రూ.41వేల కోట్లకు లెక్కల్లేవు

ప్రధానాంశాలు

రూ.41వేల కోట్లకు లెక్కల్లేవు

వోచర్లు లేకుండానే చెల్లించారు
ఆర్థికశాఖలో అవకతవకలు కాగ్‌తో ఆడిట్‌ జరిపించండి
గవర్నర్‌కు పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ఫిర్యాదు


రూ.41వేల కోట్లు ఖర్చయ్యాయన్నది నిజం. ఆ వివరాలు వోచర్లలో లేవన్నదీ నిజం. ఆర్థికశాఖ కార్యాలయానికి సమాంతరంగా మరో కార్యాలయం ఏదైనా నడుపుతున్నారా? ఇంత జరిగాక గవర్నర్‌ కూడా నిర్లిప్తంగా ఉంటారని నేను అనుకోవడంలేదు.

- పయ్యావుల


ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేసిన రూ.41,043.18 కోట్ల ఖర్చుకు లెక్కాపత్రం లేదని, జమాఖర్చులు సరిగా లేవని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కి తెదేపా సీనియర్‌ నేత, ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య అకౌంటెంట్‌ జనరల్‌ మే నెలలో రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌కి రాసిన లేఖను కేశవ్‌ గవర్నర్‌కు అందజేశారు. 

గవర్నర్‌ తక్షణం జోక్యం చేసుకోవాలని, 2019-20, 2020-21 సంవత్సరాల ఆర్థికశాఖ వ్యవహారాలపై కాగ్‌తో ఆడిట్‌ చేయించాలని కోరారు. గవర్నర్‌తో భేటీ అనంతరం కేశవ్‌ విలేకర్లతో మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖలోని లోపభూయిష్ట విధానాల్ని గవర్నర్‌ దృష్టికి తెచ్చాను. ప్రభుత్వంలో ఒక చిరుద్యోగి వంద రూపాయలు ఖర్చుపెట్టాలన్నా వోచర్‌ రాయాలి. ఒక ప్రభుత్వ అధికారికి జీతం రావాలన్నా వంద సంతకాలు కావాలి. అలాంటిది రూ.41వేల కోట్లను ఎలాంటి రసీదులు, వోచర్లు లేకుండా వివిధ పద్దుల్లోకి మార్చేశారు. ఇది మేం చేస్తున్న ఆరోపణ కాదు. సాక్షాత్తు ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ నిగ్గుతేల్చిన నిజం. రూ.41 వేల కోట్లను రాష్ట్ర ట్రెజరీ కోడ్‌కి భిన్నంగా బదలాయించి, విత్‌డ్రా చేశారు. ఇదెలా జరిగిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సాధారణంగా కాగ్‌ ఒకటి రెండు అంశాలపై లోతుగా అధ్యయనం చేసి, ఎక్కడ తప్పులు జరిగాయో చెబుతుంది. మొత్తం ఒక శాఖ వ్యవహారాలే లోపభూయిష్టంగా ఉన్నాయని చెప్పడం ఇదే మొదటిసారి. ఈ సొమ్ము తినేశారని మేం అనడం లేదు. జమాపద్దులన్నీ నిబంధనల ప్రకారం లేకపోతే తినేసినా పట్టుకోలేరు. నిబంధనల్ని అమలు చేయాల్సిన ఉన్నతాధికారులే వాటిని ఉల్లంఘిస్తే, క్షేత్రస్థాయిలో అవకతవకల్ని ఎవరు నియంత్రిస్తారు?’ అని కేశవ్‌ ధ్వజమెత్తారు.   

ప్రత్యేకంగా ట్రెజరీ ఆఫీసులేమైనా పెట్టుకున్నారా?
‘రూ.41 వేల కోట్లు ఖర్చయ్యాయన్నది నిజం. ఆ వివరాలు వోచర్లలో లేవన్నదీ నిజం. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఆర్థికశాఖ కార్యాలయానికి సమాంతరంగా మరో కార్యాలయం ఏదైనా నడుపుతున్నారా? ప్రత్యేంగా ట్రెజరీ ఆఫీసులు పెట్టుకున్నారా? కనీసం ఆర్థికమంత్రికైనా లెక్కలు చూపిస్తున్నారా? ఎందుకంటే కార్యదర్శులకే పాస్‌వర్డ్‌ యాక్సెస్‌ ఉంటుంది. ఇంత జరిగాక గవర్నర్‌ కూడా నిర్లిప్తంగా ఉంటారని నేను అనుకోవడంలేదు. ప్రభుత్వం సమాచారాన్ని గోప్యంగా ఉంచుతోంది. ఎమ్మెల్యేగా లేఖ రాస్తేనే సమాచారం ఇవ్వడానికి సంవత్సరం పడుతోంది’ అని ఆయన ధ్వజమెత్తారు.

లేఖలో ఏముంది?
‘ట్రెజరీ తనిఖీ కోసం మా బృందం ఈ ఏడాది మార్చి 22 నుంచి 26 వరకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌, దాని పరిధిలోని వివిధ కార్యాలయాల్లో రికార్డులను పరిశీలించింది. 10,806 బిల్లులకు సంబంధించి రూ.41,043.08 కోట్లను ట్రెజరీ కోడ్‌ నిబంధనలను పాటించకుండా స్పెషల్‌ బిల్లుల కేటగిరీలో డ్రా చేసినట్టు గుర్తించింది. అవి దేనికి ఖర్చు చేశారన్న వర్గీకరణ, డీడీఓ, లబ్ధిదారుల వివరాలు, మంజూరు, ప్రొసీడింగ్స్‌ వివరాలు, సబ్‌వోచర్లు వంటివేమీ లేవు. వివిధ ఖజానా కార్యాలయాల పరిధిలో 8,614 స్పెషల్‌ బిల్లుల కింద రూ.224.28 కోట్లు చెల్లించారు, మరో 2,164 బిల్లులకు సంబంధించి రూ.40818.79 కోట్లు స్పెషల్‌ బిల్లుల కింద సర్దుబాటు చేశారు. ఆ బిల్లులన్నీ ట్రెజరీల ద్వారా రాలేదు. నిజానికి ట్రెజరీ అధికారుల సంతకంతోనే అవి జరగాలి. ఈ లోపాల్ని సరిదిద్దడానికి చర్యలు చేపట్టండి’ అని రావత్‌కి రాసిన లేఖలో ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ పేర్కొన్నారు. ఆ లేఖను కేశవ్‌ మీడియాకు విడుదల చేశారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని