Latest Telugu News | Breaking News Telugu | Telugu News Today | News in Telugu

సంపాదకీయం

Facebook Share Twitter Share Comments Telegram Share
పోషణతోనే బలవర్ధక భారత్‌

సమస్యలకు మూలం... పౌష్టికలోపం

‘రక్తహీన రహిత భారత్‌’ కార్యక్రమం ఆశించిన మేర ఫలితాలనివ్వడంలో విఫలమవుతోందని అయిదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫలితాలను సమీక్షించిన తరవాత- కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల అభిప్రాయపడింది. పునఃపరిశీలన చేసి లోపాలను సవరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించింది. దేశంలో రక్తహీనత, పోషకాహార లోపాల తీవ్రతకు ఈ పరిస్థితి అద్దం పడుతోంది. దేశంలోని అన్ని వయో సమూహాలనూ రక్తహీనత సమస్య పట్టి పీడిస్తోందని ఈ అధ్యయన నివేదిక స్పష్టం చేసింది. నిరుడు జరిపిన సర్వే ఫలితాలతో పోల్చిచూస్తే ఆరు నెలల నుంచి అయిదేళ్ల లోపు చిన్నారుల్లో రక్తహీనత 58శాతం నుంచి 67శాతానికి ఎగబాకింది. 15-50 మధ్య వయసున్న మహిళల్లో అది 53శాతం నుంచి 57శాతానికి పెరిగిందని నివేదిక వెల్లడించింది.

బాధితులందరికీ లబ్ధి చేకూరితేనే...

శరీరంలో ఎర్ర రక్తకణాలు లేదా హీమోగ్లోబిన్‌ స్థాయులు సాధారణ స్థితి కన్నా తక్కువగా ఉండటాన్ని రక్తహీనత(ఎనీమియా)గా పరిగణిస్తారు. ఇది శారీరక బలహీనత, జ్ఞాపకశక్తి కొరవడటం, అలసట, ఆయాసంతో పాటు ఛాతీ నొప్పికి దారి తీసి, కొన్ని సందర్భాల్లో గుండెకు చేటు చేస్తుంది. సమస్య అధికమైనప్పుడు ప్రసవ సమయంలో గర్భిణుల్లో మరణాలూ సంభవించవచ్చు. సికిల్‌సెల్‌ ఎనీమియా, థలస్సీమియా వంటి జన్యుపరమైన లోపాల వల్లనే కాకుండా- దీర్ఘకాలిక మలేరియా వంటి సాంక్రామిక వ్యాధులు సైతం రక్తహీనతకు దారితీస్తాయి. మన దేశంలో ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, బీ12 విటమిన్‌ లోపాలు రక్తహీనతను పెంపొందించే ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు. అధిక రుతుస్రావం, తరచూ గర్భం దాల్చడం లేదా చిన్న వయసులోనే పిల్లల్ని కనడం, వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం మహిళల్లో రక్తహీనతకు దారి తీసే ముఖ్య కారణాలు. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్రం పలు కార్యక్రమాలను రూపొందించింది. 1970వ దశకంలో జాతీయ రక్తహీనత నివారణ, ‘నేషనల్‌ ఐరన్‌ ప్లస్‌’లతో పాటు పలు కార్యక్రమాలను ప్రవేశపెట్టి గర్భిణులు, అయిదేళ్ల లోపు చిన్నారులకు ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ గోలీలను అందజేసింది. గర్భిణుల మరణాలను గణనీయంగా తగ్గించగలిగింది. యుక్తవయస్కుల్లో ఈ సమస్యను అధిగమించేందుకు మాత్రల పంపిణీని చేపట్టింది. రక్తహీనతను పెంపొందించే కడుపులోని పరాన్నజీవులను నియంత్రించేందుకు ‘నేషనల్‌ డీవర్మింగ్‌’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు స్వచ్ఛ భారత్‌ అభియాన్‌తో సహా పలురకాల కార్యక్రమాలు చేపట్టారు. అయినా భారత్‌లో  50 శాతానికి పైగా చిన్నారులు, మహిళలు రక్తహీనతతో బాధ పడుతున్నారని ఎన్నో అధ్యయనాలు ఘోషించడం ఆందోళన కలిగించే అంశం.

పేదరికం, పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించకుండా ఎన్ని చర్యలు చేపట్టినా అవి ఆశించిన స్థాయిలో ఫలవంతం కావనడానికి- దశాబ్దాలుగా అంతంతమాత్రం ఫలితాలనే ఇస్తున్న కార్యక్రమాలే నిదర్శనాలు. పథకాలను సమగ్రంగా అమలు చేసి సంపూర్ణ పోషణ అందించడం ఎంతో కీలకం. దారిద్య్ర రేఖను ప్రామాణికంగా చేసుకొని రూపొందించే కార్యక్రమాలు రక్తహీనత సమస్యను మరింత జటిలం చేస్తున్నాయన్నది ఒక వాదన. పెరుగుతున్న నిత్యావసరాల ధరల దృష్ట్యా పేదలతో పాటు, దిగువ మధ్య తరగతి ప్రజలు సైతం సంపూర్ణ పోషణ అందించే ఆహారానికి దూరమవుతున్నారు. కాబట్టి, పోషకాహారం అందరికీ చేరువయ్యేలా కార్యక్రమాలను రూపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఐసీడీఎస్‌ కార్యక్రమం కింద గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు పోషకాహారం అందించేందుకు 2017లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘అన్న అమృతహస్తం’ పథకం రూపొందించింది. శిశువులకు బాలామృతం వంటి పలు రకాల పోషకాహార పథకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది.  

ముందున్న సవాళ్లు

తెలుగు రాష్ట్రాలు మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగిస్తున్నప్పటికీ ఆహారంలో నాణ్యత ఇంకా పెరగాల్సి ఉంది. రక్తహీనతకు అధికంగా గురయ్యే పర్వత, అటవీ ప్రాంతాల విద్యార్థులకు సమస్యను ఎదుర్కొనేందుకు అవసరమైన ఆహార పదార్థాలను అందించాలి. నిరుపేదలకు సామూహిక భోజనశాలలను ప్రారంభించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఎంతైనా ఉంది. దీనివల్ల నామమాత్రపు ధరకే పోషకాహారం అందుబాటులోకి వస్తుంది. ఆహార పదార్థాల్లో పోషకాలు కలిపే (ఫోర్టిఫైడ్‌) విధానాలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. దానివల్ల రక్తహీనత సమస్యకు శాస్త్రీయ పరిష్కారం లభిస్తుంది. ఈ విధానం ద్వారా ఉప్పులో అయోడిన్‌ లోపాలను భర్తీ చేసేందుకు ఇప్పటికే పలు రాష్ట్రాలు నడుం బిగించాయి. ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో బియ్యం, గోధుమలు, నూనెల ఫోర్టిఫికేషన్‌కూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. గర్భం దాల్చిన స్త్రీలలో, మూడేళ్ల వయసు వరకు పిల్లల్లో తిన్న ఆహారాన్ని శోషించుకోవడానికి పేగుల్లో కొన్ని జాతుల సూక్ష్మజీవుల పాత్ర కీలకంగా ఉంటుంది. గర్భిణులకు, శిశువులకు ప్రోబయోటిక్స్‌ రూపంలో ఆయా సూక్ష్మజీవులను అందిస్తే శోషణ మెరుగుపడుతుంది. వైద్య విశ్వవిద్యాలయాల్లో ఈ దిశగా పరిశోధనలు ఊపందుకోవాలి. రక్తహీనతపై పోరుకు బడ్జెట్లో ప్రత్యేక నిధులను కేటాయించడం, దీర్ఘకాలిక వ్యూహాలను రూపొందించుకోవడం అవసరం. పథకాల అమలులో శాస్త్రీయతను మేళవించి ముందుకు సాగినప్పుడే దేశాన్ని నిస్సత్తువకు గురి చేస్తున్న రక్తహీనత సమస్యను అధిగమించి బలవర్ధక భారతాన్ని నిర్మించగల వీలుంది!

- డాక్టర్‌ మహిష్మ.కె (వైద్యరంగ నిపుణులు)


+

© 1999- 2022 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.