సంక్షిప్తంగా

* అశోక్‌ లేలాండ్‌కు చెందిన స్విచ్‌ మొబిలిటీ దేశంలో 5,000 విద్యుత్‌ బస్సులను తీసుకురావడం కోసం రవాణా టెక్నాలజీ సంస్థ ఛలోతో జట్టు కట్టింది. ఈ భాగసామ్యం కింద ఈ రెండు కంపెనీలు కలిసి పెట్టుబడులు పెడతాయి.

* ఆగస్టు 20 నుంచి దేశీయ విమాన మార్గాల్లో అదనంగా 24 సర్వీసులను నడపనున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ముంబయి- హైదరాబాద్‌, చెన్నై; దిల్లీ- ముంబయి, బెంగళూరు, అహ్మదాబాద్‌, ముంబయి- బెంగళూరు, అహ్మదాబాద్‌- పుణె మార్గాల్లో ఈ కొత్త సర్వీసులు ఉంటాయని పేర్కొంది.

* నిర్మాణం, జల విభాగంలో రూ.1,524 కోట్ల విలువైన కొత్త ఆర్డర్లను దక్కించుకున్నట్లు జేఎంసీ ప్రాజెక్ట్స్‌ తెలిపింది.

* రాబోయే ఐదేళ్లలో రూ.4 లక్షల కోట్ల వ్యాపారాన్ని, రూ.4,000 కోట్ల వార్షిక లాభాన్ని నమోదు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు జమ్మూ అండ్‌ కశ్మీర్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ బల్‌దేవ్‌ ప్రకాశ్‌ తెలిపారు.

* డాబర్‌ వేదిక్‌ గ్రీన్‌ టీ డిటాక్స్‌ కాహ్వాను విడుదల చేసినట్లు డాబర్‌ ఇండియా తెలిపింది. ఈ గ్రీన్‌ టీలో ఆయుర్వేదిక మూలికలు, రాతి ఉప్పు ఉన్నాయని పేర్కొంది.

* వడ్డీ రేట్లు పెంచడం వల్ల సమీపకాలంలో గృహాల గిరాకీపై ప్రభావం పడేందుకు దారి తీసే అవకాశం ఉందని డీఎల్‌ఎఫ్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ సింగ్‌ తెలిపారు.

* భారత్‌లో క్యూ3 కొత్త వెర్షన్‌కు ఆన్‌లైన్‌ బుకింగ్‌లు ప్రారంభించినట్లు ఆడి తెలిపింది. ప్రీమియం ప్లస్‌, టెక్నాలజీ వేరియంట్లలో ఇది లభ్యం కానుంది. రూ.2 లక్షల ప్రారంభ మొత్తంతో ఈ కారును బుక్‌ చేసుకోవచ్చు.

* దిల్లీలోని అశోక్‌ విహార్‌లో కొత్త విలాసవంత గృహ సముదాయ ప్రాజెక్టును ప్రారంభించే యోచనలో ఉన్నామని గోద్రేజ్‌ ప్రోపర్టీస్‌ తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.8,000 కోట్ల మేర విక్రయాల ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉంటుందని పేర్కొంది.

* స్పెక్ట్రమ్‌ వేలం చెల్లింపులకు గడువు తేదీని ఆగస్టు 17కు పొడిగిస్తూ టెలికాం విభాగం(డాట్‌) నిర్ణయం తీసుకుంది. అంతక్రితం గడువు తేదీ ఆగస్టు 16గా పేర్కొన్న సంగతి తెలిసిందే.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని