భూముల లెక్కలు మారుతున్నాయ్‌!

ప్రధానాంశాలు

భూముల లెక్కలు మారుతున్నాయ్‌!

51 చోట్ల చేపట్టిన రీసర్వేతో విస్తీర్ణాలలో మార్పులు
మరో 574 గ్రామాల్లో  కొలతలకు కసరత్తు

*గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం మర్రిపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి రికార్డుల్లో 2.73 ఎకరాల పొలం ఉంది. రీసర్వేలో 2.67 ఎకరాలే ఉన్నట్లు తేలింది.
* కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్‌మహమ్మద్‌పేట గ్రామ సర్వేనంబరు 152లో కె.నాగేంద్రరెడ్డికి 46.5 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. రీసర్వేలో 48సెంట్లు (అదనంగా   1.5 సెంట్లు) వచ్చింది.
రాష్ట్రంలో చేపట్టిన రీసర్వేలో భూముల లెక్కలు మారుతున్నాయి. రికార్డుల్లో ఎకరా ఉంటే కొలిస్తే 95 సెంట్లు మాత్రమే ఉంటోంది. చాలా చోట్ల భూవిస్తీర్ణం పెరుగుతోంది. ఏళ్ల తరబడి సాగుతున్న లావాదేవీల వల్ల గట్ల మార్పులు జరిగాయి. సర్వే రాళ్లు అదృశ్యమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష పథకం’లో భాగంగా రీసర్వేను ప్రయోగాత్మకంగా గతేడాది కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో పూర్తి చేసింది. మలి విడతలో ప్రతి రెవెన్యూ డివిజన్‌లో ఒక్కొక్కటి చొప్పున రాష్ట్రంలోని 51 గ్రామాల్లో గతేడాది డిసెంబరునుంచి డ్రోన్‌ సాయంతో చేపట్టిన రీసర్వే పూర్తయ్యింది. దీన్ని కలెక్టర్ల ఆమోదంతో త్వరలో గెజిట్‌లో ప్రచురించనున్నారు. ఈ క్రమంలోనే మరో 574 గ్రామాల్లోనూ రీసర్వేకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుత రీసర్వేలో రైతు ఆధీనంలోని భూమిని ల్యాండ్‌పార్సిల్‌ నంబరుగా వ్యవహరిస్తున్నారు. ఒకరికి పదెకరాలుంటే ఈ భూమి నాలుగైదు సర్వేనంబర్లలో ఉంటోంది. కొత్త విధానంలో ఒకే చోట భూమి ఉంటే ఒక ఎల్పీ నంబరు ఇస్తున్నారు. ఆ తరువాత యూనిక్‌ ఐడీ నంబరు ఇస్తారు.

కృష్ణా జిల్లాలో..
గుడివాడ మండలం మెరకగూడెం, నూజివీడు మండలం మర్రిబంధం, మచిలీపట్నం మండలం పొట్లపాలెం, జగ్గయ్యపేట మండలం షేర్‌మహ్మద్‌పేట గ్రామాల్లో కలిపి 2,809.93 ఎకరాల్లో రీసర్వే చేశారు. మొత్తంగా 2,807.73 ఎకరాలున్నట్లు గుర్తించారు. ఈ గ్రామాల్లో కలిపి మొత్తంగా 2.20 ఎకరాల భూమి తగ్గింది. పలుచోట్ల రైతుల భూమి స్వల్పంగా పెరిగింది. వీటిపై వచ్చిన 76 విన్నపాల్లో 75 పరిష్కారమయ్యాయి. 6,7 దశాబ్దాల కిందట కొనుక్కున్న భూమిలో రీసర్వే వల్ల ఇప్పుడు 3సెంట్లు తగ్గిందని కృష్ణా జిల్లా మర్రిబంధం గ్రామవాసి అంజిబాబు వాపోయారు.
అభ్యంతరాలొస్తే మళ్లీ కొలతలు
భూమి కోల్పోయానని రైతు అభ్యంతరం తెలిపినప్పుడు మళ్లీ కొలుస్తున్నారు. అలాగే కేంద్రం ప్రకటించిన సమిత్వ (ఆబాది) సమిత్వ భూములను (గ్రామకంఠం) రీసర్వే చేస్తున్నారు. 3గ్రామాల కూడళ్ల వద్ద ‘ఏ’ శ్రేణి, పొలాల హద్దుల వద్ద ‘బీ’ శ్రేణి రాళ్లను నాటుతున్నారు.
26వేల ఎకరాల్లో రీసర్వే
ఈనెల తొలి వారం వరకున్న సమాచారం ప్రకారం.. 51 గ్రామాల్లో కలిపి 26,730.69 ఎకరాల్లో రీసర్వే చేశారు. కొన్నిచోట్ల రెవెన్యూ శాఖపరంగా, మరికొన్ని ప్రాంతాల్లో సర్వే శాఖపరంగా అభ్యంతరాలొచ్చాయి. మ్యుటేషన్‌ (అడంగల్‌లో మార్పు), ఒకే భూమికి ఇద్దరు హక్కులు కలిగి ఉండడం, విస్తీర్ణపరంగా అభ్యంతరాలొచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.


రైతులు అర్థం చేసుకుంటున్నారు
-మాధవీలత, కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌

అప్పట్లో గొలుసులు, అంచనాలతో కొలతల వివరాలు రికార్డుల్లో నమోదు చేశారు. దీనివల్ల రీసర్వేలో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. అత్యాధునిక సాంకేతికతతో ఒక్కోసారి నాలుగైదుసార్లు కూడా కొలుస్తున్నాం. 99శాతం మంది రైతులు ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుంటున్నారు.

- ఈనాడు, అమరావతి

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని