పదేళ్లుగా బెయిల్‌పై ఉంటున్నారు

ప్రధానాంశాలు

పదేళ్లుగా బెయిల్‌పై ఉంటున్నారు

నేర చరిత్ర కలిగిన వ్యక్తులు జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి
ఎంపీ రఘురామకృష్ణరాజు ధ్వజం

ఈనాడు, దిల్లీ: ‘పదహారు నెలలు జైలులో ఉండి, పదేళ్లుగా బెయిల్‌పై ఉంటున్నారు. మీ గురించి మాట్లాడాలంటే నాకే సిగ్గుగా ఉందని’ వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. దిల్లీలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ధన, రుణ వంటి అనేక అనుబంధాలతో 17 కేసుల్లో వీడని బంధం కలిగి ఏ1, ఏ2లుగా అత్యంత ప్రాశస్త్యం పొందిన ఇద్దరు నిందితులు జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి. ఒక విశ్రాంత న్యాయమూర్తి 6093 అని నెట్‌లో కొడితే వచ్చేది చూసి తాను నిర్ఘాంతపోయినట్లు చెప్పారు. ఇటువంటి నేర చరిత్ర కలిగిన ఈ ఇద్దరిపై అనేక ఛార్జిషీట్లు ఉన్నాయి. రఘురామకృష్ణరాజు ఇండ్‌-భరత్‌ కంపెనీతో సొమ్ములు ఎగ్గొట్టారని, త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతూ.... రూ.43వేల కోట్లు దోచుకున్నట్లు అనేక ఛార్జిషీట్లు ఉన్న ఈ నిందితులు రాష్ట్రపతి, ప్రధానమంత్రికి లేఖలు రాశారు. ముఖ్యమంత్రిపై నేను మాట్లాడడం లేదు. నన్ను నిందించినందుకు నేను నిందిస్తున్నా. చెల్లింపుల్లో ఎటువంటి మచ్చ లేకుండా 25 ఏళ్ల పాటు ఉన్న కంపెనీ మాది. 2004 నాటికి అలో లక్ష్మణా అంటూ ఉండి తర్వాత రూ.2 లక్షల ఆదాయపు పన్ను నుంచి ఒక్కసారిగా రూ.200 కోట్లు ఆదాయ పన్ను చెల్లించే స్థాయికి మేం ఎదగలేదు. రూ.పది షేర్‌ను రూ.1500కు అమ్మి రాత్రికి రాత్రే ఎదగలేదు. కష్టపడి పైకొచ్చాం. మా తాతలు పెద్ద పారిశ్రామికవేత్తలు. వారిపై ఆర్థిక, హత్యా నేరాలు లేవు. ఏ1 బెయిల్‌ రద్దుపై నేను దాఖలు చేసిన కేసు జులై 26వ తేదీన వస్తుంది. ఆ రోజు ఏమవుతుందో చూద్దాం. మీ ప్రేరణతో ఏ2 లేఖ రాశారు. అయోధ్యరామిరెడ్డి సంతకం పెట్టారంట. ఆయనపై ఇటీవలే ఐటీ దాడులు చేస్తే రూ.300 కోట్లు కడతామని ఒప్పుకున్నారు. ఇటువంటి దొంగలంతా కలిసి నాపై మాట్లాడేది ఏమిటి..? ముఖ్యమంత్రీ... మీరు చిన్న పారిశ్రామికవేత్తగా ఉన్నప్పుడు ఎరిడాలో రుణం ఇప్పించాలని మీ తండ్రి నన్ను అభ్యర్థించారు. నాకు మెగావాట్‌కు రూ.3.50 కోట్లు రుణం మంజూరైతే మెగావాట్‌కు మీరు రూ.6 కోట్లు పెట్టారు. మెగావాట్‌కు రూ.6 కోట్లకు ఆమోదం పొందేలా నేను చేశా. సండూర్‌ పవర్‌ ప్లాంట్‌కు మెగావాట్‌కు రూ.6 కోట్లు రుణం వచ్చింది. 2012లోనూ నేను మెగావాట్‌కు రూ.4 కోట్లే పెట్టాను. అది నా రికార్డ్‌. నా కంపెనీకి చెల్లింపులు నిలిపివేసినప్పుడు నాపై మచ్చ పడకూడదని నేను నోటీసులు ఇస్తే అప్పుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నాపైనే కేసు వేస్తావా అని చెప్పి నన్ను చిత్రహింసలపాలు చేశారు. కోర్టు ఆదేశాలిచ్చినా నాకు చెల్లింపులు చేయలేదు. దాంతో నిరర్థక ఆస్తి (ఎన్‌పీఏ) అయింది. అక్కడ ఆస్తులున్నా ఎగవేతగానే బ్యాంకులు పరిగణిస్తాయి కనుక నాపై కేసులు వేశారు. మీరు, బాలశౌరి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ మల్లికార్జున్‌రావును కలిసి కేసులు వేయించారు. నీ పార్టీ తరపున పోటీ చేశా. మీ నిరంజన్‌రెడ్డి వివరాలు అడిగారు. అన్నీ తెలిసే సీటు ఎలా ఇచ్చారు. ఇవన్నీ జగన్‌మోహన్‌రెడ్డిగా చేశావు కాబట్టే నువ్వు అంటున్నా. ముఖ్యమంత్రిపై నాకు అపార గౌరవం ఉంది. ఎన్ని నిందలు వేసినా నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంటా. నేను ముఖ్యమంత్రిని అనడం లేదు. ఏ1, ఏ2ను అంటున్నా. సీబీఐ లక్ష్మీనారాయణ మీపై విచారణ చేసింది రవ్వంతే. అందులోనే రూ.43 వేల కోట్లు వచ్చిందంటున్నారు. ఇప్పుడు కొండంత ఉంది. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు ఎలా మార్చారో త్వరలోనే తెలుస్తుంది. దీనిపై హైకోర్టులో కేసు వేశా. ఆ విషయాలు రాష్ట్రపతి, ప్రధానికి తెలుపుతా. రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ, రుసుముల చెల్లింపు వంటి మంచి పనులు చేశారు. ఆ తర్వాత ఏం చేశారో తెలుసు. వాటితోనే ఇప్పుడు మీపై ఉన్న సీబీఐ ఛార్జిషీట్లు వచ్చాయి. నేను వేసిన కేసుతో ఇంకొన్ని వస్తాయి. ఆయన పేరు చెప్పుకొని మీరు ముఖ్యమంత్రి అయ్యారు. మీరు రావడంతోనే కూల్చడం మొదలుపెట్టారు. మద్య నిషేధం పేరు... దానిపైనే అప్పులు. ఆ అప్పుల్లోనే ఎన్నో తప్పులు, నిబంధనోల్లంఘన. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న తప్పులతో, మీ తప్పిదాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జైలుకు వెళతారు’ అని రఘురామ పేర్కొన్నారు. Rs


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని