జగన్‌ ఎన్డీయేలో చేరాలి

ప్రధానాంశాలు

జగన్‌ ఎన్డీయేలో చేరాలి

‘ఉక్కు’ ప్రైవేటీకరణతో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు ముప్పు

కేంద్ర మంత్రి రామదాస్‌ అఠావలే

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తనకు మంచి మిత్రుడని, ఆయన ఎన్డీయే కూటమిలో చేరాలని తాను వ్యక్తిగతంగా కోరుతున్నానని కేంద్ర సామాజిక న్యాయం, సాధికార శాఖ సహాయ మంత్రి రాందాస్‌ అఠావలే అన్నారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన ఆదివారం గవర్నర్‌ బంగ్లాలో విలేకర్లతో మాట్లాడారు. ‘మేం ఎన్డీయేను విస్తరించాలనుకుంటున్నాం. వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఎన్డీయేలో చేరాలని నేను కోరుతున్నాను. అదే జరిగితే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మరింత సాయం అందుతుంది. దానిగురించి ఆలోచించండి. జగన్‌ సిద్ధంగా ఉంటే.. ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌ షా, భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో నేను మాట్లాడతాను. వైకాపా ఎప్పుడూ రాజ్యసభ, లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంది. ఎన్డీయేలో చేరితే జాతీయ రహదారులు, నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రానికి మరింత మేలు జరుగుతుంది’ అని కేంద్ర మంత్రి చెప్పారు. మూడు రాజధానుల వ్యవహారం రాష్ట్ర పరిధిలోని అంశమని తెలిపారు.

* విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వల్ల ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అఠావలే వ్యాఖ్యానించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించిందని, అది అమలైతే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని తాము కోరుతున్నామన్నారు.


రాందాస్‌ అఠావలే అతిగా మాట్లాడుతున్నారు

భాజపా నేత లంకా దినకర్‌ మండిపాటు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉంది. అర్థం పర్థం లేని మాటలతో కేంద్రమంత్రి రాందాస్‌ అఠావలే అతిగా మాట్లాడుతున్నారు’ అని భాజపా నేత లంకా దినకర్‌ ఒక ప్రకటనలో మండిపడ్డారు. వైకాపాతో వ్యక్తిగత సంబంధాలుంటే వ్యక్తిగతంగానే చూసుకోవాలి గానీ ప్రజలను పక్కదోవ పట్టించే వ్యాఖ్యలు వద్దని హితవు పలికారు. బాధ్యత గల మంత్రిగా ఆంధ్రప్రదేశ్‌లో దళితులపై జరుగుతున్న దాడులపై దృష్టిపెట్టి చర్యలు తీసుకుంటే ప్రజలు సంతోషిస్తారన్నారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని