పాలిసెట్‌లో 94% మందికి అర్హత

ప్రధానాంశాలు

పాలిసెట్‌లో 94% మందికి అర్హత

బాలికలు 96.87%, బాలురు 93.12%

నియోజకవర్గానికో ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

ఈనాడు, అమరావతి: పాలిటెక్నిక్‌ కళాశాలల ప్రవేశపరీక్ష (పాలిసెట్‌)లో ఎక్కువ మంది బాలికలు అర్హత సాధించారు. బాలికలు 19,638 మంది పరీక్ష రాయగా 19,024 (96.87%), బాలురు 48,499 మంది పరీక్షకు హాజరుకాగా 45,163 (93.12%) మంది అర్హత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 68,137 మంది పరీక్ష రాయగా 64,187 (94.2%) మంది ప్రవేశాలకు అర్హత పొందారు. 120 మార్కుల ప్రవేశపరీక్షలో కనీస అర్హత మార్కులు 30. ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి అర్హత మార్కులు లేవు. బాలికల్లో నెల్లూరు, బాలురలో ప్రకాశం జిల్లాలు మొదటి స్థానాల్లో నిలిచాయి. ఫలితాలను మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి శాసనసభ నియోజకవర్గానికో ఐటీఐ, పాలిటెక్నిక్‌ కళాశాలను ఏర్పాటు చేయనున్నామని, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల లేనిచోట ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్న ప్రైవేటు కళాశాలలను యాజమాన్యాల అనుమతితో తీసుకుంటామని తెలిపారు. పాలిటెక్నిక్‌ పూర్తయిన తర్వాత ఎక్కువ మంది ఇంజినీరింగ్‌కు వెళ్లిపోతున్నారని, దీన్ని తగ్గించేందుకు కొన్ని కళాశాలలను ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలుగా మారుస్తామని వెల్లడించారు. ఈ ఏడాది క్లౌడ్‌ కంప్యూటింగ్‌, బిగ్‌డేటా, కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌, కమ్యూనికేషన్‌, కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌ లాంటి ఆధునిక కోర్సులు ప్రవేశ పెడతామని తెలిపారు. మధ్యస్థాయి ఉద్యోగాలకు నైపుణ్యం కలిగినవారి అవసరం ఉందని వెల్లడించారు. అనంతరం సాంకేతిక విద్య కమిషనర్‌ పోలా భాస్కర్‌ మాట్లాడుతూ.. విజయవాడలో ఆటోమొబైల్‌, నెల్లూరు జిల్లా తడలో ఉత్పత్తి, విశాఖలో కెమికల్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వారంరోజుల్లో కౌన్సెలింగ్‌ ప్రారంభిస్తామని, ర్యాంకు కార్డులను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు.

అభ్యర్థుల కంటే సీట్లే ఎక్కువ

పాలిసెట్‌లో అర్హత సాధించిన వారికంటే పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సీట్లే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది 64,187 మంది అర్హత సాధించగా.. ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటులో కలిపి 69,724 సీట్లు ఉన్నాయి. విద్యార్థులందరూ ప్రవేశాలు పొందినా ఇంకా 5వేలకు పైగా సీట్లు మిగిలిపోనున్నాయి.
గత నాలుగేళ్లుగా ప్రవేశ పరీక్ష రాసేవారి సంఖ్య తగ్గుతోంది. పాలిటెక్నిక్‌ తర్వాత ఉద్యోగాలు సరిగా రాకపోవడం, వచ్చినా వేతనాలు తక్కువ కావడంతో విద్యార్థుల ఆసక్తి తగ్గుతోంది. పాలిటెక్నిక్‌ పూర్తిచేసినవారిలో చాలామంది ఇంజినీరింగ్‌కు వెళ్లిపోతున్నారు.

టాపర్లు వీరే..
పాలిసెట్‌లో ఇద్దరికి మొదటి ర్యాంకు లభించగా.. మరో తొమ్మిదిమందికి ఒకే మార్కులు వచ్చాయి. వీరికి గణితం, భౌతిక శాస్త్రాల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని