close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సివిల్స్‌ టాపర్‌ ప్రదీప్‌ సింగ్‌

హరియాణా వాసి ఘనత
మొత్తం 829 మంది ఎంపిక
గుంటూరు యువకుడికి 76వ ర్యాంకు
ఈనాడు - న్యూస్‌టుడే బృందం

రెండు రాష్ట్రాల్లో తెలంగాణ అమ్మాయే టాపర్‌

ధాత్రిరెడ్డికి 46...

సూర్యతేజకు 76వ ర్యాంకు

సుమారు 50 మంది ఎంపిక

100 ర్యాంకుల లోపు నలుగురు

దేశంలోనే అత్యున్నతంగా భావించే సివిల్‌ సర్వీసెస్‌-2019 ఫలితాల్లో ఈసారి తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు. తెలంగాణ, ఏపీల నుంచి సుమారు 50 మంది ఎంపికయ్యారు. తెలంగాణకు చెందిన శిక్షణ ఐపీఎస్‌ పెద్దిటి ధాత్రిరెడ్డి 46వ ర్యాంకుతో తెలుగు రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మల్లవరపు సూర్యతేజ 76వ ర్యాంకుతో తెలుగు రాష్ట్రాల్లో రెండో స్థానాన్ని పొందారు. ఏటా మొదటి 10 లేదా 20 ర్యాంకుల్లోపు తెలుగు అభ్యర్థులు నిలుస్తుండగా ఈసారి వారికి చోటు దక్కలేదు. వంద ర్యాంకుల లోపు నలుగురు, 200 లోపు మొత్తం తొమ్మిది మంది మాత్రమే ర్యాంకులు సాధించారు. ఉమ్మడి ఏపీలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఐఏఎస్‌ అధికారి బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ప్రత్యూష్‌ ఈసారి 216వ ర్యాంకు సాధించారు. వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ కుమారుడు మృగేందర్‌లాల్‌ 505, జనగామ జిల్లా నర్మెట్ట మండలం బొమ్మకూర్‌ సర్పంచి కుమారుడు రాకేష్‌నాయక్‌ 694వ ర్యాంకు సాధించారు.


ఐపీఎస్‌కు ఎంపికైనా.. ఐఏఎస్‌పైనే మమకారం

తొలి ప్రయత్నంలో ఐపీఎస్‌కు ఎంపికైనా, ఐఏఎస్‌పై మక్కువతో పట్టుదలగా చదివి 46వ ర్యాంకు సాధించారు శిక్షణ ఐపీఎస్‌ పెద్దిటి ధాత్రిరెడ్డి. ఆమె స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం గుండ్లబావి గ్రామం. ఎలాంటి శిక్షణ పొందకుండా 2018 నాటి సివిల్స్‌ పరీక్షలు రాసిన ధాత్రి 233వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని పోలీసు అకాడమీలో శిక్షణ పొందారు. ఇటీవలే ఖమ్మం జిల్లా శిక్షణ ఐపీఎస్‌ అధికారిగా నియమితులయ్యారు.


అయిదో ప్రయత్నంలో అందిన విజయం
గుంటూరు యువకుడు మల్లవరపు సూర్యతేజకు జాతీయ స్థాయిలో 76వ ర్యాంకు లభించింది. అయిదో ప్రయత్నంలో తన సివిల్స్‌ లక్ష్యాన్ని చేరుకున్నారు. సాంకేతిక పట్టభద్రుడైన సూర్యతేజ సాప్ట్‌వేర్‌ ఉద్యోగం చేశారు. 2018లో రాజీనామా చేసి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. మొదటి నాలుగుసార్లు రాసినా ప్రిలిమ్స్‌ పూర్తికాలేదని, అయిదోసారి మరింత ప్రణాళికాబద్ధంగా చదవటం వల్ల టాప్‌ ర్యాంకు సాధించగలిగానని సూర్యతేజ చెప్పారు.


గణితంపై పట్టు.. సివిల్స్‌కు మెట్టు
హైదరాబాద్‌ రామంతాపూర్‌కు చెందిన కట్టా రవితేజ మూడో ప్రయత్నంలో 77వ ర్యాంకు సాధించారు. ఐఐటీ దిల్లీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఆయన 2017 నుంచి వరుసగా సివిల్స్‌ పరీక్షలు రాస్తున్నారు. తాజా ఫలితాల్లో 77వ ర్యాంకు సాధించారు. చిన్నప్పటి నుంచీ గణితంపై పట్టుండడంతో ఆప్షనల్‌గా దాన్నే ఎంచుకున్నారు.


ఐఐటీ నుంచి సివిల్స్‌కు
జాతీయ స్థాయిలో 95వ ర్యాంకు సాధించిన సింగారెడ్డి రుషికేష్‌రెడ్డి (25) కుటుంబం కడపలో నివసిస్తోంది. ఐఐటీ పరీక్షలో జాతీయస్థాయిలో 152వ ర్యాంకు సాధించి దిల్లీ ఐఐటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. 21 ఏళ్లకే సివిల్స్‌ పరీక్షలు రాసినా ఇంటర్వ్యూలో అవకాశం చేజారింది. నాలుగో ప్రయత్నంలో 95వ ర్యాంకు సాధించారు. ‘బీటెక్‌లో అభ్యసించిన ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాన్నే సివిల్స్‌లో ఐచ్ఛిక విభాగంగా ఎంచుకున్నా. సివిల్స్‌ కోసం తల్లిదండ్రులు ఎంతో సహకారం అందించారు’ అని చెప్పారు రుషికేష్‌రెడ్డి.


రైతుబిడ్డ రాహుల్‌ ఘనత
సివిల్స్‌లో 117వ ర్యాంకు సాధించిన తాటిమాకుల రాహుల్‌కుమార్‌ రెడ్డి(29) స్వస్థలం కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలోని నందిమండలం గ్రామం. తల్లిదండ్రుల వృత్తి వ్యవసాయం. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బీటెక్‌ పూర్తిచేసిన రాహుల్‌కు చివరిదైన ఆరో ప్రయత్నంలో విజయం దక్కింది. ‘గత నాలుగేళ్లుగా తాత్కాలిక పద్ధతిలో ఆన్‌లైన్‌ ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండడం నా సన్నద్ధతకు ఉపయోగపడింది’ అని చెప్పారు రాహుల్‌కుమార్‌రెడ్డి.


పట్టుబట్టి.. సివిల్స్‌లో సత్తా చాటి...
కర్నూలు నగర పరిధిలోని కల్లూరు ప్రాంతానికి చెందిన కులదీప్‌ సివిల్‌ సర్వీసెస్‌లో 135వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. 2018లో ఐపీఎస్‌ విభాగంలో ఎంపికై ఇప్పటికే హైదరాబాదులో మొదటి విడత శిక్షణ పూర్తి చేసుకున్నారు. రెండో విడతగా అహ్మదాబాద్‌లో శిక్షణ పొందుతున్నారు. అసోంలోని ఎన్‌ఐటీలో బీటెక్‌ పూర్తి చేసిన కులదీప్‌ నాలుగుసార్లు సివిల్స్‌ రాశారు. పట్టువిడవకుండా ప్రయత్నించి విజయం సాధించారు.


రేచల్‌ ఛటర్జీ మార్గదర్శకత్వంతో విజయం
విశ్రాంత ఐఏఎస్‌ అధికారి బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ప్రత్యూష్‌ 216వ ర్యాంకు సాధించారు. దీంతో ఐపీఎస్‌ లేదా ఐఆర్‌ఎస్‌ వస్తుందని అంచనా వేస్తున్నారు. గత ఏడాది సివిల్స్‌ రాయగా, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌కు ఎంపికయ్యారు. ‘గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకొని ఈసారి 216వ ర్యాంకు సాధించాను. ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ పొందిన రేచల్‌ ఛటర్జీ మార్గదర్శకత్వం నా విజయానికి ఎంతో దోహదపడింది. నాన్నది చిత్తూరు జిల్లా అయినా ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లోనే స్థిరపడ్డాం’ అని తెలిపారు ప్రత్యూష్‌.


ఫారెన్‌ సర్వీస్‌ వస్తే వెళతా: చందీష్‌
చిత్తూరు జిల్లాకు చెందిన గురజాల చందీష్‌ కుటుంబం 15 ఏళ్లుగా హైదరాబాద్‌లోనే స్థిరపడింది. గత ఏడాది సివిల్స్‌ ఫలితాల్లో 245వ ర్యాంకు సాధించి ప్రస్తుతం తమిళనాడు కేడర్‌లో ఐపీఎస్‌ శిక్షణలో ఉన్నారు. తాజా ఫలితాల్లో వచ్చిన 198 ర్యాంకుతో ఇండియన్‌ ఫారెన్‌ సర్వీస్‌ వస్తే చేరతానని, లేకుంటే ఐపీఎస్‌లోనే ఉంటానని చందీష్‌ తెలిపారు.


