Delhi vs Rajasthan: సంజు శాంసన్‌ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై దిల్లీ విజయం

ఐపీఎల్‌-2024లో భాగంగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Updated : 08 May 2024 02:37 IST

దిల్లీ: రాజస్థాన్‌తో జరిగిన కీలక పోరులో దిల్లీ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో8 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్లు అభిషేక్‌ పోరెల్‌ (65: 36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), జేక్‌ ఫ్రేజర్‌ (50: 20 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగారు. చివర్లో స్టబ్స్‌ (41: 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. రాజస్థాన్‌ బౌలర్లలో అశ్విన్‌ 3 వికెట్లు తీయగా, చాహల్‌, బౌల్ట్‌, సందీప్‌ శర్మ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. అనంతరం 222 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులకు పరిమితం అయింది. కెప్టెన్‌ సంజు శాంసన్‌ (86: 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించినప్పటికీ కీలక సమయంలో ఔట్‌ కావడంతో రాజస్థాన్‌ ఓటమి పాలైంది. రియాన్‌ పరాగ్‌ (27), శుభమ్‌ దూబె (25) పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌, ముకేశ్‌ కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌ తలో రెండు వికెట్లు తీయగా, రసిఖ్‌ దర్‌ సలాం, అక్షర్‌ పటేల్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. 

సంజు శాంసన్‌ ఒంటరి పోరు..

దిల్లీ నిర్దేశించిన 222 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌కు తొలి ఓవర్‌లోనే షాక్‌ తగలింది. ఖలీల్‌ వేసిన రెండో బంతికి అక్షర్‌ పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చి యశస్వీ జైస్వాల్‌ వెనుదిరిగాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌గా క్రీజులోకి అడుగుపెట్టిన శాంసన్‌ ఖలీల్‌ వేసిన మూడో ఓవర్‌లో ఉగ్రరూపం దాల్చాడు. ఒక సిక్స్‌, రెండు ఫోర్లు కొట్టి నెమ్మదిగా సాగుతున్న ఇన్నింగ్స్‌కు ఒక్కసారిగా ఊపు తెచ్చాడు. ఇషాంత్‌ వేసిన నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్‌, ముకేశ్‌ వేసిన ఐదో ఓవర్లో వరుసగా ఒక సిక్స్‌, రెండు ఫోర్లు కొట్టాడు. దీంతో రెండు ఓవర్లకు 9 పరుగులుగా ఉన్న స్కోర్‌.. శాంసన్‌ వీరవిహారానికి ఐదు ఓవర్లకు 57 పరుగులకు చేరింది. అక్షర్‌ వేసిన ఆరో ఓవర్లో ఫోర్‌, సిక్స్‌ కొట్టి ఊపుమీదున్న బట్లర్‌ (19) బౌల్డ్‌ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా రాజస్థాన్‌ బ్యాటింగ్‌ నెమ్మదించింది. 10 ఓవర్లకు ఆజట్టు 2 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. 11వ ఓవర్లో రసిఖ్‌ బౌలింగ్‌లో రియాన్‌ పరాగ్‌ బౌల్డయ్యాడు. రసిఖ్‌ వేసిన 13వ ఓవర్లో శాంసన్‌ మళ్లీ రెచ్చిపోయాడు. వరుసగా 6, 4, 6 కొట్టడంతో ఈ ఓవర్లో మొత్తం 18 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత ఓవర్లో సంజూ ఒక ఫోర్‌ కొట్టగా, శుభమ్‌ దూబె ఒక ఫోర్‌, ఒక సిక్స్‌ కొట్టాడు.

15 ఓవర్లకు రాజస్థాన్‌ 159 పరుగులతో నిలిచింది. అప్పటికీ రాజస్థాన్‌ విజయానికి కావాల్సినవి 30 బంతుల్లో 63 పరుగులు. క్రీజులో శాంసన్‌, దూబె ఉండడంతో రాజస్థాన్‌ గెలుపుదిశగా వెళుతుందని భావించారు. అయితే 16వ ఓవర్‌ నాలుగో బంతికి శాంసన్‌ ఔటయ్యాడు. శాంసన్‌ కొట్టిన భారీ షాట్‌ను షై హోప్‌ అద్భుత ఫీల్డింగ్‌తో బౌండరీ లైన్‌ వద్ద అందుకున్నాడు. ఫోర్‌, సిక్స్‌ బాది దూకుడు మీదున్న శుభమ్‌ను ఖలీల్‌ ఔట్‌ చేశాడు. 18వ ఓవర్‌లో కుల్దీప్‌ యాదవ్‌ సూపర్ బౌలింగ్‌ వేశాడు. ఫెరీరా, అశ్విన్‌ను ఔట్‌ చేయడమే కాకుండా కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు. రాజస్థాన్‌ వరుసగా వికెట్లు కోల్పోతున్నప్పటికీ క్రీజులో హిట్టర్‌ రోమన్‌ పావెల్‌ ఉండడంతో ఆ జట్టు శిబిరంలో కొంత ఆశ ఉంది. చివరి రెండు ఓవర్లకు ఆ జట్టు లక్ష్యం 37 పరుగులుగా మారింది. అయితే 19 ఓవర్లో కేవలం 8 పరుగులు మాత్రమే వచ్చాయి. 20 ఓవర్‌లో పావెల్‌ను ముకేశ్‌ కుమార్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఈ ఓవర్లో 8 పరుగులే ఇవ్వడంతో దిల్లీ 20 పరుగుల తేడాతో గెలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని