక్యంతో విడుదల

ఈనాడు డిజిటల్‌, విజయవాడ, న్యూస్‌టుడే యంత్రాంగం: నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం కర్ణాటక రైతులు కదలివచ్చారు. అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. కర్ణాటకలో స్థిరపడినప్పటికీ తెలుగు నేలపై ఉన్న ప్రేమతో రాయచూరు జిల్లా రాయచూరు, మాన్వి, సింధనూరు, సిరివార తాలూకాల నుంచి విజయవాడకు తరలివచ్చారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌లో ప్రవాసాంధ్ర రైతుల సంఘీభావ దీక్ష చేపట్టారు.  రాజధాని రైతులకు తాము మద్దతుగా ఉంటామని చెప్పారు. మహిళా రైతుల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న అణచివేత ధోరణి హేయమైన చర్యని వ్యాఖ్యానించారు. కర్ణాటక రైతులు అమరావతి పరిరక్షణ సమితికి రూ.3 లక్షలు విరాళంగా ఇచ్చారు.
కర్ణాటక రైతుల అరెస్టు..   కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత
కర్ణాటక రైతులు కొద్దిసేపు నిరసనలో కూర్చున్న అనంతరం మందడంలోని రైతులను పరామర్శించేందుకు బయలుదేరారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆ కార్యక్రమాన్ని విరమించుకున్నారు. భోజనం చేసి బయలుదేరిన రైతుల వాహనాలను సీఐ బాలమురళీకృష్ణ ఆధ్వర్యాన పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తు భద్రతలో భాగంగా అదుపులోకి తీసుకుంటున్నట్లు చెప్పిన పోలీసులు వారిని కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఇతర రాష్ట్రాల రైతులు ఇక్కడకు రావడం తప్పా.? పౌరహక్కులకు భంగం కలిగించే రీతిలో రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్నారని రైతులు అన్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ సభ్యులు పెద్దసంఖ్యలో పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని బైఠాయించారు. కర్ణాటక రైతులను తక్షణం విడిచిపెట్టాలని డిమాండ్‌ చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పార్టీ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు పోలీస్‌స్టేషన్‌ వద్దకు వచ్చి రైతులకు మద్దతు తెలిపారు. ఇంతలో..మాన్వి నుంచి రైతుల బృందంతో వచ్చిన ఆనందరావు, రవిబాబు, బాబురావు తదితరులు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడిని కలిసి విషయాన్ని వివరించారు. దీంతో చంద్రబాబు పోలీస్‌ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. తక్షణం రైతులను విడుదల చేయాలి. లేదంటే తాను స్వయంగా పోలీస్‌స్టేషన్‌కు రావాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో పోలీసులు రైతులను సాయంత్రానికి విడుదల చేశారు. అనంతరం కర్ణాటక రైతులు చంద్రబాబును కలిసి రాజధాని అమరావతికి తమ పూర్తి మద్దతు తెలిపారు.

  రైతుల అరెస్టును ఖండించిన చంద్రబాబు
కర్ణాటక రైతులను అరెస్టు చేయటాన్ని తెదేపా అధినేత చంద్రబాబు ఒక ప్రకటనలో ఖండించారు. పోలీసులు దౌర్జన్యం హేయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాజధాని రైతులకు మద్దతుగా కర్ణాటక నుంచి రైతులు వస్తే తప్పా? వారికి సంఘీభావం తెలపడమే వాళ్లు చేసిన నేరమా? అని ప్రశ్నించారు.


నమ్మిన రైతుల్ని మోసగించొద్దు

రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. వారిని మోసగించొద్దు. ప్రభుత్వమే మాట తప్పితే ప్రజల కష్టాలు ఇంకెవరికి చెప్పుకోవాలి. గందరగోళ పరిస్థితిని సృష్టించడం తగదు. అమరావతిలో రైతులకు అన్యాయం జరుగుతుందని తెలిసి ఇక్కడికి వచ్చాం. దేశంలో రాష్ట్ర ప్రతిష్ఠ దిగజారిపోతుండటంతో జీర్ణించుకోలేకపోతున్నాం.

-ఆనందరావు, కర్ణాటక రైతు


మహిళలపై దాడులు దారుణం

రాజధాని ప్రాంతంలో మహిళలపై జరిగిన దాడులు దారుణం. మహిళలపై లాఠీలను ఝుళిపించడం చూసి బాధేసింది. టీవీలో వారి బాధను చూసి.. ఇక్కడకు వచ్చా. మూడు రాజధానుల నిర్ణయం చాలా దురదృష్టకరం. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు వచ్చి రైతులకు మద్దతు తెలుపుతున్నా.

- డి.శిరోమణి, రాయచూరు

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.