CLAP: చెత్త సేకరణకు విద్యుత్‌ వాహనాలు

ప్రధానాంశాలు

CLAP: చెత్త సేకరణకు విద్యుత్‌ వాహనాలు

వ్యర్థాల తొలగింపులో అత్యుత్తమ విధానాలు అమలుచేయాలి

పరిశుభ్రత కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం

‘క్లాప్‌’పై సమీక్షలో అధికారులకు సీఎం జగన్‌ ఆదేశాలు

ఈనాడు, అమరావతి: ప్రజలకు, వాతావరణానికి హాని కలిగించే వ్యర్థాల తొలగింపులో అత్యుత్తమ విధానాలు అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కింద రాష్ట్రంలో ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి సీఎం శుక్రవారం సమీక్షించారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రత కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే... ‘గ్రేడ్‌ 2, 3 నగర పంచాయతీలు, పట్టణాలు, నగరాలకు క్లాప్‌ కింద నిర్దేశించిన వాహనాలను చేరవేయాలి. ప్రతి ఇంటికీ చెత్త బుట్టలు అందించాలి. చెత్త సేకరణ, తరలింపు కోసం అన్ని ప్రాంతాలకూ విద్యుత్‌ వాహనాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసుకోవాలి. నగరాలు, పట్టణాల్లో చెత్త కేంద్రాల వల్ల సమీపంలోని ఇళ్లకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు చెత్త తొలగిస్తూ, ఆ ప్రాంతంలో దుర్వాసన రాకుండా చూడాలి. క్లాప్‌ అమలును పర్యవేక్షిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ రూంలో సమర్థులైన అధికారులను పెట్టాలి. ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి. గ్రామాల్లో చెత్త బుట్టలు లేనివాళ్లకు వాటిని అందించాలి. పల్లెల్లో పారిశుద్ధ్యంపైనా నివేదికలు తెప్పించుకుని ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. గ్రామ క్లినిక్‌లలో నీరు, గాలిలో కాలుష్యంపై పరీక్షలు చేయించాలి. క్రమం తప్పకుండా తాగునీటి ట్యాంకులు పరిశుభ్రం చేయించాలి.వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన చర్యలపై నిరంతరం దృష్టి పెట్టాలి’ అని సీఎం అన్నారు. ‘పట్టణాల్లో మురుగునీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలి. ప్రజా మరుగుదొడ్లు నిర్మించడమే కాదు..వాటిని పరిశుభ్రంగా ఉంచేలా ప్రత్యేక దృష్టి పెట్టాలి’ అని సీఎం సూచించారు.

30 లక్షల చెత్తబుట్టల పంపిణీ: ‘క్లాప్‌’ కార్యక్రమంలో భాగంగా ఇళ్ల నుంచి చెత్త సేకరణకు రాష్ట్రంలో ఇప్పటివరకూ 30 లక్షల చెత్త బుట్టలను పంపిణీ చేశామని సీఎంకు అధికారులు వివరించారు. గ్రామాల్లో ఘనవ్యర్థాల ప్రాసెసింగ్‌ సెంటర్లు, పట్టణాల్లో 72 చోట్ల సమీకృత ఘనవ్యర్థాల యాజమాన్య ప్లాంట్ల ఏర్పాటును 2022 జూన్‌కు పూర్తిచేస్తామని వెల్లడించారు. గుంటూరులో వ్యర్థాల నుంచి విద్యుత్తు ఉత్పత్తి కర్మాగారం సిద్ధమైందని అధికారులు వివరించారు. రాష్ట్రంలో ఇలాంటివి రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రికి తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని