gold jewels: రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్‌ బోల్తా.. తర్వాత ఏమైందంటే?

వందల కోట్ల రూపాయలు విలువచేసే బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్‌ బోల్తా పడిన ఘటన ఈరోడ్‌లో చోటుచేసుకుంది.

Published : 07 May 2024 16:24 IST

(ప్రతీకాత్మక చిత్రం)

ఈరోడ్‌: రూ.వందల కోట్ల విలువ చేసే  బంగారు ఆభరణాలను తరలిస్తున్న కంటెయినర్‌ బోల్తా పడిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తమిళనాడులోని ఈరోడ్‌ సమీపంలో చిటోడేలో 810 కిలోల పసిడితో వెళ్తున్న ఓ ప్రైవేటు కంటెయినర్‌ సోమవారం రాత్రి బోల్తా పడినట్లు పోలీసులు వెల్లడించారు.  అందులో ఉన్న బంగారు ఆభరణాల విలువ రూ.666 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేటు లాజిస్టిక్స్‌ సంస్థకు చెందిన  కంటెయినర్‌ బంగారు ఆభరణాలను లోడ్‌ చేసుకొని కోయంబత్తూరు నుంచి సేలంకు బయల్దేరింది. సమతువపురం సమీపంలోకి రాగానే డ్రైవర్‌ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌ శశికుమార్‌తో పాటు సెక్యూరిటీ గార్డు బాల్‌రాజ్‌ కిందపడిపోవడంతో గాయపడ్డారు. 

ఊటీ, కొడైకెనాల్‌ వెళ్లేందుకు ఈ-పాస్‌ తప్పనిసరి

ఈ ఘటనపై సమాచారం అందుకున్న చిటోడే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, కంటెయినర్‌ లోపల ఉన్న బంగారు ఆభరణాలు సురక్షితంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సంబంధిత యజమానులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన అక్కడికి కొత్త కంటెయినర్‌ను పంపించగా.. బోల్తా పడిన వాహనంలోని ఆభరణాలను అందులోకి ఎక్కించి సేలంకు తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిటోడే పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని