పంటలపై గులాబ్‌ పంజా

ప్రధానాంశాలు

పంటలపై గులాబ్‌ పంజా

ఆరు జిల్లాల్లో 1.64 లక్షల ఎకరాల్లో వ్యవసాయానికి తుపాను దెబ్బ
వరికే అత్యధిక నష్టం  

ఈనాడు, అమరావతి: గులాబ్‌ తుపాను సృష్టించిన బీభత్సంతో రైతుల ఆశలు తల్లకిందులయ్యాయి. భారీ గాలులకు చెట్లు నేలకూలాయి. విజయనగరం జిల్లా గజపతినగరంలోనే 2,300 టేకు చెట్లు పడిపోయాయి. వరద ముంచెత్తడంతో పంటలు నీట మునిగాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో మొత్తం 1.64 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. వరి, మొక్కజొన్న, పత్తి, మిరప, మినుము, వేరుసెనగ, రాజ్మా, చెరకు, పొగాకు, రాగి పంటలకు నష్టం వాటిల్లింది. పశ్చిమగోదావరి జిల్లాలో 46 వేల ఎకరాలు, విజయనగరంలో 26 వేలు, శ్రీకాకుళంలో 20 వేలు, తూర్పుగోదావరిలో 18 వేలు, విశాఖపట్నంలో 6,500 ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. నీరు బయటకుపోతే పంట నిలబడుతుందని అధికారులు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 14,761 ఎకరాలు, విజయనగరం జిల్లాలో 6,250 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు గుర్తించారు. కృష్ణా జిల్లాలో 10,588 ఎకరాల్లో పత్తికి నష్టం వాటిల్లింది.

దెబ్బతిన్న పండ్ల తోటలు

ఉత్తరాంధ్రలో ఉద్యాన పంటలపై గులాబ్‌ ప్రభావం అధికంగా ఉంది. శ్రీకాకుళం జిల్లాల్లో మరోసారి కొబ్బరిపై తుపాను విరుచుకుపడింది. వివిధ జిల్లాల్లో 3,250 ఎకరాల్లో అరటి, 1,500 ఎకరాల్లో మిరప, 1,000 పైగా ఎకరాల్లో కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. పూలతోటలు, బత్తాయి, జామ, జీడిమామిడి తదితర పండ్ల తోటలతోపాటు పసుపు పంటా ముంపు బారిన పడింది. ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 6 వేల మందికి పైగా రైతులు తుపాను ప్రభావంతో నష్టపోయారు. పంట నష్టాన్ని తగ్గించేందుకు రైతులకు ఆర్‌బీకేల ద్వారా సలహాలు అందిస్తున్నామని వ్యవసాయశాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని