
క్రీడలు
కాన్పూర్: వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న ఆజింక్య రహానె, చెతేశ్వర్ పుజారాలను భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్ వెనకేసుకొచ్చాడు. వాళ్లు త్వరలోనే ఫామ్‌లోకి వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ‘‘చెతేశ్వర్ పుజారా, ఆజింక్య రహానె ప్రస్తుతం ఫామ్‌లో లేరు. కానీ పుజారా 91, రహానె 79 టెస్టులు ఆడిన సంగతి మరిచిపోకూడదు. ఏమి రాణించకుండానే ఎవరూ ఇన్ని మ్యాచ్‌లు ఆడలేరు. ప్రస్తుతం సత్తా చాటకపోయినా గతంలో వీళ్లిద్దరూ ఎన్నో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడారు. త్వరలోనే పుజారా, రహానె ఫామ్‌లోకి వస్తారని భావిస్తున్నాం. ఒక సీనియర్ ఆటగాడు విఫలమైతే వారికి అవకాశాలు ఇవ్వడం సహజం. తిరిగి ఫామ్‌లోకి రావడానికి ఇన్ని టెస్టులే ఆడాలనే లెక్క ఉండదు’’ అని రాఠోడ్ అన్నాడు. ముంబయిలో జరిగే రెండో టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి వచ్చిన తర్వాత పరిస్థితిని సమీక్షిస్తామని విక్రమ్ తెలిపాడు. వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా ఎప్పుడూ జట్టు ఆటగాడని కానీ రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి వస్తే అతడు రెండో కీపర్ పాత్రకి పరిమితమవుతాడని రాఠోడ్ అన్నాడు. ‘‘సాహా జట్టు ఆటగాడు. జట్టుకు ఏం కావాలో అతడు అది చేసి పెడతాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భారత రెండో ఇన్నింగ్స్‌లో అతడు కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే రెగ్యులర్ కీపర్ రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి వస్తే సాహా రెండో కీపర్ స్థానానికి పరిమితం కావాల్సి ఉంటుంది’’ అని విక్రమ్ తెలిపాడు.