గోవా ఆసుపత్రిలో ఘోరం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గోవా ఆసుపత్రిలో ఘోరం


 4 గంటల వ్యవధిలో 26 మంది కొవిడ్‌ రోగుల మృతి
 ఆక్సిజన్‌ సరఫరాలో జాప్యమే కారణం!
 హైకోర్టు విచారణ జరపాలని కోరిన ఆరోగ్య మంత్రి

పనాజీ: గోవాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నాలుగు గంటల వ్యవధిలో 26 మంది కొవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్‌ సరఫరాలో చోటుచేసుకున్న జాప్యమే మరణాలకు కారణమని తెలుస్తోంది. తాజా ఘటనపై స్వయంగా దర్యాప్తు జరిపించాలని హైకోర్టును గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్‌ రాణె కోరారు.  గోవా వైద్య కళాశాల ఆస్పత్రి (జీఎంసీహెచ్‌)లో మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల నుంచి ఆరు గంటల మధ్య 26 మంది కరోనా బాధితులు మృత్యువాతపడిన సంగతి వాస్తవమని రాణె తెలిపారు. మరణాలకు కారణం మాత్రం స్పష్టంగా తెలియదని చెప్పారు. ఆసుపత్రికి ప్రాణవాయువు సరఫరాలో కొన్ని లోటుపాట్లు ఉన్న సంగతి నిజమేనని ఆయన అంగీకరించారు. కొవిడ్‌ రోగుల మృతి వార్త తెలియగానే జీఎంసీహెచ్‌ను గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ సందర్శించారు. కరోనా వార్డులకు ఆక్సిజన్‌ను సరఫరా చేయడంలో చోటుచేసుకున్న జాప్యమే తాజా దారుణానికి కారణమయ్యుండొచ్చని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాణవాయువు, సిలిండర్ల కొరత లేదని స్పష్టం చేశారు. అయితే- లక్షిత ప్రాంతాలకు సిలిండర్లు సరైన సమయంలో అందకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ట్యాంక్‌ లీక్‌
మార్గోవాలోని దక్షిణ గోవా జిల్లా ఆసుపత్రి (ఎస్‌జీడీహెచ్‌)లో మంగళవారం ఆక్సిజన్‌ లీక్‌ కావడం కలకలం సృష్టించింది. ప్రధాన నిల్వ ట్యాంకులో ప్రాణవాయువును నింపుతుండగా స్వల్ప లీకేజీ చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు, వైద్య సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దడంతో రోగులకు ప్రాణాపాయం తప్పింది.

కరోనా నెగెటివ్‌ రిపోర్టు ఉంటేనే గోవాలోకి..

కరోనా నెగెటివ్‌ రిపోర్టు ఉన్నవారినే ఇకపై గోవాలోకి అనుమతించనున్నారు. బొంబాయి హైకోర్టు గోవా ధర్మాసనం ఈ మేరకు మంగళవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో మాత్రం మినహాయింపులు ఉంటాయని తెలిపింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని