ఆ సీఐ ప్రవర్తన జుగుప్సాకరం

మహిళా కమిషన్‌ సభ్యురాలు గజ్జల లక్ష్మి

ఈనాడు, తిరుపతి: శ్రీకాళహస్తిలో ఒక హోటల్‌ నిర్వహిస్తున్న మహిళ పట్ల స్థానిక సీఐ అంజుయాదవ్‌ ప్రవర్తించిన తీరు సభ్య సమాజం సిగ్గు పడేలా ఉందని రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు గజ్జల లక్ష్మి పేర్కొన్నారు. సాటి మహిళ పట్ల కనీస మర్యాద అయినా లేకుండా.. అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించిందన్నారు. బాధితురాలి చీర లాగేసి, జంతువును తోసేసినట్లు జీపులోకి తోయడం దారుణమని అన్నారు. ఓ మహిళ పట్ల మహిళా పోలీస్‌ అధికారే ఇంత అరాచకంగా ప్రవర్తిస్తుంటే నిజంగా పోలీస్‌ వ్యవస్థ సిగ్గుపడాలని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరపాలని మహిళా కమిషన్‌ తరఫున జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డిని కోరినట్లు తెలిపారు. ఈ మేరకు గజ్జల లక్ష్మి సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. గతంలో ఒక మహిళ న్యాయం చేయాలని కోరితే ఆమెనూ ఇలాగే బూటు కాలితో తన్నిన చరిత్ర ఆ సీఐకి ఉందని తెలిపారు. దానిపైనా ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. ఆవిడ తీరు మార్చుకోకపోగా బాధితురాలి చీర లాగడం, చేయి చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. పేద మహిళలు, చిరు వ్యాపారులను ప్రభుత్వం లక్షాధికారుల్ని చేయాలన్న ఆశయంతో ఉంటే.. అలాంటివారిపైనే ఇలా ప్రతాపం చూపి.. రాష్ట్రానికే చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తిస్తున్న తీరు హేయమంటూ ఆమె పోస్టు చేసిన వీడియో వైరల్‌ అవుతోంది.

దురుసు సీఐపై విచారణ ప్రారంభం

ఓ హోటల్‌ నిర్వాహకురాలిపై శ్రీకాళహస్తి సీఐ అంజుయాదవ్‌ దురుసు ప్రవర్తన విషయమై తిరుపతి అర్బన్‌ ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. తిరుపతి అదనపు ఎస్పీ విమలకుమారి సోమవారం శ్రీకాళహస్తికి వచ్చి బాధితురాలైన ధనలక్ష్మి కుటుంబ సభ్యులను విచారించారు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు