ట్విటర్‌లో మస్క్‌ కలకలం

సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్‌ను ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేసిన తరవాత అందులో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మస్క్‌ తీసుకుంటున్న నిర్ణయాలతో ట్విటర్‌ ఉనికిపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భారీగా ఉద్యోగాల కోత, రుణాల భారం, వదిలిపోతున్న వినియోగదారులు వంటివి ట్విటర్‌ విషయంలో భిన్న వాదనలకు తావిస్తున్నాయి.

టెస్లా, స్పేస్‌ఎక్స్‌-స్టార్‌ లింక్‌ కంపెనీల అధినేత ఎలాన్‌ మస్క్‌ 4400 కోట్ల డాలర్లకు ట్విటర్‌ను కొనుగోలు చేసేటప్పటికే ఆ టెక్‌ సంస్థ దివాలా అంచున ఊగిసలాడుతోంది. అప్పుల కొండ కింద కుంగిపోతున్న ట్విటర్‌ను మస్క్‌ ఎందుకు కొనుగోలు చేశారా అని చాలామంది విస్తుపోయారు. ట్విటర్‌ అంతరించిపోవచ్చని మస్క్‌ సైతం స్వయంగా సిబ్బంది సమావేశంలో వ్యాఖ్యానించారు. ట్విటర్‌ను స్వాధీనం చేసుకున్న వెంటనే మస్క్‌ అనేకమంది ఉన్నతాధికారులను సాగనంపారు. మూడింట రెండు వంతులకు పైగా ట్విటర్‌ ఉద్యోగులను ఇళ్లకు పంపారు. మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి లక్షల మంది వినియోగదారులు ఆ వేదికను వదిలివెళ్ళారు.

అరబ్‌ వసంతంలో నిరసనకారుల వాణికి వేదికనివ్వడం ద్వారా భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రతీకగా ట్విటర్‌ నిలిచింది. ఆ తరవాత డొనాల్డ్‌ ట్రంప్‌ ఖాతాను తొలగించడం ద్వారా మితవాదుల ఆగ్రహానికి గురైంది. వామపక్ష భావాలకు పెద్ద పీట వేస్తూ మితవాదుల భావ వ్యక్తీకరణను అణగదొక్కుతోందని ట్విటర్‌పై విమర్శలు వచ్చాయి. మస్క్‌ స్వాధీనం చేసుకున్న తరవాత ట్రంప్‌ ఖాతాను పునరుద్ధరించారు. తాను కైవసం చేసుకోవడం చూసి ట్విటర్‌ను మితవాదులు చేజిక్కించుకున్నారనడం సరికాదని, ఉదారవాదులే ఈ వేదికను స్వాధీనం చేసుకున్నట్లు గ్రహించాలని మస్క్‌ ప్రకటించారు. ట్విటర్‌ను డిజిటల్‌ రచ్చబండలా మార్చి అందరి అభిప్రాయాలను ప్రకటించే సౌలభ్యం కల్పిస్తానని వివరించారు.
ట్విటర్‌ను కొనుగోలు చేయడానికి తెచ్చిన రుణాలపైనే ఏడాదికి 100 కోట్ల డాలర్ల వడ్డీ చెల్లించాల్సి ఉన్న మస్క్‌- ఆ కంపెనీ ఆదాయాన్ని పెంచుకోక తప్పదు. ట్విటర్‌లో అత్యధిక ఫాలోయర్లను సంపాదించిన ప్రముఖులకు గతంలో ఉచితంగా బ్లూ టిక్‌ ఇచ్చేవారు. ఇకనుంచి నెలకు ఎనిమిది డాలర్లు చెల్లించి బ్లూటిక్‌ కొనుక్కోవచ్చని ప్రతిపాదించారు. ఇకపై ఎవరైనా ఆకతాయిలు బ్లూ టిక్‌ను కొనుక్కొని విద్వేష ప్రచారాన్ని, వదంతులను వ్యాపింపజేస్తే అడ్డుకొనేదెవరనే ప్రశ్న ఎదురవుతోంది. డిజిటల్‌ వాణిజ్య ప్రకటనలే ట్విటర్‌కు ప్రధాన ఆదాయ వనరు. ట్విటర్‌ మానవ హక్కుల పరిరక్షణ బృందాన్ని మస్క్‌ సాగనంపినందువల్ల ఆ వేదికకు వాణిజ్య ప్రకటనలు ఇవ్వవద్దని ఉద్యమకారులు కంపెనీలపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే అనేక ప్రముఖ కంపెనీలు అందుకు తలొగ్గాయి. ట్విటర్‌ను ఏకకాలంలో అనేక పనులు చేయగలిగే సూపర్‌ యాప్‌లా మార్చాలన్నది ఆయన ప్రధాన వ్యూహం. తద్వారా స్నాప్‌ చాట్‌ మాదిరిగా ఫొటోలు, వాట్సాప్‌లాగా సందేశాలు పంపవచ్చు. ఉబర్‌ తరహాలో రవాణా వాహనాన్ని రప్పించవచ్చు. పేపాల్‌, పేటీఎంల మాదిరిగా కొనుగోళ్లు జరపవచ్చు. అలాంటి సూపర్‌ యాప్‌ను రూపొందించడానికి ఉద్దండులైన సాంకేతిక నిపుణులు కావాలి. మస్క్‌ ఉద్వాసనల పర్వాన్ని, వారానికి 80 గంటలు పనిచేయాలనే నిబంధనను నిరసిస్తూ గతవారం 1200 మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ట్విటర్‌ నుంచి నిష్క్రమించారు. మిగిలిన సాంకేతిక సిబ్బందిలో ప్రతిభావంతులు తనను నేరుగా వచ్చి కలవవచ్చని మస్క్‌ ఆహ్వానించారు.

ట్విటర్‌ను మస్క్‌ కొనుగోలు చేయడం అమెరికా జాతీయ భద్రతకు ప్రమాదకరమనే వాదన సైతం మరోవైపు ముందుకొస్తోంది. మస్క్‌ కంపెనీ స్పేస్‌ఎక్స్‌ కక్ష్యలోకి ప్రయోగించిన స్టార్‌ లింక్‌ ఉపగ్రహాల ద్వారా ఉక్రెయిన్‌లో ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని కల్పించవద్దని చైనా సూచించినట్లు ఆయనే స్వయంగా ఒక ముఖాముఖిలో చెప్పారు. తైవాన్‌కు స్టార్‌ లింక్‌ సేవలను విక్రయించవద్దనీ చైనా కోరిందన్నారు. చైనాలోని షాంఘైలో ఏడాదికి 10 లక్షల టెస్లా ఎలెక్ట్రిక్‌ కార్లను తయారుచేయగల కర్మాగారాన్ని మస్క్‌ నెలకొల్పారు. అమెరికా తరవాత అత్యధికంగా టెస్లా కార్లు చైనాలోనే విక్రయమవుతాయి. ట్విటర్‌ను చైనాలో నిషేధించారు. అయినా, వీగర్‌ ముస్లిములపై చైనా అణచివేతను నిరసిస్తూ పోస్టులు పెట్టిన రెండు వేల పైచిలుకు ఖాతాలను గత డిసెంబరులో ట్విటర్‌ తొలగించింది. ట్విటర్‌లో మస్క్‌ తరవాత అత్యధిక పెట్టుబడులు పెట్టింది సౌదీ అరేబియావారే కావడమూ అమెరికా జాతీయ భద్రతను ప్రభావితం చేస్తుందని ఆరోపణలు వచ్చాయి. మొత్తానికి ట్విటర్‌ భవిష్యత్తుపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. పోనుపోను ఆ మైక్రోబ్లాగింగ్‌ వేదికను మస్క్‌ ఏ తీరాలకు చేరుస్తారన్నది వేచి చూడాల్సిందే.

- వరప్రసాద్‌


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని