
ఆంధ్రప్రదేశ్
గుంటూరు బోధనాసుపత్రిలో ఆందోళన
ఈనాడు, అమరావతి: గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలోని జనరల్ సర్జరీ విభాగంలో జూనియర్ వైద్యుడిపై రోగి సంబంధీకులు దాడి చేసిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. దాడి విషయంపై బాధిత వైద్యుడు, జూనియర్ డాక్టర్ల సంఘం నాయకులు ఆ రోజు రాత్రే ఆసుపత్రి ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. సోమవారం సూపరింటెండెంట్ ఆచార్య ప్రభావతికి ఫిర్యాదు చేశారు. మంగళవారం ఆసుపత్రి పరిపాలన బ్లాక్ వద్ద జూనియర్ వైద్యులు ఆందోళనకు దిగారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని, వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండు చేశారు. అప్పటిదాకా విధులకు హాజరుకాబోమన్నారు. గంటన్నర పాటు అక్కడే కూర్చోవడంతో వైద్య సేవల కోసం ప్రతి విభాగంలో టీచింగ్ ఫ్యాకల్టీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సంయుక్త పాలనాధికారి బి.రాజకుమారి చెప్పినా జూనియర్ వైద్యులు మెత్తబడలేదు.
అసలేం జరిగిందంటే...
గుంటూరులో ఆదివారం అర్ధరాత్రి కొందరు యువకులు ఘర్షణ పడగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తీసుకురాగా గాయానికి కుట్లు వేయాల్సి రావడంతో శస్త్ర చికిత్స గదికి తరలించారు. అక్కడ విధుల్లో ఉన్న పీజీ వైద్యులు పేషెంట్తోపాటు ఒకరు మాత్రమే ఉండాలని మిగిలిన వారు బయటకు వెళ్లిపోవాలని చెప్పారు. దీంతో కోపోద్రిక్తులైన కొందరు సంబంధీకులు ఒక పీజీ వైద్యుడిపై చేయి చేసుకున్నారు. సూపరింటెండెంట్ ప్రభావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులు షౌకత్, సాదిక్లను అరెస్టు చేసినట్లు కొత్తపేట సీఐ శ్రీనివాసులురెడ్డి తెలిపారు.