close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాయలసీమ ఎత్తిపోతలను ఆపండి

సుప్రీంకోర్టుకు తెలంగాణ
తెలంగాణ హైకోర్టులోనూ ప్రైవేటు పిటిషన్‌
ముందు జాగ్రత్తగా కేవియట్‌ దాఖలు చేసిన ఆంధ్రప్రదేశ్‌

ఈనాడు హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఆ రాష్ట్రం ముందుకెళ్లకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పునర్విభజన చట్టానికి విరుద్ధంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును నిలుపుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కోరినా పట్టించుకోకుండా టెండరు ప్రక్రియను చేపట్టిందని పేర్కొంది. ఇది ముమ్మాటికీ విభజన చట్టాన్ని ఉల్లంఘించడమేనని తెలిపింది. వెంటనే టెండరు ప్రక్రియను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. అంతర్‌ రాష్ట్ర ఒప్పందాల ప్రకారం ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన నీటిని 841 అడుగుల నుంచి తీసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం వివరించింది. ‘మిగులు జలాలను తీసుకోవాలని చెప్పి శ్రీశైలం దిగువన 797 అడుగుల నుంచి నీటిని తీసుకొనేలా పథకం చేపట్టాల్సిన అవసరం లేదు. ఈ పథకం వల్ల హైదరాబాద్‌కు తాగునీటి సరఫరాకు ఇబ్బంది కలుగుతుంది. తెలంగాణలోని కృష్ణాబేసిన్‌ ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇవన్నీ మాకెంతో ఆందోళన కలిగించే అంశాలు. మరోపక్క ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు టెండరు ప్రక్రియను పూర్తి చేసే ప్రయత్నంలో ఉంది. ఈ కారణంగానే మీ (సర్వోన్నత న్యాయస్థానం) ముందుకు అత్యవసరంగా రావాల్సి వచ్చింది’ అని వివరించింది. ఈ మేరకు తెలంగాణ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌ బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.
రాయలసీమ ఎత్తిపోతలపై హైకోర్టులో పిటిషన్‌
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టెండరు పిలవడంపై కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే సీహెచ్‌ వంశీచంద్‌రెడ్డి బుధవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పథకం వల్ల నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, వికారాబాద్‌, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతుల హక్కులకు భంగం కలుగుతుందని పేర్కొన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలపై దీని ప్రభావం ఉంటుందన్నారు. టెండరు ప్రక్రియను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని, కృష్ణా బోర్డును ఆదేశించాలని కోరారు.
కేవియట్‌ దాఖలు చేసిన ఏపీ
ఈనాడు, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా కేవియట్‌ దాఖలు చేసింది. సుప్రీంకోర్టుతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల హైకోర్టుల్లోను కేవియట్‌ దాఖలు చేసినట్లు జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ వెల్లడించారు. రాయలసీమ జిల్లాల తాగు, సాగు నీటి అవసరాలు తీర్చేందుకు ప్రస్తుతం ఉన్న పథకాల సామర్థ్యం పెంచడానికి వీలుగా ఈ ఎత్తిపోతలను ఆంధ్రప్రదేశ్‌ చేపడుతోంది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వం, మరికొందరు ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో న్యాయపరంగా ఇబ్బందులు ఎదురుకాకుండా కేవియట్‌ దాఖలు చేసినట్లు ఆదిత్యనాథ్‌ దాస్‌  చెప్పారు.


తెలంగాణకు 37.67 టీఎంసీలు... ఏపీకి 17 టీఎంసీలు
రెండు రాష్ట్రాల వినతితో  కృష్ణా జలాలు కేటాయించిన బోర్డు

ఈనాడు, హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ట్రాలకు బుధవారం కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు చేసింది. తెలంగాణకు 37.67 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 17 టీఎంసీలు కేటాయించింది. ఈ నెల మూడో తేదీ నాటికి శ్రీశైలం జలాశయంలో 83.53 టీఎంసీలు ఉండగా కనీస నిల్వ 53.85 టీఎంసీలు పోను 29.68 టీఎంసీల జలాలు అందుబాటులో ఉన్నాయని బోర్డు స్పష్టం చేసింది. నాగార్జునసాగర్‌లో 212.43 టీఎంసీల నిల్వ ఉండగా కనీస నిల్వ 131.66 టీఎంసీలుపోను 80.77 టీఎంసీలు వినియోగానికి అందుబాటులో ఉన్నాయని తెలిపింది. రెండు జలాశయాల కింద 110.45 టీఎంసీలు వినియోగించుకునేందుకు అందుబాటులో ఉన్నాయి. బోర్డు సభ్య కార్యదర్శి హరికేష్‌ మీనా ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. మిషన్‌భగీరథకు శ్రీశైలం నుంచి, సాగుకి నాగార్జునసాగర్‌ నుంచి తెలంగాణ కోరగా.. శ్రీశైలం జలాశయం కింద తాగునీటి అవసరాలకు నీటి కేటాయింపులు చేయాలని ఏపీ విన్నవించింది.
గత ఏడాది వినియోగించని జలాలపై..
మరోవైపు గత నీటి సంవత్సరంలో నాగార్జునసాగర్‌ కింద 29.92 కేటాయింపులు చేయగా వినియోగించుకోని వాటాను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతం శ్రీశైలం నుంచి 7.74 టీఎంసీలు విడుదల చేయాలని బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి చేయగా.. ఏపీ అభ్యంతరం వ్యక్తంచేసింది. గతేడాది కేటాయింపులను తెలంగాణ ఇప్పుడు కోరడం సరికాదని పేర్కొంది. దీనిపై బోర్డు స్పందిస్తూ త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించాలని, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు సీఈ కమిటీ సమావేశానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.