టీకా ఉత్సవానికి కేంద్రం 6.4లక్షల డోసులే పంపింది
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకా ఉత్సవానికి కేంద్రం 6.4లక్షల డోసులే పంపింది

చంద్రబాబు ప్రచారం వల్లే దిల్లీ, ఒడిశాలకు వెళ్లే ఏపీ ప్రజలకు క్వారంటైన్‌
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల ధ్వజం

ఈనాడు, అమరావతి: ‘దేశవ్యాప్తంగా ఏప్రిల్‌లో నిర్వహించిన టీకా ఉత్సవంలో భాగంగా రాష్ట్రంలో ప్రజలకు వ్యాక్సిన్‌ వేసేందుకు 25లక్షల టీకా డోసులు పంపాలని ముఖ్యమంత్రి జగన్‌ లేఖ రాస్తే కేంద్రం కేవలం 6.4లక్షలను మాత్రమే పంపింది’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘వ్యాక్సిన్లు రాష్ట్రాల పరిధిలో లేవు.. కేంద్రం చేతిలో ఉన్నాయని తెలిసీ రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు వేయడం లేదంటూ చంద్రబాబు మాట్లాడడం హేయమైన చర్య’ అని విమర్శించారు. శుక్రవారం ఆయన వైకాపా కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘45ఏళ్లు పైబడిన వారికోసం 60లక్షల వ్యాక్సిన్లు కావాలని ముఖ్యమంత్రి జగన్‌ కేంద్రాన్ని కోరారు..మరోవైపు ఏప్రిల్‌ 24న 4కోట్ల వ్యాక్సిన్ల కోసం భారత్‌ బయోటెక్‌, సీరం సంస్థలకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి వేరువేరుగా లేఖలు రాశారు, అయితే కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాక్సిన్లను రాష్ట్రాలకు సరఫరా చేస్తామని ఆ సంస్థలు ప్రత్యుత్తరమిచ్చాయి. ప్రతిపక్ష నేతగా చంద్రబాబుకు బాధ్యత ఉంటే ముఖ్యమంత్రి అభ్యర్థన మేరకు రాష్ట్రానికి వ్యాక్సిన్లు పంపమని ప్రధానిని కోరాలి. కనీసం సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగానైనా ఆయన(చంద్రబాబు)రాష్ట్ర ప్రజలకు భరోసానిచ్చేలా వ్యవహరించలేకపోతున్నారు. ఎన్‌440కే స్ట్రెయిన్‌ వైరస్‌పై చంద్రబాబు చేసిన దుష్ప్రచారం వల్లే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులు వారి రాష్ట్రాలకు వస్తే 14రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనంటూ దిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసే పరిస్థితి వచ్చింది’ అని ఆరోపించారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు