అమూల్‌కు రుణాలు ఇవ్వండి

ప్రధానాంశాలు

అమూల్‌కు రుణాలు ఇవ్వండి

డీసీసీబీ, డీసీఎంఎస్‌ అధ్యక్షుల సమావేశంలో మంత్రి కన్నబాబు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో చేపడుతున్న అమూల్‌ ప్రాజెక్టులకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల(డీసీసీబీ) నుంచి రుణం అందించేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు సూచించారు. తొలిదశలో చిత్తూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, గుంటూరు, కడప జిల్లాల్లో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని అన్ని డీసీసీబీలు, జిల్లా సహకార మార్కెటింగ్‌ సమాఖ్య(డీసీఎంఎస్‌)ల పనితీరుపై బుధవారం విజయవాడలో ఆయన సమీక్షించారు. ‘రుణాల మంజూరులో డీసీసీబీ ఛైర్మన్లు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకూ లోను కావొద్దు’ అని మంత్రి కోరారు. ‘ఆర్థిక స్థోమత ఉండి కూడా అప్పులు చెల్లించని వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి బకాయిలను వసూలు చేయాలి. కౌలు రైతులకు జాతీయ బ్యాంకుల కంటే ఎక్కువ మొత్తంలో రుణాలు ఇవ్వాలి’ అని సూచించారు. ప్రాథమిక సహకార సంఘాలు(పీఏసీఎస్‌), బ్యాంకుల పాలకవర్గాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి కన్నబాబు చెప్పారు. ‘ఒకే చోట అయిదేళ్లు దాటిన బ్యాంకు మేనేజర్లను బదిలీ చేసేలా చర్యలు తీసుకోండి. త్వరలో పీఏసీఎస్‌ల కార్యదర్శులు, బ్యాంకు ఉద్యోగులను బదిలీ చేయబోతున్నాం. ఉద్యోగుల జీత భత్యాలనూ సరిచేస్తాం’ అని తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని