Bangladesh economic crisis: ఆర్థిక సంక్షోభం అంచున బంగ్లాదేశ్‌..!

విదేశీ మారకద్రవ్యం కోసం తీవ్ర యత్నాలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

భారత్‌ చుట్టుపక్కల దేశాలు ఆర్థిక సంక్షోభం అంచులకు చేరుకొంటున్నాయి. ఇటీవల శ్రీలంక దివాలా తీయగా.. పాకిస్థాన్‌ దివాలా అంచుకు చేరింది. మరో పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌ కూడా అంతర్జాతీయ ద్రవ్యనిధి వద్దకు బెయిల్‌ఔట్‌ ప్యాకేజీ కోసం వెళ్లింది. రానున్న మూడేళ్లలో 4.5 బిలియన్ డాలర్లు ఇవ్వాలని కోరింది. మరోవైపు బంగ్లాదేశ్‌ పాలకులు మాత్రం ఆర్థికంగా దేశానికి ఎటువంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు. తక్కువ వడ్డీతో లభించే రుణాలను అవసరాలకు వాడుకోవడానికి ఓ మార్గంగా వాడుకొంటున్నట్టు సమర్థించుకొంది. కానీ, వాస్తవాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి.

అనుమానాలు దేనికి..

బంగ్లాదేశ్‌ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. 416 బిలియన్‌ డాలర్ల జీడీపీతో ప్రపంచంలోనే 33వ స్థానంలో ఉంది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా వ్యవసాయం, సర్వీస్‌ సెక్టార్లపై ఆధారపడి ఉంది. జీడీపీలో 56శాతం ఉన్న దేశ సర్వీస్‌ సెక్టార్‌ కొవిడ్‌ కారణంగా బాగా దెబ్బతింది. దీంతో 11లక్షల మంది నిరుద్యోగులయ్యారు.

* మరో వైపు బంగ్లాదేశ్‌ ఎగుమతుల్లో 84శాతం వాటా ఉన్న రెడీమేడ్‌ దుస్తుల డిమాండ్‌ కూడా కొవిడ్‌ లాక్‌డౌన్ల కారణంగా దెబ్బతింది. ఆర్డర్లు లభించకపోవడం, రద్దు కావడం, చెల్లింపుల్లో ఆలస్యాలు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

* విదేశాల్లో నివసించే బంగ్లాదేశ్‌ వాసులు స్వదేశానికి పంపించే మొత్తాలు కూడా గణనీయంగా తగ్గాయి. ప్రపంచ బ్యాంక్‌ లెక్కల ప్రకారం అత్యధికంగా విదేశాల నుంచి రెమిటెన్సెస్‌లు అందుకొనే దేశాల్లో బంగ్లాదేశ్‌ ఏడో అతిపెద్ద దేశం. 2020-21లో 24.77 బిలియన్‌ డాలర్లు అందుకోగా.. ఆ తర్వాతి ఏడాది 21.03 బిలియన్‌ డాలర్లకు తగ్గిపోయింది.

* రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా చమురు రేట్లు గణనీయంగా పెరగడం కూడా బంగ్లాదేశ్‌కు శాపంగా మారింది. ఫలితంగా దేశ వాణిజ్య లోటు 33 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇది చాలా ఎక్కువ. దీంతోపాటు దేశ రిజర్వు కరెన్సీ నిల్వలు 40 బిలియన్‌ డాలర్ల కంటే కిందకు చేరిపోయాయి. జులై27 నాటికి 39.48 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఫలితంగా బంగ్లాదేశ్‌ టకా విలువ మే నెలలో డాలర్‌కు 86 టకాలు ఉండగా.. ప్రస్తుతం సుమారు 94 టకాల వద్ద కొనసాగుతోంది. దీనికి అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్లు  ఆజ్యం పోశాయి. డాలర్‌ డిమాండ్‌ గణనీయంగా పెరిగింది.

భారీగా పెరిగిన ఇంధన ధరలు..

బంగ్లాదేశ్‌ చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఆగస్టు 5వ తేదీన ఇంధన ధరలను ఇటీవల పెంచారు. డీజిల్‌, కిరోసిన్‌ ధరల్లో 42.5శాతం, పెట్రోల్‌పై 51.1శాతం, ఆక్టేన్‌పై 51.7శాతం ధరను పెంచారు. ఫలితంగా డీజిల్‌ కిరోసిన్‌ 34 టకాలు పెరిగి 114 టకాలకు, పెట్రోల్‌ 86 టకాలు పెరిగి 130 టకాలకు, ఆక్టేన్‌ కూడా 89 టకాలు పెరిగి 135 టకాలకు చేరింది. దీంతో బంగ్లాదేశ్‌లో ఆందోళనలు చోటు చేసుకొంటున్నాయి. 

అప్పుల కోసం తీవ్ర యత్నాలు..

ఢాకా ఐఎంఎఫ్‌ వద్ద 4.5 బిలియన్‌ డాలర్ల రుణంతో పాటు పలు సంస్థల వద్ద అప్పుల కోసం యత్నిస్తోంది. ప్రపంచ బ్యాంక్‌ వద్ద బిలియన్‌ డాలర్ల రుణం కోసం యత్నాలు చేస్తోంది. వివిధ సంస్థల నుంచి 2.5 బిలియన్‌ డాలర్ల రుణం కోసం యత్నిస్తోంది. ఇక జపాన్‌ ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్‌ ఏజెన్సీ నుంచి కూడా రుణం కోసం యత్నిస్తున్నట్లు అట్లాంటిక్‌ కౌన్సిల్‌ కథనంలో పేర్కొంది. ప్రభుత్వం ఆర్థికంగా బలంగా ఉన్నామని చెప్పినా పలు చోట్ల నుంచి రుణాలను తీసుకుంది. 2020 జూన్‌ నాటికి 1.7 బిలియన్‌ డాలర్లు, 2021 అక్టోబర్‌ నాటికి మూడు బిలియన్‌ డాలర్లను రుణాలుగా తీసుకొంది. బడ్జెటరీ సపోర్ట్‌ కింద 2019-20, 2021-22ల్లో 5.8 బిలియన్‌ డాలర్ల రుణం స్వీకరించింది. దేశ వ్యాప్తంగా టీకా కార్యక్రమం కోసం ప్రపంచ బ్యాంక్‌ నుంచి 1.4 బిలియన్‌ డాలర్లు, విదేశీ అప్పుల చెల్లింపుల కోసం ఐఎంఎఫ్‌ నుంచి 732 మిలియన్‌ డాలర్లు అప్పు చేసింది. కొవిడ్‌ మహమ్మారి తర్వాత అనుకున్నంత వేగంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేదన్న విషయాన్ని ఇవి చెబుతున్నాయి.

* బంగ్లాదేశ్‌లో అంతర్గతంగా బ్యాంకింగ్‌ వ్యవస్థ కూడా ఇబ్బందుల్లో ఉంది. ఒక్క 2019లోనే 11.11 బిలియన్‌ డాలర్ల రుణాలు దేశీయంగా ఎగవేసినట్లు ఆ దేశ సెంట్రల్‌ బ్యాంక్‌ వెల్లడిస్తోంది. కానీ, ఐఎంఎఫ్‌ మాత్రం ఈ ఎగవేతల మొత్తం కనీసం రెట్టింపు ఉండొచ్చని చెబుతోంది.

ప్రస్తుతం బంగ్లాదేశ్‌ వద్ద ఉన్న రిజర్వులు కొన్ని నెలల విదేశీ చెల్లింపులకు మాత్రమే సరిపోతాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ ఎగుమతులు పెరిగి విదేశీ కరెన్సీ రిజర్వులు పుంజుకోకపోతే ఆ దేశం మరిన్ని ఆర్థిక కష్టాలు ఎదుర్కోక తప్పదు.


మరిన్ని

ap-districts
ts-districts