మాజీ ఎమ్మెల్యే కుమారుడికి...

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామానికి చెందిన బాణోతు మృగేందర్‌లాల్‌ జాతీయ స్థాయిలో 505వ ర్యాంకు సాధించారు. మద్రాస్‌ ఐఐటీలో చదివిన మృగేందర్‌లాల్‌ ఐఏఎస్‌ సాధించడమే లక్ష్యంగా కష్టపడ్డారు. తొలిసారి విఫలమైనా 2018లో నిర్వహించిన పరీక్షలో 551 ర్యాంకు సాధించి మహారాష్ట్ర క్యాడర్‌ ఐపీఎస్‌గా ఎంపికై నాసిక్‌లో శిక్షణ పొందుతున్నారు. మూడో ప్రయత్నంలో సాధించిన ర్యాంకుతో ఎస్టీ కేటగిరీలో ఐఏఎస్‌ రావచ్చని కుటుంబీకులు తెలిపారు. మృగేందర్‌లాల్‌ వైరా మాజీ శాసనసభ్యుడు మదన్‌లాల్‌ కుమారుడు.


‘వాట్సప్‌ గురు’.. మహేష్‌ భగవత్‌
రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ అరుదైన ఘనతను సాధించారు. సివిల్స్‌-2019 తుది జాబితాలో నిలిచిన 110 మందికి ఆయన మౌఖిక పరీక్ష మెలకువలను నేర్పారు. నాలుగేళ్ల కిందట రాచకొండ సీపీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా సివిల్స్‌కు ఎంపికైన వారితో స్వయంగా మాట్లాడి వేర్వేరు బృందాలుగా ఏర్పాటు చేసి మౌఖిక పరీక్షలు ఎదుర్కొనే తీరును వివరిస్తున్నారు. గత ఏడాది వేర్వేరు రాష్ట్రాలకు చెందిన 826 మంది అభ్యర్థులు మహేష్‌ భగవత్‌ వద్ద మెలకువలు నేర్చుకోగా వారిలో 110 మంది తుది జాబితాలో నిలిచారు. అఖిల భారత స్థాయిలో ఆరుగురికి 120 లోపు ర్యాంకులు రావడం విశేషం.


యువతలో స్ఫూర్తి నింపేందుకే..
- మహేష్‌ భగవత్‌, రాచకొండ సీపీ

దేశంలో ప్రజలందరికీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందించడం సివిల్‌ సర్వీస్‌ ద్వారానే సాధ్యమవుతుంది. శ్రమ, పట్టుదలతో సివిల్స్‌కు ఎంపికైన వారికి మౌఖిక పరీక్షల్లో సలహాలు, సూచనలు ఇవ్వాలన్న ఆలోచన కొన్నేళ్ల క్రితం వచ్చింది. సివిల్స్‌ సాధించడం మనవల్ల కాదనుకుని మధ్యలో వదిలేసే యువతలో మరింత పట్టుదల పెంచేందుకు, స్ఫూర్తి నింపేందుకు ఈ వేదికను ప్రారంభించాం.

 


టాపర్‌ హరియాణా అభ్యర్థి
ప్రతిష్ఠాత్మక సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల తాజా ఫలితాల్లో 829 మంది విజయం సాధించారు. మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసిన 2019 సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో హరియాణాకు చెందిన ప్రదీప్‌ సింగ్‌ మొదటి ర్యాంకు సాధించారు. దిల్లీకి చెందిన జతిన్‌ కిశోర్‌ ద్వితీయ, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ప్రతిభా వర్మ తృతీయ స్ధానాల్లో నిలిచారు. మహిళల్లో ప్రతిభా వర్మ అగ్రస్థానంలో నిలవడం విశేషం. పదిహేను రోజుల్లో అభ్యర్థుల మార్కులను వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు యూపీఎస్సీ స్పష్టం చేసింది.


కల నిజమైంది
- ప్రదీప్‌ సింగ్‌ (మొదటి ర్యాంకు)

నా కల నిజమైనందుకు సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఐఆర్‌ఎస్‌ బ్యాచ్‌లో ప్రొబేషన్‌లో ఉన్న నేను, సమాజంలో అణగారిన వర్గాల ప్రజలకు సేవలు అందించేందుకు ఐఏఎస్‌ కావాలని కల గన్నాను. సాధించాను. విద్య, వ్యవసాయ రంగాల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యం ఇస్తాను.


 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.