SBI: అమృతోత్సవాల వేళ.. ఎస్‌బీఐ సరికొత్త ‘ఉత్సవ్‌’ పథకం

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ SBI) ఖాతాదారులకు పంద్రాగస్టు కానుకను ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఉత్సవ్‌ డిపాజిట్‌’ పేరుతో ప్రత్యేక డిపాజిట్‌ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. తక్కువ కాలవ్యవధితో అధిక వడ్డీరేటుతో ఉన్న స్కీం పరిమిత కాలం పాటే అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు ఎస్‌బీఐ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

‘ఉత్సవ్‌ డిపాజిట్’ పథకం కింద ఖాతాదారులు 1000 రోజుల కాల వ్యవధికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసుకోవచ్చు. వీటిపై బ్యాంకు 6.10శాతం వడ్డీ ఇస్తుంది. సీనియర్‌ సిటిజన్లకు సాధారణ వడ్డీతో పాటు మరో 0.50శాతం అధిక వడ్డీ లభించనుంది. సోమవారం ఆగస్టు 15 నుంచి ఈ పథకం అందుబాటులోకి రాగా.. కేవలం 75 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఎస్‌బీఐ తెలిపింది.

ఇటీవలే రూ.2కోట్ల లోపు ఉండే ఫిక్సడ్‌ డిపాజిట్లపై ఎస్‌బీఐ వడ్డీ రేటును 15 బేసిస్‌ పాయింట్లు పెంచింది. కొత్త వడ్డీరేట్లు ఆగస్టు 13 నుంచి అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం.. 180 నుంచి 210 రోజుల కాల వ్యవధితో ఉండే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేటును 4.40శాతం నుంచి 4.55శాతానికి పెంచింది. ఏడాది నుంచి రెండేళ్ల లోపు ఉండే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతాలపై వడ్డీరేటును 5.45శాతానికి, మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు ఉండే డిపాజిట్లపై వడ్డీని 5.60శాతానికి పెంచింది.


మరిన్ని

ap-districts
ts-districts