
సినిమా
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ నటి సాయిపల్లవి డ్యాన్స్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆమె డ్యాన్స్ చేసే ప్రతీ పాటలోనూ.. తనదైన శైలిలో స్టెప్స్ వేస్తూ అందరి చూపును తనవైపు తిప్పుకొంటుంది. క్రిస్మస్ కానుకగా వచ్చిన ‘శ్యామ్ సింగరాయ్’లో దేవదాసి పాత్రలో కనిపించారామె. గత శుక్రవారం నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేస్తోంది. ఇందులోని ‘ప్రణవాలయ’ పాటలోని క్లాసికల్ డ్యాన్స్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తాజాగా ఈ పాటకు సంబంధించిన రెండు ప్రాక్టీస్ సెషన్స్ వీడియోలను సాయిపల్లవి అభిమానులతో పంచుకుంది. ‘‘ ‘ప్రణవాలయ’ డ్యాన్స్ చేస్తున్నప్పుడు నా ఎమోషన్స్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు, ఈ పాట ద్వారా అద్భుతమైన డ్యాన్సర్స్‌తో కలిసి ప్రదర్శన ఇచ్చే అవకాశం వచ్చింది’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
‘ప్రణావాలయ’ గురించి మరింత వివరిస్తూ.. ‘‘ఈ పాటలో ఎంత కావాలో అంతే డ్యాన్స్ ఉంటుంది. నిజానికి నాకు క్లాసికల్ డ్యాన్స్ రాదు. ఇప్పటి వరకూ నేర్చుకోలేదు కూడా. కానీ, దర్శకుడు రాహుల్ నేను చేయగలనని నమ్మారు. ఇందులోని డ్యాన్స్ గ్రూప్‌లో ఉన్నవాళ్లంతా 10-20 ఏళ్ల నుంచి క్లాసికల్ డ్యాన్స్ చేస్తున్నవారే. అందుకే వాళ్లతో కలిసి డ్యాన్స్ చేస్తుంటే చాలా భయం వేసింది. మీరు ఆ సాంగ్‌ను గమనిస్తే.. అందరూ ఒకేలా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇదే నా విజయంలా భావిస్తా’’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.