Polavaram: 2019 మే నుంచి పోలవరానికి రూ.6,280 కోట్లు చెల్లించాం

కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి

ఈనాడు, దిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 2019 మే నుంచి ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి రూ.6,280.98 కోట్లు తిరిగి చెల్లించినట్లు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ టుడూ తెలిపారు. ఆయన సోమవారం రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఉదంతమేదీ ప్రస్తుతానికి తమ పరిశీలనలో లేదని చెప్పారు. ‘కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోంది. స్పిల్‌వే, అప్‌స్ట్రీమ్‌ కాఫర్‌ డ్యాం, కాంక్రీట్‌ డ్యామ్‌ (గ్యాప్‌-3), ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యాం డయాఫ్రం వాల్‌ (గ్యాప్‌-1) నిర్మాణం పూర్తయ్యాయి. 2022 జూన్‌ నాటికి హెడ్‌వర్క్స్‌ 77%, ఎడమ ప్రధాన కాలువ పనులు 72%, కుడి ప్రధాన కాలువ పనులు 93% పూర్తయ్యాయి. ప్రాజెక్టు మొదలుపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు రూ.20,066.92 కోట్లు ఖర్చుపెట్టినట్లు ఏపీ ప్రభుత్వం చెప్పింది. అయితే నిబంధనల ప్రకారం 2014 ఏప్రిల్‌ 1 నుంచి ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చుపెట్టే మిగిలిన మొత్తాన్నే కేంద్రం పూర్తిగా చెల్లిస్తోంది’ అని మంత్రి వివరించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని