జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కీలక నిర్ణయం.. ఆ పౌడర్‌కు గుడ్‌బై!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పసిపిల్లలకు పౌడర్‌ అనగానే గుర్తొచ్చేది జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ బేబీ టాల్కమ్‌ పౌడరే. చాలా కంపెనీలు చిన్నారుల కోసం ఈ తరహా పౌడర్లు తీసుకొచ్చినా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టాల్కమ్‌ పౌడర్‌ గుత్తాధిపత్యాన్ని ఆపలేకపోయాయి. ఆ స్థాయిలో సాగుతూ వచ్చింది దాని హవా. అంతగా ప్రాచుర్యం పొందిన బేబీ పౌడర్‌ త్వరలో కనుమరుగు కానుంది. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది నుంచి టాల్క్‌ ఆధారిత బేబీ పౌడర్‌ విక్రయాలను నిలిపివేయాలని ఆ కంపెనీ నిర్ణయించింది. ఇప్పటికే అమెరికా కెనడాలో ఈ పౌడర్‌ విక్రయాలను నిలిపివేసిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌.. వాణిజ్య పరంగా ఈ పోర్ట్‌ఫోలియోను సమీక్షించాక ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

టాల్కమ్‌ పౌడర్‌ బదులు మొక్కజొన్న పిండిని వాడాలని నిర్ణయించినట్లు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ పేర్కొంది. ఈ టాల్కమ్‌ పౌడర్‌తో క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే, తమ పౌడర్‌ సురక్షితమైనదేనన్న తమ వాదనకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని స్పష్టంచేసింది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పోకడలు, ప్రాథమ్యాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ పేర్కొంది.

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ విక్రయించే బేబీ టాల్కమ్‌ పౌడర్‌లో క్యాన్సర్‌ కారకాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కోర్టుల్లో అనేక వ్యాజ్యాలు దాఖలయ్యాయి. టాల్కమ్‌ పౌడర్‌ చర్మాన్ని పొడిగా ఉంచడంతో పాటు దద్దుర్లు రాకుండా కాపడుతుంది. అయితే, ఇందులో వినియోగించే ఆస్‌బెస్టాస్‌ క్యాన్సర్‌కు కారకంగా మారుతోందని పరిశోధనలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల నుంచి న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. దీంతో 2020లో అమెరికా, కెనడా మార్కెట్‌లో ఈ పౌడర్‌ విక్రయాలను పక్కనపెట్టింది. విక్రయాలు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో కంపెనీ పేర్కొంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా విక్రయాలు నిలిపివేయాలని నిర్ణయించింది. ఎట్టకేలకు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ఓ మంచి పనిచేసిందని, కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైందని వినియోగదారుల తరఫు న్యాయస్థానాల్లో వాదనలు వినిపించిన న్యాయవాది లీ ఓ డెల్‌ వ్యాఖ్యానించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని