
ఆంధ్రప్రదేశ్
కన్నీటి పర్యంతమైన అధికారిణి
అయినవిల్లి, న్యూస్టుడే: తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలంలో మహిళా అధికారిని వైకాపా నాయకుడు దూషించారు. తాము చెప్పిందే చేయాలంటూ బెదిరించారు. ఈ ఘటనతో ఎంపీడీవో కె.ఆర్.విజయ కన్నీటిపర్యంతమయ్యారు. నియోజకవర్గంలోని వైకాపా నేతల మధ్య గ్రూపుల కారణంగా, తమ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావించి... నల్లచెరువు మాజీ సర్పంచి వాసంశెట్టి తాతాజీ సోమవారం ఎంపీడీవో కార్యాలయానికి వచ్చారు. ‘మేం చెప్పిన మాట వినడం లేదు, మా మాట వినకపోతే చీరేస్తాం’ అంటూ ఎంపీడీవోపై విరుచుకుపడ్డారు. కార్యాలయ సూపరింటెండెంట్ దీక్షితులు వారిస్తున్నా తీవ్ర పదజాలంతో దూషించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దర్యాప్తు జరిపి నలుగురు వాలంటీర్లను తొలగించినందుకు జడ్పీటీసీ సభ్యుడు జి.శ్రీనివాసరావు సైతం తనను దూషించారని, తాజాగా వైకాపా నేత కార్యాలయానికి వచ్చి బెదిరించారని ఎంపీడీవో విజయ అమలాపురం ఆర్డీవోకి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జడ్పీటీసీ సభ్యుడు జి.శ్రీనివాసరావు, మాజీ సర్పంచులు తాతాజీ, కె.రామకృష్ణ, మరో వైకాపా నాయకుడు మేడిశెట్టి శ్రీనివాసరావులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అమలాపురం డీఎస్పీ సోమవారం రాత్రి తెలిపారు.