ఒప్పంద అధ్యాపకులకు ఉద్యోగ భద్రత

ప్రధానాంశాలు

ఒప్పంద అధ్యాపకులకు ఉద్యోగ భద్రత

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ 

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ కళాశాలల్లోని ఒప్పంద అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వెల్లడించారు. సచివాలయంలో సోమవారం ఆయన ఆ సంఘం నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘వీరికి సంబంధించి 2022 మార్చి వరకు ఒప్పందం ఉంది. అప్పటివరకు ఇబ్బంది లేదు. ఈలోగా సీఎం జగన్‌తో మాట్లాడి తదుపరి విధి విధానాలను ప్రకటిస్తాం. ఎయిడెడ్‌ పోస్టుల నుంచి ప్రభుత్వ కళాశాలలకు ఎంత మంది వస్తున్నారో, ఈ కారణంగా వీరికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అన్న దానిపై సమగ్రంగా చర్చిస్తున్నాం. ఒప్పంద అధ్యాపకులను విద్యార్హతలను బట్టి వర్శిటీల పరిధిలో సర్దుబాటు చేసే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నాం...’ అని వివరించారు.

‘ఎయిడెడ్‌’ మూతపడవు... హామీ ఇస్తున్నాం

‘రాష్ట్రంలో ఎయిడెడ్‌ పాఠశాలలు, కళాశాలలు మూతపడవు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు హామీ ఇస్తున్నాం. ఒక వేళ ప్రైవేట్‌ వ్యక్తులు మూసివేయదల్చుకుంటే ప్రభుత్వం వాటిని నడుపుతుంది. యాజమాన్యాలు ఏకపక్షంగా మూసివేసేందుకు అనుమతి లేదు. అలాంటి సంస్థలపై చర్యలు తీసుకుంటాం. విజయవాడలోని మాంటిస్సోరి విద్యా సంస్థను మూసి వేస్తున్నారన్న వార్తలపై వారి నుంచి వివరణ కోరాం. ఎయిడెడ్‌ విద్యా సంస్థల ఆస్తులు దక్కించుకోవాలన్న దురుద్దేశం ప్రభుత్వానికి లేదు. కమిటీ శాస్త్రీయంగా చేసిన సిఫార్సులపై నిర్ణయం తీసుకున్నాం’ అని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వివరించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని