Mango man: అప్పుడు ఐశ్వర్య, సచిన్‌.. ఇప్పుడు సుస్మితా సేన్‌, అమిత్‌ షా..!

(పాత చిత్రం)

లఖ్‌నవూ: మాజీ మిస్‌ యూనివర్స్‌ సుస్మితా సేన్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. ఈ కాంబినేషన్ ఏంటని ఆలోచిస్తున్నారా..? ఈ విషయం తెలియాలంటే ‘మ్యాంగోమ్యాన్‌’ హాజీ కలీముల్లా ఖాన్‌ గురించి తెలియాలి. ఆయన కింగ్‌ ఆఫ్ ఫ్రూట్స్ మామిడిలో కొత్త వంగడాలు తీసుకువస్తూ.. మామిడి ప్రియులకు కొత్త రుచులు అందిస్తుంటారు. తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చిన హైబ్రిడ్ రకాలకు పెట్టుకున్నపేర్లే ఇవి. 

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 82 ఏళ్ల కలీముల్లా ఖాన్ తన మామిడి తోటలోనే హైబ్రిడ్‌ రకాలను సృష్టిస్తారు. ఆ వినూత్న రకాలకు సెలబ్రిటీల పేర్లుపెట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. తాజాగా మరో రెండు రకాలను అభివృద్ధి చేశారు. మిస్‌ యూనివర్స్‌గా గెలిచి, తన దాతృత్వ కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న సుస్మితా.. రూపురేఖలతో పాటు వ్యక్తిత్వపరంగా అందమైనవారని కరీముల్లా తెలుసుకున్నారు. అందుకే రుచులు పంచే తన మామిడికి సుస్మితా ఆమ్ అని పేరు పెట్టుకున్నారు.

‘గతంలో నేను అభివృద్ధి చేసిన హైబ్రిడ్ మామిడికి బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ పేరు మీద ఐశ్వర్య ఆమ్ అని పేరు పెట్టాను. ఆ తర్వాత నాకు సుస్మితా సేన్ గురించి తెలిసింది. ఆమె అందం, మంచి మనస్సు గురించి అందరు గుర్తుంచుకోవాలని నాకనిపించింది. అందుకే ఈసారి ఈ కొత్త రకాన్ని అభివృద్ధి చేసి.. ఆమె పేరు పెట్టాను. అలాగే మరోదానికి భాజపా అగ్రనేత, హోం మంత్రి అమిత్‌ షా పేరు పెట్టాను. ఈ పండు రుచికరమైనదే. కానీ ఆయన వ్యక్తిత్వానికి సరితూగాలంటే.. దీనిలో మరింత మార్పులు చేయాల్సి ఉంది’ అంటూ కలీముల్లా వెల్లడించారు.

కొన్ని దశాబ్దాలుగా ఈయన కొత్త వంగడాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటివరకూ 300కు పైగా కొత్త రకాలను మనముందుకు తీసుకువచ్చారు. వాటికి ములాయం ఆమ్, నమో ఆమ్, సచిన్ ఆమ్‌, కలాం ఆమ్‌, అమితాబ్ ఆమ్, యోగి ఆమ్.. అంటూ ప్రముఖులు, సెబ్రిటీల పేర్లు పెట్టి తన వంగడాలకు ప్రాచుర్యం తీసుకువస్తున్నారు. ఉద్యానవన పంటలకు ఆయన చేసిన కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2008లో పద్మశ్రీతో గౌరవించింది.


మరిన్ని

ap-districts
ts-districts