ఫీజు కడితేనే ధ్రువపత్రం

ప్రధానాంశాలు

ఫీజు కడితేనే ధ్రువపత్రం

కళాశాలలు తేల్చిచెబుతుండటంతో విద్యార్థుల అవస్థలు
గత విద్యా సంవత్సరానికి పూర్తికాని బోధన రుసుముల చెల్లింపు
సుమారు రూ.1000 కోట్ల బకాయిలు  
ఈనాడు - అమరావతి

ప్రభుత్వం ‘విద్యాదీవెన’ పథకం కింద బోధన రుసుములను సకాలంలో చెల్లించకపోవడంతో గతేడాది డిగ్రీ, ఇంజినీరింగ్‌ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఫీజు బకాయిలు చెల్లిస్తేనే విద్యార్హత ధ్రువపత్రాలు ఇస్తామని కళాశాలలు స్పష్టం చేస్తుండటంతో ఉన్నత చదువులకు వెళ్లాల్సిన వారు, ఉద్యోగాలు సాధించినవారు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. గత (2020-21) విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ, ఇంజినీరింగ్‌ విద్యార్థుల చదువు పూర్తయినా ప్రభుత్వం రెండు విడతల బోధన రుసుములను మాత్రమే విడుదల చేసింది. మరో రెండు వాయిదాలను డిసెంబరు, ఫిబ్రవరిలో చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఫీజు బకాయిలు చెల్లిస్తేనే ధ్రువపత్రాలు ఇస్తామని కళాశాలలు చెబుతున్నాయని పలువురు విద్యార్థులు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు చేస్తున్నారు. కొంతమంది ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారు. తాము ఇప్పుడు ధ్రువపత్రాలిచ్చేస్తే బకాయిలు వసూలు కావని కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. మరోవైపు ఇంజినీరింగ్‌ 2, 3, 4 సంవత్సరాల్లోకి ప్రవేశించినవారు, డిగ్రీ రెండు, మూడు సంవత్సరాల్లోకి వచ్చిన వారిపైనా ఫీజులు కట్టాలని ఒత్తిడి పెరుగుతోంది. గత విద్యా సంవత్సరానికి సంబంధించి రెండు వాయిదాలను ప్రభుత్వం విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో వేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను హైకోర్టు ఇటీవల రద్దు చేసింది. దీనిపై ధర్మాసనం ముందు అప్పీల్‌ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తల్లుల ఖాతాల్లో బోధన రుసుములు వేస్తున్నందున ఇప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చేస్తే తర్వాత వారు తమకు చెల్లించరని, గతంలో వారి ఖాతాల్లో వేసిన రెండు వాయిదాల్లో కొంత మొత్తం ఇప్పటికీ తమకు అందలేదని కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి.

పాత బకాయిలూ భారీగానే..

గతేడాది అన్ని కోర్సులకు కలిపి రెండు వాయిదాల రుసుములు సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు రావాల్సి ఉంది. 2018-19 సంవత్సరానికి సంబంధించి మరో రూ.250 కోట్ల వరకు పెండింగ్‌లో ఉంది. ప్రైవేటులో పీజీ కోర్సులకు బోధన రుసుముల చెల్లింపు నిలిపివేసినా ప్రభుత్వం పాత బకాయిలు రూ.400 కోట్లను నేటికీ విడుదల చేయలేదు. దీంతో చాలామంది పీజీ విద్యార్థులు సొంత డబ్బులు కట్టి, ధ్రువపత్రాలను తీసుకున్నారు. ఇప్పుడు బీటెక్‌ విద్యార్థులకూ అదే పరిస్థితి ఎదురైంది. ప్రభుత్వ నిబంధనలు, కళాశాలల నిర్ణయాలతో తాము ఇబ్బందులు పడుతున్నామని పేద విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని