ఎన్నికలు, కరోనా టీకాలూ ఒకేసారి సాధ్యం కాదు
close

ప్రధానాంశాలు

ఎన్నికలు, కరోనా టీకాలూ ఒకేసారి సాధ్యం కాదు

రెండూ ఒకేసారి ఎలా చేయాలో మీరే చెప్పండి
కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శికి సీఎస్‌ లేఖ

ఈనాడు, అమరావతి: ‘రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆదేశించాయి. ఎన్నికలతో పాటు, కొవిడ్‌ టీకాల కార్యక్రమమూ జరగాలని హైకోర్టు చెప్పింది. ఈ రెండు లక్ష్యాలను ఒకేసారి సాధించేందుకు అనుసరించాల్సిన విధానంపై మీ మార్గదర్శనం కావాలి’ అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ సోమవారం లేఖ రాశారు. ఒక పక్క పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తూ, ‘ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌’కి టీకాలు వేసే కార్యక్రమాన్ని ఏకకాలంలో నిర్వహించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. పోలింగ్‌ సిబ్బందిని వారు పని చేస్తున్న, నివసిస్తున్న ప్రాంతాలకు దూరంగా విధుల్లో నియమించాల్సి ఉన్నందున వారికి టీకాలు వేయలేమని తెలిపారు. ‘రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌, కోర్టుల ఆదేశాల మేరకు.. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు త్వరలోనే ఎన్నికలు జరపాల్సి ఉంది. ఏపీలో 3.8 లక్షల మంది వైద్య, ఆరోగ్య సిబ్బందికి కరోనా టీకా వేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 1.49 లక్షల మందికి వేశాం. ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేయడం పూర్తయిన తక్షణం.. కరోనా టీకా వేయాల్సిన ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌లో 73,188 మంది పోలీసులు సహా, మొత్తం ఏడు లక్షల మంది ఉన్నారు. పోలీసు, రెవెన్యూ, పురపాలక శాఖలకు చెందిన ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు 2,041 కేంద్రాల్లో టీకా వేసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నాం’ అని లేఖలో సీఎస్‌ పేర్కొన్నారు. ‘ఈలోగా రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. సుమారు 1,35,000 పోలింగ్‌ స్టేషన్లలో ఐదు లక్షల మంది సిబ్బందిని విధుల్లో నియమించాల్సి ఉంది. వారిలో పోలీసులు, పంచాయతీరాజ్‌, రెవెన్యూ, విద్యాశాఖల వారున్నారు. వారిలో చాలా మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ ఉన్నారు’ అని తెలిపారు.
ఒక పోలీసు.. మూడుచోట్ల విధులు
‘టీకా వేయాల్సిన ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌నే పోలింగ్‌ విధుల్లో నియమించాల్సి ఉంటుంది. పోలింగ్‌ విధులకు 1.35 లక్షల మంది పోలీసులు అవసరం కాగా 73,188 మందే ఉన్నారు. ఒక్కో పోలీసును సగటున మూడు పోలింగ్‌ స్టేషన్లకు నియమించాలి. వారు ఒకచోట నుంచి మరోచోటికి తిరుగుతూ విధులు నిర్వర్తించాలి. వారిలో కొందరిని ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు పర్యవేక్షణ, నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు ఇచ్చే విధుల్లో నియమించాలి. ఎన్నికల సంఘ మార్గదర్శకాల ప్రకారం పోలింగ్‌ సిబ్బందిని వారి నివాస, పని ప్రదేశాలకు దూరంగా విధుల్లో నియమించాలి. ఇంటికి, పని ప్రదేశానికి దగ్గరగా వారికి టీకాల కేంద్రాన్ని కేటాయిస్తారు. వారిని ఇప్పుడు ఆ కేంద్రానికి దూరంగా ఎన్నికల విధుల్లో నియమించడం వల్ల టీకా వేయడం సాధ్యపడదు. మొదటి డోస్‌ టీకా ఒక కేంద్రంలో వేసుకున్నవారు.. ఆ తర్వాత ఎన్నికల విధుల్లోకి వెళితే రెండో డోస్‌ వేసుకోవడానికి స్థానికంగా అందుబాటులో ఉండరు. వ్యాక్సిన్‌ వేసుకున్న వారిలో మా రాష్ట్రంలోనూ ఒకరు మరణించారు. నిబంధనల ప్రకారం టీకా తీసుకున్నవారిని కొన్ని రోజులు పరిశీలనలో ఉంచాలి. వారిని పెద్దగా ఒత్తిడిలేని వాతావరణంలో ఉంచుతూ సన్నిహితంగా పర్యవేక్షించాలి’ అని సీఎస్‌ పేర్కొన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని