
ఆంధ్రప్రదేశ్
ఈటీవీ, హైదరాబాద్: నానో టెక్నాలజీ రంగంలో కృషి చేస్తున్న ప్రొ.చెన్నుపాటి జగదీశ్ ఆస్ట్రేలియన్ సైన్స్ అకాడమీ తదుపరి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. కృష్ణా జిల్లా వల్లూరుపాలెంకు చెందిన ఆయన ఆస్ట్రేలియన్ జాతీయ విశ్వవిద్యాలయంలో గత మూడు దశాబ్దాలుగా ఆచార్యులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జాన్ షైన్ స్థానంలో 2022, మేలో నూతనంగా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు ఈ పదవిలో కొనసాగనున్నారు. అకాడమీ అధ్యక్షుడిగా జగదీశ్ ఆస్ట్రేలియాలో సైంటిఫిక్ ఎక్సలెన్స్‌కు పాటుపడటంతో పాటు ఆ దేశ పార్లమెంటుకు సలహాదారుగా వ్యవహరిస్తారు. అధ్యక్షుడి హోదాలో యువ పరిశోధకులు, ఔత్సాహిక శాస్త్రవేత్తలకు దిక్సూచిగా వ్యవహరిస్తారని, ఆస్ట్రేలియన్ సైన్స్‌కు గొంతుకగా నిలుస్తారని జాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత సంతతికి చెందిన ఓ శాస్త్రవేత్త ఈ అత్యున్నత పదవిని అలంకరించడం ఇదే ప్రథమం. నానో టెక్నాలజీ రంగంలో రెండున్నర దశాబ్దాల పాటు విశేష కృషి జరిపినందుకుగాను ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రొఫెసర్ జగదీశ్‌ను ఇప్పటికే ఆ దేశ అత్యున్నత పురస్కారమైన కాంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అవార్డుతో సత్కరించింది. ప్రొ.జగదీశ్ పరిశోధనలు 700కు పైగా అంతర్జాతీయ పబ్లికేషన్లలో ప్రచురితమయ్యాయి. ఆయన మార్గదర్శనంలో ఇప్పటివరకు 65 మంది పీహెచ్డీ విద్యార్థులు, 50 మంది పోస్ట్ డాక్టోరల్ విద్యార్థులు పట్టా పొందారు.