Rakesh Jhunjhunwala: ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్‌ఝున్‌వాలా కుటుంబానికి టైటాన్‌ షాక్‌..!

బిగ్‌బుల్‌ దివంగత రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా కుటుంబానికి టైటన్‌ షేరు ఒక్క రోజులో రూ. వందల కోట్ల నష్టాన్ని తీసుకొచ్చింది.

Published : 07 May 2024 19:24 IST

ఇంటర్నెట్‌డెస్క్: భారత మార్కెట్‌లో బిగ్‌బుల్‌గా పేరున్న దివంగత రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా(Rakesh Jhunjhunwala)ను సంపన్నుడిగా మార్చిన షేర్లలో టైటాన్‌ కూడా ఒకటని పరిశీలకులు చెబుతారు. అదే షేరు సోమవారం ఆ కుటుంబానికి భారీ నష్టాన్ని మిగిల్చింది. 

టాటా గ్రూప్‌నకు చెందిన టైటాన్‌ కంపెనీ సోమవారం మార్చి త్రైమాసిక ఫలితాలు నిరాశపర్చాయి. షేరు ఒక దశలో 7.87% నష్టపోయి రూ.3,257.05కు చేరింది. చివరకు 7.18% కోల్పోయి రూ.3,281.65 దగ్గర స్థిరపడింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.22,527.56 కోట్లు పతనమై రూ.2.91 లక్షల కోట్లకు చేరింది. ఈ కంపెనీలో రాకేశ్‌ సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలాకు దాదాపు 5.35 శాతం వాటాలున్నాయి. వీటి విలువ రూ.16,792 కోట్లు. తాజాగా విలువ పతనంతో వీటి విలువ రూ.15,986 కోట్లకు చేరింది. దీంతో వీరి కుటుంబం రూ.806 కోట్ల నష్టాన్ని మూటగట్టుకొన్నట్లైంది. 

2002-2003లో రాకేశ్‌ ఒక్కో షేరును సగటున రూ.3 దగ్గర కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆ షేరు విలువ ఎక్కడా తగ్గలేదు. కొన్ని వందల రెట్లు పెరిగింది. ఆయన మరణం వేళకు ఈ కంపెనీలో ఆయన కుటుంబ వాటా దాదాపు 5శాతం పైగానే  ఉంది. చాలా ఇంటర్వ్యూల్లో కూడా టైటాన్‌ షేర్‌పై ఆయన తనకు ఉన్న ప్రేమను దాచుకొనేవారు కాదు.  తనకు బాగా కలిసొచ్చిన స్టాక్‌గా దానిని అభివర్ణించేవారు. ఇక రాకేశ్‌ సతీమణి రేఖా ఈ ఏడాది మార్చిలో వార్తల్లో నిలిచారు. తమ బంగ్లా నుంచి సముద్రాన్ని వీక్షించేందుకు అడ్డం రావచ్చనే అనుమానంతో ఏకంగా తొమ్మిది ప్లాట్లను రూ.118 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. ఫలితంగా ఆ ఫ్లాట్ల పునర్నిర్మాణ ప్రక్రియను షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ వాయిదా వేసిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని