గుజరాత్‌లో రూ.2 వేల కోట్ల డ్రగ్స్‌ సీజ్‌

మెఫెడ్రోన్‌ యూనిట్‌ను ఛేదించిన ముంబయి దళం

ముంబయి: గుజరాత్‌లో రెండు వేర్వేరు దాడుల్లో రూ.2 వేల కోట్ల విలువచేసే డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. రాష్ట్రంలోని అంక్లేశ్వర్‌ పట్టణంలో గుట్టుగా సాగుతున్న ‘మెఫెడ్రోన్‌’ మత్తుమందు (మ్యావ్‌ మ్యావ్‌ డ్రగ్‌) తయారీ యూనిట్‌ను ముంబయి పోలీసులకు చెందిన మాదకద్రవ్య నిరోధక దళం (ఏఎన్‌సీ) ఛేదించింది. రూ.1,026 కోట్ల విలువ చేసే 513 కిలోల మేర డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ సింథటిక్‌ మందుపై నిషేధం ఉంది. రసాయనశాస్త్రంలో ఎమ్మెస్సీ చేసిన ఈ యూనిట్‌ యజమాని గిరిరాజ్‌ దీక్షిత్‌ను అరెస్టు చేశారు. ఇటీవలి కాలంలో ఇదే భారీ మత్తుమందుల స్వాధీనమని డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ దత్తా నలావడే మంగళవారం వెల్లడించారు. తమకు అందిన పక్కా సమాచారం మేరకు ఏఎన్‌సీ వర్లీ శాఖ ఈ దాడులు జరిపిందన్నారు. ఈ కేసులో ఓ మహిళ సహా ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. మరోవైపు.. వడోదరాలో గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) సుమారు రూ.1,000 కోట్ల విలువైన డ్రగ్స్‌ సీజ్‌ చేసింది. వడోదరా సమీపంలోని మోక్సీ గ్రామ పరిసరాల్లో ఉన్న నెక్టర్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో 200 కేజీల డ్రగ్స్‌ను అధికారులు గుర్తించారు. విచారణ కొనసాగుతోంది.

* ఆగస్టు 3వ తేదీన మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌ జిల్లా నాలాసోపారాలోనూ ఏఎన్‌సీ దళం రూ.1,400 కోట్ల విలువైన 700 కిలోల ‘మెఫెడ్రోన్‌’ స్వాధీనం చేసుకొంది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని