మనసులో మాటై..మమతల తోటై..!

ప్రధానాంశాలు

మనసులో మాటై..మమతల తోటై..!

పండంటి బిడ్డ పుడితే.. ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. వారి బోసినవ్వుల్లో తడిసి ముద్దవ్వాలని.. వారి బుడిబుడి అడుగుల సవ్వళ్లతో తమ ఇల్లు సందడి కావాలని.. వారి వచ్చిరానీ మాటలతో తమ పొదరింట నిత్య వసంతం విరియాలని కలలు కన్నారు. వారొకటి తలిస్తే.. ఆ విధి మరొకటి లిఖించింది. అన్యంపుణ్యం ఎరుగని ఆ బిడ్డల్లో కొందరిని పుట్టుకతోనే రుగ్మతలు చుట్టుముడితే.. అనారోగ్య కారణాలతో మరికొందరు అచేతనులయ్యారు. అయితేనేం.. ఆ తల్లిదండ్రులు కుంగిపోలేదు.. విధిని దూషిస్తూ మిన్నకుండిపోలేదు.. బిడ్డల ఆరోగ్యం కోసం.. వారిని మామూలు మనుషులుగా తీర్చిదిద్దేందుకు అహరహం శ్రమిస్తున్నారు. బిడ్డల అడుగులో అడుగై.. వారి మనసులో మాటై.. వారి భవితే సర్వస్వమై ముందుకు సాగుతున్నారు. తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం. 

అడుగులో అడుగై..
ఆ దంపతులకు పండంటి మగబిడ్డ పుడితే ఉప్పొంగిపోయారు. నెలలు గడుస్తున్నా.. ఆ చిన్నారిలో ఎలాంటి చలనం లేకపోవడంతో.. మనసులో తెలియని అలజడి. కొన్నాళ్లకు వారి భయమే నిజమైంది. పుట్టిన వెంటనే ఫిట్స్‌ రావడంతో మెదడులో నరాలు దెబ్బతిన్నాయి. దాన్ని వైద్యులు దాచడం.. 9 నెలల వయసులో నెల్లూరులోని ఓ ఆసుపత్రి నర్సు గుర్తించడంతో విషయం వెలుగుచూసింది. పదమూడేళ్లొచ్చినా.. పసిబిడ్డగానే అతడిని తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. వెంకటగిరి పట్టణం గొల్లపాళేనికి చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు వీరిబొయన గోపి, జ్యోతి దంపతులు. వీరి కుమారుడు సాయి సంతోష్‌(13) బుద్ధిమాంధ్యంతో బాధపడుతున్నాడు. ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం బాలుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కుమారుడిని గోపి సైకిల్‌పై కూర్చోబెట్టుకుని పట్టణంలో కాసేపు తిప్పుతూ ఇంటికి తీసుకొస్తున్నారు. స్థానికంగా భవిత కేంద్రంలో చేర్పించడం ద్వారా సంతోష్‌ వస్తువులను గుర్తించడం, పలకడం తదితరాలు నేర్చుకున్నారు. ఆకలి వేస్తే పళ్లెం, దాహమేస్తే గ్లాస్‌ తీసుకొస్తున్నారు. తన పనులన్నీ తానే చేసుకునేలా తల్లి నేర్పించారు. ఒక్కగానొక్క కుమారుడ్ని ప్రాణం కంటే జాగ్రత్తగా చూసుకుంటూ.. పలువురి మన్ననలు చూరగొంటున్నారు.

బిడ్డ కోసం ఆయాగా..
నడవలేని తన బిడ్డ భవిత కేంద్రంలో ఎలా ఉండగలడో.. వాణ్ని ఎవరు చూసుకుంటారోనని ఆ తల్లి మదన పడిపోయారు. కుమారుడి కోసమే ఆయాగా చేరారు. అక్కడున్న దివ్యాంగ పిల్లలను చూసి చలించిపోయి.. తనయుడితో సమానంగా వారి ఆలనాపాలనా చూసుకున్నారు. ఒక్క రూపాయి తీసుకోకుండా రెండేళ్లు పని చేశారు. వెంకటగిరి పట్టణం బంగారుపేటకు చెందిన చేనేత కార్మికుడు శేఖర్, పెంచలమ్మ కుమారుడు గంగా సుబ్రహ్మణ్యం. బాల్యంలోనే కాళ్లు చచ్చుబడిపోవడంతో.. గారాబంగా పెంచారు. తనయుడ్ని తల్లే మోసుకుని పాఠశాలకు తీసుకెళ్లేవారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి.. ఇంటికి తీసుకొచ్చేవారు. ఆ క్రమంలోనే భవిత కేంద్రంలో చేర్పించి ఫిజియోథెరపీ చేయించారు. తాను ఇంటికెళ్లిపోతే తనయుడ్ని ఎవరు చూసుకుంటారనే ప్రశ్న ఆమె మదిలో మెదలడంతో.. అక్కడే ఆయాగా చేరారు. సుమారు రెండేళ్ల పాటు రూపాయి కూడా జీతం తీసుకోకుండానే ఇతర బుద్ధిమాంద్యం, దివ్యాంగ పిల్లలకు అమ్మలా సేవలు చేశారు. కొన్నాళ్లకు గంగా సుబ్రహ్మణ్యానికి గుంటూరులో శస్త్రచికిత్స చేయగా.. వాకింగ్‌ ఛైర్‌ సాయంతో నడిచారు. తల్లి తోడ్పాటుతో పదో తరగతి ఉత్తీర్ణత సాధించారు. ఓ వైపు మగ్గం పనిలో భర్తకు చేదోడుగా ఉంటూ.. మరో వైపు బిడ్డ ఉన్నతికి పెంచలమ్మ ఎంతో శ్రమించారు. ప్రస్తుతం మూడు చక్రాల కుర్చీ విరిగిపోవడం.. కొత్తది కొనుగోలు చేసే స్థోమత లేకపోవడంతో సుబ్రహ్మణ్యం ఇంటికే పరిమితమయ్యారు.

నడక.. నడత నేర్పిస్తూ..
డక్కిలికి చెందిన రేవతి, వెంకటేశ్వర్లు దంపతులు. వీరి గారాలపట్టీ ఆస్మిత(9)కు పుట్టుకతోనే కాళ్లు చచ్చుబడటంతో.. వివిధ ఆసుపత్రుల్లో వైద్యం చేయించారు. తండ్రి వ్యవసాయ కూలి కాగా, అప్పులు చేసి రూ.2.50 లక్షల మేర వైద్యానికి వెచ్చించారు. సత్ఫలితం రాకపోవడంతో.. డక్కిలిలోని భవిత కేంద్రంలో చేర్పించి ఫిజియోథెరపీ చేయిస్తున్నారు. చిన్నారిలో ఇప్పుడిప్పుడే మార్పొస్తోంది. సుమారు 500 మీటర్ల మేర నడుస్తోంది. ప్రస్తుతం మూడో తరగతి చదువుతుండగా- అక్షరాలు రాస్తోంది. తల్లిదండ్రుల చొరవ, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో చదువులోనూ రాణిస్తోంది. రోజూ భవిత కేంద్రానికి తల్లే ఆటోలో తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం తన కుమార్తె ఆరోగ్య పరిస్థితి మెరుగవవుతోందని.. త్వరలోనే పూర్తిస్థాయిలో మార్పొస్తుందని తల్లి ఆశాభావం వ్యక్తం చేశారు.

కంటికి రెప్పలా..
గూడూరు పట్టణం గాంధీనగర్‌ ప్రాంతానికి చెందిన పెంచలయ్య, సులోచన దంపతులు. వీరి కుమార్తె పూజిత(13). పుట్టుకతోనే దివ్యాంగురాలు. కాళ్లు, చేతులు పని చేయడం లేదు. తండ్రి కూలి కాగా, సుమారు రూ.2 లక్షలు అప్పులు చేసి వేర్వేరు వైద్యశాలల్లో చికిత్స చేయించారు. ఫలితం లేకపోవడంతో ఇంటి వద్దే జాగ్రత్తగా చూసుకుంటున్నారు. బాలిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని.. స్థానికంగా భవిత కేంద్రంలో చేర్పించి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. తల్లే చొరవ తీసుకొని రోజూ ఆటో మాట్లాడుకొని తీసుకెళ్తున్నారు. అక్కడ వైద్యులు చేయించే వ్యాయామాన్ని నిత్యం ఇంట్లోనే చేయిస్తున్నారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి మెరుగుగా ఉందని, పాప సాధారణ స్థితికొస్తే ఆర్థికంగా స్థిరపడేందుకు వీలు కలుగుతుందని తల్లి చెబుతోంది.   


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని