
సంక్షిప్త వార్తలు(8)
కందిపప్పుపై కిలోకు రూ.48 రాయితీ భరిస్తున్నాం
పౌరసరఫరాలశాఖ కమిషనర్ అరుణ్‌కుమార్
ఈనాడు, అమరావతి: మార్కెట్లో కందిపప్పు కిలో రూ.115 ఉండగా.. ప్రభుత్వం రూ.48 చొప్పున రాయితీ భరిస్తూ రూ.67కి కార్డుదారులకు పంపిణీ చేస్తోందని పౌర సరఫరాలశాఖ కమిషనర్ హెచ్ అరుణ్‌కుమార్ తెలిపారు. ‘నిత్యావసరాల్లో కోత’ శీర్షికన ఆదివారం ‘ఈనాడు’ ప్రధాన పత్రికలో వచ్చిన కథనంపై ఆయన వివరణ ఇచ్చారు. ‘2014-19 మధ్య కాలంలో 93వేల టన్నుల కందిపప్పు, 3.16 లక్షల టన్నుల పంచదార పంపిణీ చేయగా 2019-20 నుంచి ఈ ఏడాది సెప్టెంబరు వరకు 2.76 లక్షల టన్నుల కందిపప్పు, 2.14 లక్షల టన్నుల పంచదారను కార్డుదారులకు అందించాం. ప్రజాపంపిణీ, పీఎంజీకేఏవై పథకాల కింద 2020 ఏప్రిల్ నుంచి నవంబరు వరకు రూ.1,795 కోట్ల విలువైన పప్పుధాన్యాలను కార్డుదారులకు పంపిణీ చేశాం. గత మూడేళ్లలో కందిపప్పు, పంచదారపై రూ.1,891 కోట్లను రాయితీ నిమిత్తం ఖర్చు చేశాం. ‘ఇంటింటికి రేషన్’ పంపిణీకి నెలకు రూ.25 కోట్లు, సాధారణ బియ్యాన్ని సార్టెక్స్‌గా మెరుగుపరిచేందుకు కిలోకు రూ.1 చొప్పున నెలకు రూ.20 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. 2019 నాటికి రాష్ట్రంలో సగటున 1.39 కోట్ల రేషన్ కార్డులు ఉండగా ప్రస్తుతం 1.45 కోట్ల కార్డులున్నాయి’ అని వివరించారు. గతంలో రేషన్ పంపిణీ 87% నుంచి 89% ఉండగా.. ఇంటింటికి పంపిణీ ద్వారా 92% అయిందని పేర్కొన్నారు. వాహనం వచ్చిన సమయంలో రేషన్ తీసుకోలేకపోతే.. తర్వాత వారికి వీలైన సమయంలో దగ్గరలోని ఏ ఇతర వాహనంలో అయినా తీసుకోవచ్చని, సాయంత్రం సమయాల్లో గ్రామ సచివాలయం వద్ద నిలిపి ఉంచే వాహనాల దగ్గరైనా రేషన్ ఇస్తారని తెలిపారు.
‘కృష్ణపట్నం’ మూడో యూనిట్లో నెలాఖరుకు విద్యుదుత్పత్తి: మంత్రి పెద్దిరెడ్డి
ఈనాడు, అమరావతి: నెల్లూరులోని కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రంలో నిర్మాణం పూర్తయిన మూడో యూనిట్(800 మెగావాట్ల ప్లాంటు)లో నెలాఖరులోగా ఉత్పత్తి ప్రారంభిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. అలాగే విజయవాడ వీటీపీఎస్‌లో నిర్మాణంలో ఉన్న 800 మెగావాట్ల సామర్థ్యమున్న మరో ప్లాంటును 2023 మార్చి నాటికి ప్రారంభించేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంధన శాఖ అధికారులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
పప్పు లేదు.. పంచదారా లేదు: ఐద్వా ధ్వజం
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల ద్వారా పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి డిమాండ్ చేశారు. రెండు, మూడు నెలలుగా పంచదార, కందిపప్పు సరిగా ఇవ్వడం లేదని.. ఇది పౌరసరఫరాల శాఖ బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. వీటి పంపిణీని పునరుద్ధరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాల్లో, గ్రామ సచివాలయాల్లో వినతిపత్రం అందజేసి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఐద్వా కమిటీలకు ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. ‘‘రేషన్ దుకాణాల్లో కందిపప్పు, పంచదార ఇవ్వడం లేదు. కొన్నిచోట్ల ఇస్తున్నా నాణ్యత లేని కందిపప్పు ఇస్తున్నారని మహిళలు వాపోతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని సరఫరాను పునరుద్ధరించాలి’’ అనిరమాదేవి కోరారు.
సొంత నిధులతో రోడ్డు నిర్మాణం
కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: జనం అవస్థలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 8వ వార్డు తెదేపా కౌన్సిలర్ నూర్జహాన్ సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. స్థానిక గుడ్లప్పదొడ్డిలో రహదారి అధ్వానంగా ఉంది. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కౌన్సిలర్ నూర్జహాన్ రూ.1.50 లక్షలతో సిమెంటు రోడ్డు, మురుగు కాలువ నిర్మించారు.
ప్రభుత్వంపై అసత్య ప్రచారం మానండి
మంత్రి ఆదిమూలపు సురేష్
విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: ప్రభుత్వం తమకు ఏమీ చేయలేదని అమరావతి రాజధాని రైతులు అసత్య ప్రచారం చేయడం తగదని రాష్ట్ర పురపాలక మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. విజయవాడ ఏ కన్వెన్షన్‌లో క్రెడాయ్ ప్రాపర్టీ షోను ఆదివారం ఆయన సందర్శించారు. రైతులకు ఏటా కౌలు చెల్లిస్తున్నామని మంత్రి వివరించారు. అమరావతిలో 60 వేల ప్లాట్లు ఉంటే ఇప్పటికే 40 వేలు రిజిస్ట్రేషన్ చేశామని తెలిపారు. గత ప్రభుత్వం అక్కడ బాహుబలి గ్రాఫిక్స్ చూపిందని, పనులు తక్కువేనని చెప్పారు. కృష్ణా, గుంటూరు జిల్లాలు మాత్రమే అభివృద్ధి చెందితే సరిపోవని, రాష్ట్రమంతా ప్రగతి అవసరమని, అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నామని వివరించారు.
రూ.2 వేల కోట్ల దసపల్లా భూములు లాగించేసి ఉత్తరాంధ్రలో వికేంద్రీకరణ అమల్లోకి తీసుకొచ్చారు
పోతుల బాలకోటయ్య విమర్శ
ఈనాడు, అమరావతి: ‘‘కంగ్రాట్స్ సార్! రూ.2 వేల కోట్ల విలువైన దసపల్లా భూములు లాగించేసి రాజధాని రాకముందే ఉత్తరాంధ్రలో ‘వికేంద్రీకరణ’ అమల్లోకి తీసుకొచ్చారు’’ అని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య విమర్శించారు. ఇక రాజధాని కూడా వస్తే బంగారంతో బాత్రూమ్లు, మరుగుదొడ్లు కట్టుకోవచ్చంటూ ట్వీట్ చేశారు. ‘‘దసపల్లా భూములపై విజయసాయి వల’’ శీర్షికతో ‘ఈనాడు’లో ఆదివారం ప్రచురితమైన కథనాన్ని ఆయన తన ట్వీట్‌కు జతపరిచారు. ‘‘ఉత్తరాంధ్ర మేధావులారా! మీరు, విశాఖ ప్రజలు నా వైపు తల తిప్పకుండా అమరావతిపై రాళ్లేయించండి’’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
‘సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు’
ఈనాడు, అమరావతి: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించే జూనియర్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శేషగిరిబాబు హెచ్చరించారు. ఈ నెల 2 నుంచి 9వ తేదీ వరకు అన్ని యాజమాన్యాల పరిధిలోని కళాశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఇప్పటికే సమాచారం అందించామని ఆయన వివరించారు. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కళాశాలల గుర్తింపు రద్దు చేయడంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ దేవాంగ సంఘం రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక
ఈనాడు డిజిటల్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ దేవాంగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా దేవాంగ కర్ణ నాగరాజు(అనంతపురం), ప్రధాన కార్యదర్శిగా పుచ్చల రామకృష్ణ(రాజమహేంద్రవరం), కోశాధికారిగా ఉప్పు కనకరాజు(విశాఖపట్నం)ను ఎన్నుకున్నట్లు సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని సంఘ కార్యాలయంలో ఆదివారం ఈ ఎన్నిక జరిగినట్లు పేర్కొన్నారు. ఈ నెల 9న ప్రొద్దుటూరులో సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 12 లక్షల మంది దేవాంగులున్నా...ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని.. ఐక్య పోరాటం ద్వారా మాత్రమే హక్కులు సాధించుకోగలమని అభిప్రాయపడ్డారు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Sports Budget: క్రీడల బడ్జెట్.. పెరిగింది కాస్తే కానీ.. ఇదే అత్యధికం!
-
Politics News
Harish rao: బడ్జెట్ 2023.. అందమైన మాటలు తప్ప కేటాయింపుల్లేని డొల్ల బడ్జెట్: హరీశ్‌రావు
-
General News
Taraka Ratna: తారకరత్న మెదడుకు సంబంధించిన చికిత్స జరుగుతోంది: విజయసాయిరెడ్డి
-
India News
Budget 2023: సరిహద్దులకు మరింత ‘రక్షణ’.. అగ్నివీరులకు ‘పన్ను’ ఊరట
-
General News
Top 10 Budget Stories: కేంద్ర బడ్జెట్ - 2023 ప్రత్యేక కథనాలు!
-
Sports News
IND vs NZ: అతి పెద్ద స్టేడియంలో.. అత్యంత కీలక పోరుకు వేళాయె..!