హెల్త్‌ హబ్స్‌ ఆసుపత్రుల్లో..50% పడకలు ఆరోగ్యశ్రీకి..

ప్రధానాంశాలు

హెల్త్‌ హబ్స్‌ ఆసుపత్రుల్లో..50% పడకలు ఆరోగ్యశ్రీకి..

వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదు
కొవిడ్‌ నివారణ చర్యలపై సమీక్షలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

ఈనాడు, అమరావతి: హెల్త్‌ హబ్స్‌ ద్వారా ఏర్పాటయ్యే ఆసుపత్రుల్లో కనీసం 50% పడకలను ఆరోగ్యశ్రీ రోగులకు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. ఎక్కువ పడకలను కేటాయించే ఆసుపత్రులకు హెల్త్‌ హబ్స్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య బీమా కంపెనీలు చెల్లిస్తున్న ఛార్జీలతో పోల్చితే ఆరోగ్యశ్రీ కింద చెల్లించే ఛార్జీలే మెరుగ్గా ఉన్నాయని అన్నారు. కొవిడ్‌-19 నివారణ చర్యలు, ఇతర అంశాలపై ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘హెల్త్‌హబ్స్‌ ద్వారా ఏర్పాటయ్యే ఆస్పత్రుల తరఫున ఉండే బోర్డుల్లో ఒక సభ్యుడు ప్రభుత్వం నుంచి ఉంటారు. లాభాపేక్ష లేకుండా ఆసుపత్రులు నిర్వహించే సంస్థలకు ఈ హబ్స్‌లో ప్రాధాన్యం ఇవ్వాలి. రాష్ట్రానికి చెందిన వైద్యులు కూడా ఇక్కడే స్థిరపడి వైద్య సేవలందించే అవకాశం వస్తుంది. వైద్యులు రోగులకు నిరంతరం అందుబాటులో ఉండేలా ఆసుపత్రుల ఏర్పాటు జరగాలి.
హెల్త్‌హబ్స్‌లో అవయవ మార్పిడి చికిత్స జరిగేలా ప్రత్యేక దృష్టిపెట్టాలి. రోగులు ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదు. పీహెచ్‌సీల నుంచి బోధనాసుపత్రుల వరకు అవసరమైన నియామకాలు చేపట్టాలి. కొత్త ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లో ఉత్తమ విధానాలు అవలంబించాలి. నిర్మాణాల డిజైన్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. రోగులకు అందించే ఆహారంలో నాణ్యత ఉండాలి. ఇవన్నీ ఉంటే.. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోని సేవలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనికి అందుబాటులోనికి వచ్చినట్లవుతుంది. రోగులు చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రులకు వచ్చేలా ఆసుపత్రుల పనితీరు ఉండాలి. వీటి పర్యవేక్షణ యంత్రాంగం పటిష్ఠంగా ఉండాలి. సిబ్బంది సెలవులో ఉంటే ఆ ప్రభావం రోగులపై పడకూడదు. నిర్ణీత రోజులకి మించి సెలవులో ఉంటే.. అటువంటి సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలి’’ అని పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని