
తెలంగాణ
విద్యుత్తు బిల్లును ఉపసంహరించుకోవాలి
అఖిలపక్ష భేటీలో తెరాస లోక్‌సభా పక్ష నేత నామా
అఖిలపక్ష సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న నామా నాగేశ్వరరావు. పక్కన బండా ప్రకాశ్
ఈనాడు, దిల్లీ: తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోళ్లపై సభలో స్పష్టతనివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఆదివారమిక్కడ ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘‘తెలంగాణలో రైతులు పండించిన పంటనంతా కొనాలని డిమాండ్ చేశాం. పంట కొనుగోళ్లపై సీఎం కేసీఆర్, మేము నాలుగైదు సార్లు కలిసిన విషయాన్ని సమావేశంలో ఉన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దృష్టికి తీసుకువెళ్లాం. యాసంగిలో వరి కొనేది లేదంటున్న ఈ నేపథ్యంలో వానాకాలం పంటపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరాం. ఈ అంశంపై సభలో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశాం. సాగు చట్టాల రద్దుతోపాటు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)పై చర్చించి చట్టబద్ధత కల్పించాలని కోరాం. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలకు సీఎం కేసీఆర్ రూ.3 లక్షల చొప్పున ప్రకటించినందున కేంద్రం పెద్ద మొత్తంలో పరిహారం ఇవ్వాలని అడిగాం. రైతులపై కేసులు ఉపసంహరించుకోవాలని కోరాం. రైతులపై కేసుల ఉపసంహరణ, పరిహారం విషయంలో తెరాస డిమాండ్‌కు మిగతా పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టాలనుకుంటున్న విద్యుత్తు చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరాం. కృష్ణా జలాల పంపిణీపై ట్రైబ్యునల్ ఏర్పాటు, పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అఖిలపక్ష భేటీలో లేవనెత్తాం. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల రిజర్వేషన్లపై శాసనసభ తీర్మానాలను ఆమోదించాలని కోరాం. బీసీ జన గణన, రాష్ట్రానికి రావల్సిన జీఎస్టీ, ఇతర బకాయిలు చెల్లింపు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల తగ్గింపు, మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టడం వంటి అంశాలను ప్రస్తావించాం. తెలంగాణ సమస్యలపై పార్లమెంటు లోపలా, బయటా పోరాడతాం’’ అని నామా నాగేశ్వరరావు తెలిపారు. నామా వెంట రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ ఉన్నారు.