ప్రభాకర నమోస్తుతే!

(నవంబర్‌ 30 మిత్ర సప్తమి)

ప్రాణకోటికి ప్రత్యక్ష దైవం, కర్మసాక్షి సూర్య భగవానుడు. సమస్త జీవరాశులకు ప్రాణాధారమైన వెలుగును ప్రసాదించే తేజస్వి. కాలచక్రాన్ని తిప్పే విరాట్‌ పురుషుడు. ఉదయం బ్రహ్మ, మధ్యాహ్నం మహేశ్వర, సాయంకాలం విష్ణురూపాలను ధరించే త్రిమూర్తి స్వరూపుడు. సూర్యుడు ఆరోగ్యప్రదాత. అందుకే అనాదిగా సూర్యోపాసన చేసే ఆచారం ఉంది. సూర్య నమస్కారాల్లోని ఆంతర్యమిదే! హనుమంతుడికి వేదాలు, సకల శాస్త్రాలు నేర్పిన వేదపారాయణుడు. ఆదిత్యహృదయం పారాయణ చేసిన శ్రీరాముడు మహాశక్తి సంపన్నుడై శత్రుసంహారం చేశాడు. మయూరుడు సూర్యశతకం రచించి కుష్ఠువ్యాధి నుంచి బయటపడ్డాడు. ఎండ తగిలితే చర్మవ్యాధులు తగ్గుతాయన్నది శాస్త్రం అంగీకరించిన సత్యం. శరీరానికి అవసరమైన ‘డి’ విటమిన్‌ సూర్యకిరణాలందిస్తాయి. త్రిలోక పూజ్యుడైన సూర్యభగవానుడు ఆదివారంనాడు జన్మించినందున ఆదివారాన్ని భానువారం, రవివారం అంటారు. స్వర్గాన్ని ఆక్రమించి ఇంద్రాది దేవతలను బాధిస్తున్న రాక్షసులను తన తీక్షణ కిరణాలతో నశింపచేశాడు. విశ్వకర్మ సూర్యుడి దేహాన్ని సానబట్టి ఆయన తీక్షణతను కొంత తగ్గించాడు. అలా రాలిన రజనుతో (పొడి) సుదర్శన చక్రం, త్రిశూలం, శక్తి ఆయుధం తయారుచేసి విష్ణుమూర్తికి, పరమశివుడికి, కుమారస్వామికి ఇచ్చాడు. సూర్యుడి భార్య సంజ్ఞాదేవి ఆ తీక్షణతను భరించలేక ఛాయను సూర్యుడికి అర్ధాంగిగా చేసి, అరణ్యాలకు వెళ్లిపోయింది. సంజ్ఞాదేవి, సూర్యభగవానుల సంతానమే యమధర్మరాజు, యమున, అశ్వనీ దేవతలు, వైవస్వతుడు. ప్రస్తుతం జరుగుతున్నది వైవస్వత మన్వంతరమే. ఛాయాదేవికేమో శని, సాపర్ణి, తపతి జన్మించారు.  ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుణ్ణి ప్రతి దినం ఆరాధిద్దాం. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్థిల్లుదాం.

- మామడూరు శంకర్‌


మరిన్ని