RGUKT: అంధకారంలో బాసర ట్రిపుల్‌ ఐటీ.. చీకట్లోనే విద్యార్థులు భోజనం!

(మొబైల్‌ఫోన్‌ వెలుగులో చదువుకుంటున్న విద్యార్థినులు)

ముథోల్‌: నిర్మల్‌ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీ విద్యాలయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈ మధ్యాహ్నం నుంచి ట్రిపుల్‌ ఐటీలో కరెంటు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విద్యార్థులంతా చీకట్లోనే భోజనాలు చేశారు. సోమవారం మధ్యాహ్నం ట్రాన్స్‌ఫార్మర్‌ పేలిపోవడంతో విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్టు అధికారులు వెల్లడించారు. రాత్రి అయ్యాక కూడా విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ జరగకపోవడంతో విద్యార్థులంతా అంధకారంలోనే ఉండిపోయారు. మొబైల్‌ ఫోన్‌లు, కొవ్వొత్తుల వెలుగులో రాత్రిభోజనం చేశారు. తరగతి గదుల్లోని మొబైల్‌ ఫోన్ల వెలుగుల్లోనే కొందరు చదువుకుంటూ కనిపించారు. అయితే, విద్యుత్‌ను ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియడంలేదు. ఆర్జీయూకేటీ డైరెక్టర్‌ సురేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. మరమ్మతు పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించనున్నట్టు చెప్పారు. 


మరిన్ని

ap-districts
ts-districts