విశ్వశాంతికి చోదక శక్తిగా...

సంపాదకీయం

విశ్వశాంతికి చోదక శక్తిగా...

చారిత్రక సందర్భాల సమాహారంగా సాగిన ప్రధాని మోదీ అమెరికా పర్యటన దిగ్విజయమైంది. అగ్రరాజ్య అధ్యక్షుడిగా జో బైడెన్‌ కొలువుతీరాక మొదటిసారి ఆయనతో ముఖాముఖి చర్చలు జరిపిన మోదీ- భారత్‌, అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం ద్విగుణీకృతం కావాలని ఆకాంక్షించారు. ఆర్థిక, వాణిజ్య, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారంతో సమష్టిగా పురోగమిద్దామని బైడెన్‌ స్నేహహస్తం అందించారు. సీమాంతర ఉగ్రవాదంపై ఇండియా ఆందోళనలతో స్వరం కలిపిన అమెరికా- 2008 ముంబయి దాడుల సూత్రధారులు తగిన శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టంచేసింది. ఉగ్రవాదుల స్వర్గధామంగా అఫ్గాన్‌ అవతరించకూడదన్న దేశాధినేతల సంయుక్త ప్రకటన- మానవ హక్కుల పరిరక్షణపై చేసిన వాగ్దానాలను తాలిబన్లు నిలబెట్టుకోవాలని పిలుపిచ్చింది. యూఎస్‌-ఇండియా గాంధీ-కింగ్‌ అభివృద్ధి ఫౌండేషన్‌ ద్వారా విద్య, ఆరోగ్య, పర్యావరణ రంగాల్లో ఒకరికొకరు సహకరించుకోవాలన్న ఆలోచనలనూ ఉభయ దేశాల నాయకత్వం పంచుకొంది. పునరుత్పాదక ఇంధన వనరులను అందిపుచ్చుకోవడంలో భారతదేశానికి తగిన తోడ్పాటును అందిస్తామన్న బైడెన్‌ హామీ- సహర్షంగా స్వాగతించదగినది. ముష్కర మూకలతో అంటకాగే దుర్విధానాలను తక్షణం విడనాడాలంటూ పాకిస్థాన్‌ను అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ హెచ్చరించడమూ కీలక పరిణామమే! అంతర్జాతీయంగా ఆందోళనకర పరిస్థితులు పెచ్చరిల్లుతున్న తరుణంలో ప్రజాస్వామ్య దేశాల మధ్య మైత్రీబంధాలు బలోపేతం కావాలన్న కమల అభిప్రాయం- అవశ్యం ఆచరణీయం. క్వాడ్‌ దేశాధినేతల తాజా ప్రత్యక్ష భేటీలో ప్రధాని మోదీ సైతం ఇదే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. తమ కూటమిని విశ్వశాంతికి చోదకశక్తిగా అభివర్ణించారు. ఆస్ట్రేలియా, బ్రిటన్‌లతో కలిసి అమెరికా కట్టిన ‘ఆకుస్‌’ కూటమితో క్వాడ్‌ భవితవ్యంపై ఇటీవల పలు ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. వాటికి దీటుగా సమాధానమిచ్చేలా- ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణకు తాము పునరంకితమవుతున్నట్లు క్వాడ్‌ నేతలు స్పష్టీకరించారు. స్వేచ్ఛాయుత సముద్ర వాణిజ్యానికి తూట్లు పొడుస్తున్న డ్రాగన్‌ దూకుడుకు పగ్గాలు పడాలంటే- క్వాడ్‌ పక్షాల నడుమ సుహృద్భావ సంబంధాలు పటిష్ఠం కావాల్సిందే!  

పేద, వర్ధమాన దేశాలకు కొవిడ్‌ టీకాలను సరఫరా చేస్తూ, వాటికి చేరువ అయ్యేందుకు చైనా కొన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది. మహమ్మారి విలయ తాండవాన్ని తన ప్రాబల్య విస్తరణకు అవకాశంగా మలచుకొంటున్న డ్రాగన్‌ను నిలువరించే ప్రణాళికలను క్వాడ్‌ ఆరు నెలల క్రితమే సిద్ధం చేసింది. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలోని దేశాలతో పాటు తక్కిన వాటికీ 120 కోట్ల డోసుల మేరకు టీకాలను అందించాలని తీర్మానించింది. అందులో ఇప్పటివరకు 7.90 కోట్ల డోసులను సమకూర్చినట్లు పేర్కొన్న క్వాడ్‌ దేశాలు- వచ్చే సంవత్సరాంతానికి కనీసం వంద కోట్ల డోసుల వితరణ యజ్ఞాన్ని పూర్తిచేస్తామంటున్నాయి. వాతావరణ మార్పులను నియంత్రించడంలో ప్యారిస్‌ ఒప్పందానికి కట్టుబాటు చాటుతూనే- విద్య, సాంకేతిక రంగాల్లో యథాశక్తి సహకరించుకొంటామనీ అవి ప్రతినబూనాయి. ‘ఆసియా నాటో’గా ఆది నుంచీ క్వాడ్‌ను తృణీకరిస్తున్న చైనా- తాజా సమావేశంపైనా కళ్లల్లో నిప్పులు పోసుకొంది. అదో విఫల కూటమిగా మిగిలిపోనుందని శాపనార్థాలు పెట్టింది. మరోవైపు ఐరాస 76వ సర్వసభ్య సమావేశాల వేదికపై కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తిన టర్కీ అధ్యక్షుడు ఎర్దొగాన్‌ తన దుర్బుద్ధిని చాటుకొన్నారు. ధూర్తదేశాలు కొన్ని ఉగ్రవాదాన్ని రాజకీయ ఆయుధంగా ప్రయోగిస్తున్నాయని తూర్పారబట్టిన భారత ప్రధాని- అరాచకవాదులను అణచివేయడానికి ప్రపంచ దేశాలన్నీ కూడి రావాలని పిలుపిచ్చారు. అఫ్గానిస్థాన్‌ పరిణామాలను ఆసరాగా చేసుకొంటూ మధ్య, దక్షిణాసియాలపై పట్టు బిగించడానికి చైనా పన్నాగాలు పన్నుతోంది. వాటిని తిప్పికొడుతూనే హిందూ మహాసముద్రంలో డ్రాగన్‌పై ఇండియా పైచేయి సాధించాలి. సమున్నత ప్రజాతంత్ర దేశాల కూటమిగా భాసిస్తున్న క్వాడ్‌లో భారత్‌ బలీయ భాగస్వామ్యం అందుకు కచ్చితంగా అక్కరకొస్తుంది!


జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

+

© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.abc_digital_logo